జలాశయం గేటు విరిగి.. ఇద్దరు మహిళల గల్లంతు
తాటిపూడి జలాశయం గేటు విరగడంతో అక్కడకు సమీపంలో దుస్తులు ఉతుక్కుంటున్న ఇద్దరు మహిళలు కొట్టుకుపోయారు. విజయనగరం జిల్లాలోని మూడు మండలాలకు సాగునీటితో పాటు విశాఖపట్నం నగరానికి తాగునీరు అందించడానికి ప్రధాన ఆధారంగా ఉన్న తాటిపూడి జలాశయం గేట్ల నిర్వహణ సరిగా లేదని ఎప్పటినుంచో ఆరోపణలు వస్తున్నాయి.
దానికి మొత్తం నాలుగు ప్రధాన గేట్లు ఉండగా, వాటిలో మొదటి గేటు శనివారం ఉదయం విరిగిపోయింది. దాంతో ఒక్కసారిగా పైనున్న నీళ్లన్నీ ఉధృతమైన ప్రవాహంతో కిందకు వచ్చేశాయి. కిందివైపు దుస్తులు ఉతుక్కుంటున్న ఇద్దరు మహిళలు ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. విజయనగరం జిల్లాలోని గంట్యాడ, శృంగవరపుకోట, జామి మండలాలకు ఈ జలాశయం నుంచే నీళ్లు వస్తాయి. అయితే ఒక్కసారిగా నీరు ముంచెత్తడంతో సమీప ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలలో ఉన్నారు. వెంటనే అడ్డుకట్ట వేయకపోతే మొత్తం గ్రామాలన్నీ ముంపునకు గురవుతాయని చెబుతున్నారు.