సెక్యూరిటీ గార్డ్స్ అయినా లక్ష్యం వెంటే..
హర్యానా/ముంబయి: ఆ రోజు రక్షా బంధన్.. హర్యానాలోని ఓ ఎటీఎం వద్దకు హర్షవత్ అనే వ్యక్తి డబ్బులు డ్రా చేసుకునేందుకు వెళ్లాడు. అది రాత్రి సమయం కూడా. ఏటీఎం వద్ద సెక్యూరిటీ గార్డుగా బైలిందర్ సింగ్ అనే యువకుడు విధుల్లో ఉన్నాడు. అయితే, అతడి చేతిలో కర్రకు బదులు పుస్తకం ఉంది. చక్కగా ఏటీఎం ముందు కూర్చొని వీధిలైటుకింద చదువుకుంటున్నాడు. ఈరోజుల్లో ఇలాంటి యువకుడా అని హర్షవత్కు ఆశ్చర్యం వేసి దగ్గరికి వెళ్లి ప్రశ్నించాడు. దీనికి అతడిచ్చిన సమాధానం త్వరలో తనకు ఓ ప్రవేశ పరీక్ష ఉందని, దానికి ప్రిపేర్ అవుతున్నానని చెప్పాడు.
లోపల ఏసీలో కూర్చొని చదువుకోవచ్చుగా అంటే తనకు బయట కూర్చున్నాననే ఆలోచనే రాలేదని, తనకు ఏటీఎం లోపల అసౌకర్యంగా ఉంటుందని చెప్పాడు. ఆ సీన్ చూసి వెంటనే హర్షవత్ ఫేస్ బుక్‌లో అతడి ఫొటోలతో సహా పెట్టాడు. బైలిందర్ సింగ్ చేస్తున్న పనిని హర్షించాడు. చాలామంది తమకు క్లిష్ట సమయాల వల్ల లక్ష్యం చేరుకోలేకపోతున్నామని చెప్తుంటారని, అలాంటివారికి బైరిందర్ ఒక స్ఫూర్తి అని, లక్ష్య సాధనకు ఎలాంటి పరిస్థితిని అయినా ఉపయోగించుకోవచ్చని తెలియజేస్తోందని అన్నారు. ఈ పోస్ట్‌ను దాదాపు పదివేలమంది షేర్ చేసుకున్నారు.
ఇక బైలిందర్ మాదిరిగానే సాగర్ అశోక్ రావు భగత్ ముంబయిలోని చాందివలిలోగల వుడ్ లాండ్ హైట్స్ లో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నాడు. అతడు బీఈ డిగ్రీ చదువుతున్నాడని, జావా ప్రోగ్రామింగ్ పుస్తకాన్ని చదువుతూ కనిపించాడు. సంబంధిత సబ్జెక్టులో నిపుణుడిగా ఎదగడం తన లక్ష్యమని శ్రీజేష్ కృష్ణన్‌కు తెలిపాడు. ఈ విషయం కూడా శ్రీజేష్ను కదిలించి అతడి ఫొటోలను ఫేస్ బుక్‌లో పెట్టగా వేలమంది షేర్ చేసుకున్నారు.