వరదలు: షాకింగ్ వీడియో
బెంగళూరు: కేరళలో వరద బీభత్సం మరింత ఉగ్రరూపం దాల్చింది. గత ఏడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు కేరళను వణికిస్తున్నాయి. గత శతాబ్దంలో కురవని వర్షాలు రాష్ట్నాన్ని ముంచెత్తాయి. లక్షలాది మందిని నిరాశ్రయులను చేసింది. మృతుల సంఖ్య 87కి చేరింది. చివరికి సహాయశిబిరాలు కూడా వరదల్లో చిక్కుకున్న పరిస్థితి అక్కడ నెలకొంది. మరోవైపు కర్నాటకను భారీ వర్షాలు ముంచెత్తాయి. కొడగు జిల్లాకు సంబంధించిన ఒక షాకింగ్వీడియో వైరల్ గా మారింది. ఒక కొండ అంచున ఉన్న రెండు అంతస్థుల భవనం కొన్నిసెకన్లుపాటు అలా కదలిపోయింది. అతి ప్రమాదకర పరిస్థితిలో అలా ప్రవహిస్తూ మట్టితో పాటు కొట్టుకుపోవడం ఈ వీడియోలో చూడవచ్చు. వరద పరిస్థితికి ఈ భయంకరమైన వీడియో అద్దం పడుతోంది. కర్నాటకలోని మూడు జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
అదృష్టవశాత్తూ, ఆ సమయంలో భవనంలో ఎవరూ లేరని జిల్లా పరిపాలక అధికారులు ప్రకటించారు. మడికేరికి సమీపంలోని కట్టకేరి, తంతితాల గ్రామాలలో దాదాపు 300 మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి, సమీపంలోని కొండపైన, రక్షక చర్యలకోసం ఎదురు చూస్తున్నట్టు కొడగు జిల్లా డిప్యూటీ కమీషనర్ శ్రీవిద్యా తెలిపారు.
కాగా వాతావరణ శాఖ లెక్కల ప్రాకరం కేరళలో జూన్ 1, ఆగష్టు 15 మధ్యకాలంలో 2091.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 1600 మిల్లీమీటర్లతో పోలిస్తే ఇది 30.7శాతం ఎక్కువ. ఆగస్టు9, 15 మధ్య తేదీల్లో సగటున 98.5 మి.మీ.కు బదులుగా 352 మి.మీ సగటు వర్షపాతం నమోదయింది. ఇది 257 శాతం ఎక్కువ. ఇడుక్కి జిల్లాలో సాధారణంకంటే 447.6శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. మరోవైపు ఆర్మీ బృందం సహాయ రక్షక చర్యలకోసం గురువారం తిరువనంతపురం చేరుకుంది.