భారతీయుడికి జాక్పాట్
న్యూయార్క్: మైక్రో బ్లాగింగ్ సైటు ట్విట్టర్ పబ్లిక్ ఇష్యూ ఆ సంస్థ వ్యవస్థాపకులకు, ఇన్వెస్టర్లకు కాసుల పంట పండించింది. ఇందులో ప్రవాస భారతీయ ఇన్వెస్టరు సుహైల్ రిజ్వీ కూడా ఉన్నారు. రిజ్వీకి ఉన్న 15.6 శాతం వాటాకు 3.8 బిలియన్ డాలర్ల విలువను తెచ్చిపెట్టింది. ఆయన వ్యక్తిగతంగా, తన క్లయింట్ల తరఫున ట్విట్టర్లో సుమారు 1 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశారని అంచనా. గురువారం న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్టయిన ట్విట్టర్ షేరు ధర ఏకంగా 73 శాతం ఎగిసి 44.90 డాలర్ల వద్ద ముగియడంతో రిజ్వీ వాటాల విలువ కూడా దానికి అనుగుణంగానే ఎగసింది. 47 ఏళ్ల రిజ్వీ సిలికాన్ వ్యాలీలో ఒక మిస్టరీ ఇన్వెస్టరు. రిజ్వీ ట్రావర్స్ మేనేజ్మెంట్ అనే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ నిర్వహించే రిజ్వీ భారత్లో జన్మించారు. అమెరికాలో పెరిగారు. మీడియాకు దూరంగా ఉండే రిజ్వీకి.. వర్జిన్ గ్రూప్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ వంటి శక్తిమంతమైన స్నేహితులు ఉన్నారు. కానీ, ఆయన గురించి, ఆయన ఇన్వెస్ట్మెంట్ల గురించి బైటి ప్రపంచానికి ఎక్కువగా తెలియదు. పబ్లిక్ ఇష్యూకి సంబంధించిన పత్రాలు దాఖలు చేసే దాకా రిజ్వీ గురించి తెలియలేదంటే ఆయన గోప్యత ఎంతో అర్థమవుతుంది.
టెలికంలోనూ పెట్టుబడులు..
టెక్ కంపెనీల కన్నా ముందుగా.. రిజ్వీ టెలికం, తయారీ రంగ కంపెనీల్లో గణనీయంగా ఇన్వెస్ట్ చేశారు. ప్రధానంగా ఎంటర్టైన్మెంట్పైనా దృష్టి పెట్టారు. హాలీవుడ్లో పెట్టుబడులపై 2011లో ఆయన మంచి లాభాలనే ఆర్జించారు. అదే సమయంలో క్రిస్ సాకా అనే ఏంజెల్ ఇన్వెస్టర్ నుంచి ట్విట్టర్ షేర్లను కొన్నారు. అటు తర్వాత తన క్లయింట్ల తరఫున ట్విటర్ ఉద్యోగుల నుంచి కూడా షేర్లను కొన్నారు. ట్విట్టరే కాకుండా ఫ్లిప్బోర్డ్, పింట్రెస్ట్ తదితర సంస్థల్లోనూ రిజ్వీ ఇన్వెస్ట్ చేశారు.
ట్విట్టర్ ఫౌండర్లకు బిలియన్ డాలర్ల లాభం..
ఐపీవోతో ట్విట్టర్ సహవ్యవస్థాపకులు ఇవాన్ విలియమ్స్, జాక్ డార్సీ పెట్టుబడుల విలువ ఒకే రోజున బిలియన్ డాలర్లకు పైగా ఎగసింది. విలియమ్స్ వ్యక్తిగత సంపద 1.07 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. డార్సీ అర బిలియన్ డాలర్ల మేర లాభపడ్డారు. విలియమ్స్కి ట్విట్టర్లో 5.7 కోట్ల షేర్లు ఉండగా, డార్సీకి 2.35 కోట్ల షేర్లు ఉన్నాయి. తాజా ఐపీవోతో వీరిరువురి సంపద విలువ 3.6 బిలియన్ డాలర్లకు పెరిగింది. అటు కంపెనీ సీఈవో డిక్ కోస్టొలో సంపద 145 మిలియన్ డాలర్లు పెరిగి 345 మిలియన్ డాలర్లకు చేరింది.