విమానంలో మంటలు..
టేక్ఆఫ్ తీసుకుంటున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 383 ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించి, అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 20మంది గాయాల పాలవ్వగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చికాగో ఓహేర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో రన్‌వే నుంచి రాత్రి 2.45 నిమిషాలకు టేక్ ఆఫ్ తీసుకుంటుండగా ఈ ఘటన సంభవించిన్నట్టు అథారిటీలు పేర్కొన్నారు. మొత్తం 170 మందితో ఈ విమానం టేక్ఆఫ్ అవ్వబోయింది. కానీ ఇంజిన్‌లో తలెత్తిన మెకానికల్ సమస్యతో, కేవలం 10 నుంచి 15 సెకన్లలోనే విమానంలో మంటలు వ్యాపించినట్టు ఎయిర్‌లైన్స్ అధికార ప్రతినిధి లెస్లీ స్కాట్ తెలిపారు.
రన్‌వేపై వేగవంతం కాబోయిన విమానం వెలుపల మొదట పెద్ద పెద్ద పేలుళ్ల సంభవించి, దట్టమైన పొగలు వ్యాపించాయని, దీంతో తామంతా భయాందోళనకు గురయ్యామని ఓ ప్రయాణికురాలు చెప్పింది. కుడివైపు ఉన్న ప్రయాణికులందరూ కూడా ఎడమవైపు పడిపోయినట్టు పేర్కొంది. డోర్లు తెరవమని గట్టిగా కేకలు అరుస్తున్న సమయంలోనే విమానంలోకి మంటలు వ్యాపించినట్టు ప్రయాణికులు చెబుతున్నారు. దీంతో వెంటనే ఎమర్జెన్సీ స్లైట్ ద్వారా ప్రయాణికులందరినీ బయటికి పంపించి, బస్సుల సహకారంతో వారిని టెర్మినల్‌కు తరలించామని ఎయిర్‌లైన్స్ అధికారులు తెలిపింది. ఈ ఘటనపై నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు విచారణ చేపట్టనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. కాగ, 2003లో తయారుచేసిన ఈ విమానం, ఆ మోడల్లో అమెరికన్ యంగెస్ట్ ఫ్లైన్గా పేరొంది.