రూ.3 కోట్లకు కుచ్చుటోపీ
►ఉడాయించిన ఇద్దరు వ్యాపారులు
►పోలీసులను ఆశ్రయించిన కమీషన్ ఏజెంట్లు
►ఎమ్మిగనూరు యార్కెట్ యార్డులో కలకలం
ఎమ్మిగనూరు టౌన్ : స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌లో అన్నదమ్ములైన ఇద్దరు వ్యాపారులు (బయ్యర్స్) రూ.3కోట్ల చెల్లింపులు చేయకుండా ఊడాయించారు. వారం రోజులు నుంచి వారు కనిపించకపోవడంతో ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్లి ఉంటారని కమీషన్ ఏజెంట్లు భావించారు. అనుమానం వచ్చి కొందరు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ముందస్తు ప్రణాళికలో భాగంగా ఇంట్లో విలువైన సామాన్లతో పాటు పాఠశాలల నుంచి పిల్లల టీసీలను కూడా తీసుకొని పకడ్బందీగా వెళ్లారని తెలుసుకొని వ్యాపారులు గొల్లుమన్నారు.
వారి బంధువులు నివసించే ముంబాయి, బళ్లారి, రాయచూర్.. తదితర ప్రాంతాలకు కూడా కొంత మంది కమీషన్ ఏజెంట్లు వెళ్లివచ్చినా వారి జాడ తెలియలేదు. ఆ ఇద్దరు అన్నదమ్ములు ఆశా ట్రేడర్స్, అతావుల్లా ట్రేడర్స్ పేరుతో రెండు టేడ్‌లపై కమీషన్ ఏజెంట్ల ద్వారా రైతుల నుంచి సరుకులను కొనుగోలు చేస్తూ వచ్చారు. మార్కెట్లోని దాదాపు 30మంది కమీషన్ ఏజెంట్లకు దాదాపు రూ.3కోట్ల వరకు వారు చెల్లించాల్సి ఉంది.
ఒక్కొక్క కమీషన్ ఏజెంట్‌కు రూ.20లక్షల నుంచి రూ.54లక్షల వరకు ఆ ఇద్దరు అన్నదమ్ములు చెల్లింపులు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోమార్కెట్‌యార్డ్ కమీషన్ ఏజెంట్ల అసోసియేషన్ నాయకులు ఆదివారం.. పట్టణ ఎస్ఐను ఆశ్రయించి అసలు విషయం చెప్పడంతో పాటు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హామీ ఇచ్చారు.