ఇద్దరు మహిళా సీఎంలు మళ్లీ గెలిచేనా?
ఇది ఎన్నికల నామ సంవత్సరం. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అసోం రాష్ట్రాలతోపాటు పుదుచ్చేరి అసెంబ్లీకి శుక్రవారం ఎన్నికల నగారా మోగింది. దేశ రాజకీయాలనే మలుపు తిప్పనున్న ఈ ఎన్నిలను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. పలు కారణాల వల్ల తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ఎన్నికలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. తమళనాడు సీఎం జయలలిత నాయకత్వంలోని అన్నాడీఎంకే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీ పార్టీలు మరోసారి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు సమాయత్తమవుతున్నాయి. రాజకీయ పరిస్థితులు కూడా వారికి అనుకూలంగానే కనిపిస్తున్నాయి.
అదే జరిగితే జయలలిత నాలుగో విడత ముఖ్యమంత్రిగా అధికారంలో కొనసాగుతారు. 34 ఏళ్ల వామపక్షాల పాలనకు తెరదించిన మమతా బెనర్జీ రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకుంటారు. ఈ ఇరువురు తమ తమ రాష్ట్రాల్లో బలమైన, శక్తిమంతమైన నాయకులే కాకుండా ఇద్దరు మహిళలే అవడం విశేషం కాగా, ఇద్దరు కూడా పెళ్లి చేసుకోలేదు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 81 లోక్‌సభ స్థానాలు ఉండగా, 2014 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ పవనాలను తట్టుకొని వారు వాటిని గెల్చుకోగలగారు.
తమిళనాడులో జయలలిత ప్రధాన ప్రత్యర్థి కరుణానిధి నాయకత్వంలోని డీఎంకే తిరిగి అధికారంలోకి వచ్చేందుకు కుస్తీ పడుతోంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పొత్తును ప్రకటించడం, ప్రధాన ప్రతిపక్షంగా ఉంటున్న సినీనటుడు విజయ్‌కాంత్ నాయకత్వంలోని డీఎండీకే కూడా పొత్తుకు మొగ్గు చూపడం డీఎంకేకు కలిసొచ్చే అవకాశం. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలసి పోటీచేసిన విజయ్‌కాంత్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకొచ్చేసరికి దూరం జరగడం గమనార్హం. తమిళనాడులో కూడా తాము బలమైన శక్తిగా ఎదిగేందుకు పునాదులు వేసుకోవాలని చూస్తున్న బీజేపీ ఇప్పటికీ విజయ్‌కాంత్‌తో చర్చలు జరుపుతూనే ఉంది. కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్ పార్టీ నుంచి వైదొలిగి వేరే పార్టీ పెట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలహీన పడింది. జీకే వాసన్ నాయకత్వంలోని తమిళ మానిల కాంగ్రెస్ పార్టీ అన్నాడీంకేతో వెళ్లే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. వైకో నాయకత్వంలోని ఎండీఎంకే, మిగతా చిన్న పార్టీలైన వీసీకే, డీకే, సీపీఐ, సీపిఎం, ముస్లిం లీగ్ పార్టీలు కూడా డీఎంకే నాయత్వంలోని కూటమిలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాని వల్ల డీఎంకే నైతికస్థైర్యం పెరగనుంది. ప్రజాదరణ పొందిన ఎన్నో 'అమ్మ' పథకాలు జయలలితకు కలిసొచ్చే అంశాలు.
మమతా దీదీ పట్టు
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ బలంగా ఉన్నారు. 2011లో అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన నాటి నుంచి జరిగిన అన్ని ఎన్నికల్లో ఆమె పార్టీ విజయం సాధిస్తూ వచ్చారు. 34 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన వామపక్షం ఇప్పటికీ రాష్ట్రంలో బలహీనంగానే ఉంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కలుపుకొని వెళ్లినా మమతకు గట్టి పోటీనిచ్చే అవకాశాలు కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ స్వతహాగా రాష్ట్రంలో తృతీయ శక్తిగానే ఉండడంతో టీఎంసీకి, వామపక్షాల నేతృత్వంలోని కూటమి మధ్యనే ప్రధాన పోటీ ఉంటుంది.
చాందీపై ఆరోపణల వెల్లువ
కేరళ సీఎం ఊమెన్ చాందీ నాయకత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వం అనేక అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయింది. అయినా ఊమెన్ చాందీ ఇప్పటికీ పాపులర్ నాయకుడే. పినరయి విజయన్ నాయత్వంలోని ఎల్డీఎఫ్ ఈసారి అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉంది. ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలతో పాటు ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే అలవాటు కేరళ ఓటర్లకు ఉండడం కలిసొచ్చే అంశం. ఇప్పటికే వెలువడిన పలు పోల్ సర్వేలు కూడా లెఫ్ట్ ఫ్రంట్కే పట్టం గడుతున్నాయి. అయితే విజయన్, మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్ వర్గాలు ఆధిపత్యం కోసం పోటీ పడడం ప్రతికూల అంశం.
రికార్డు సీఎం.. తరుణ్ గొగోయ్
అసోంలో ఎక్కువ కాలం కొనసాగుతున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా తరుణ్ గొగోయ్ ఇప్పటికే రికార్డు సృష్టించారు. గత 15 సంవత్సరాలుగా ఆయనే సీఎం. ఆయనను తప్పించేందుకు పార్టీలోనే ఎన్నో ప్రయత్నాలు, కుట్రలు జరిగినా తన చాతుర్యంతో పదవిని నిలబెట్టుకున్నారు. ఒకప్పటి ఆయన సన్నిహితుడు హిమంత విశ్వశర్మ ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. బీజేపీ తన కేంద్రమంత్రి సర్వానంద సోనోవాల్‌ను ఇప్పటికే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. అసోం గణ పరిషత్ పొత్తు పెట్టుకోవడం బీజేపీకి ఈ ఎన్నికల్లో కలిసొచ్చే అంశం. మరో పార్టీ ఏయూడీఎఫ్ ఒంటరిగా పోటీచేయాలని నిర్ణయించుకోవడం, 15 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీయే అధికారంలో కొనసాగడం, ఏజీపీతో పొత్తు కారణంగా ఈసారి బీజేపీ విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎన్నికల సర్వేలు తెలియజేస్తున్నాయి.
కొత్త పార్టీతో రంగస్వామి
కేవలం 30 అసెంబ్లీ సీట్లు మాత్రమే ఉన్న పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీని పెట్టిన ఎన్ రంగస్వామి.. ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఏఐఎన్ఆర్ కాంగ్రెస్ మరోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆయన పాపులర్ లీడర్.