ముగిసిన పాంపోర్ ఆపరేషన్: ఉగ్రవాదులు ఫినిష్
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లోని పుల్వామా జిల్లా పాంపోర్ లో దాదాపు 50 గంటలు కొనసాగిన ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ బుధవారం మధ్యాహ్నం తర్వాత ముగిసింది. ఎంటర్‌ప్రెన్యూర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్(ఈడీఐ) హాస్టల్ భవంతిలో నక్కిన ఇద్దరు ఉగ్రవాదులనూ మట్టుపెట్టామని, వారి నుంచి రెండు ఏకే 47 తుపాకులను స్వాధీనం చేసుకున్నామని ఆపరేషన్ కు నేతృత్వం వహించిన మేజర్ జనరల్ అశోక్ నరూలా (జీవోసీ విక్టర్ ఫోర్స్) మీడియాకు చెప్పారు.
సోమవారం తెల్లవారుజామున పడవలో జీలం నదిని దాటి వచ్చి, ఈడీఐ బిల్డింగ్ లోకి చొరబడ్డ ఉగ్రవాదులు మూడు రోజులుగా ఎడతెరపిలేకుండా కాల్పులు జరుపుతున్నారు. అయితే బుధవారం మధ్యాహ్నానికి కాల్పుల ఉధృతి తగ్గడంతో భద్రతా బలగాలు లోపలికి ప్రవేశించి, ముష్కరులను మట్టుపెట్టాయి. 'ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టినప్పటికీ, ఈడీఐ హాస్టల్ బిల్డింగ్ లో మొత్తం 122 గదులున్నందున అణువణువూ తనిఖీ చేస్తున్నాం. చనిపోయిన ఇద్దరూ లష్కరే తాయిబాకు చెందిన ఉగ్రవాదులని భావిస్తున్నాం'అని మేజర్ జనరల్ అశోక్ అన్నారు.
మనవైపు ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదన్న ఆయన.. పాంపోర్ ఘటనను ఉగ్రవాదుల జిత్తులమారి చర్యగా అభివర్ణించారు. మొదట ముగ్గురు ఉగ్రవాదులు బిల్డింగ్ లోకి చొరబడి ఉండొచ్చని భద్రతా బలగాలు అనుమానించాయి. ముష్కరులు తప్పించుకోకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతాని అధీనంలోకి తీసుకున్న భద్రతా బలగాలు పెద్ద ఎత్తున మోర్టార్ షెల్స్ తో ప్రతిదాడి చేశారు. చివరికి పారా కమెండోలు రంగంలోకిదిగి మనవైపు ఎలాంటి ప్రాణనష్టం కలగకుండా ఆపరేషన్ ముగించారు.