రెండు మండలాలు జనగామలో కలిపేందుకు మద్దతు
ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
రఘునాథపల్లి : కొత్తగా జనగామ జిల్లా ఏర్పడితే ప్రజల ఆకాంక్ష మేరకు రఘునాథపల్లి, లింగాలఘణపురం మండలాలు అందులో కలిపేందుకు తన పూర్తి మద్దతు ఉంటుందని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలో పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సబ్ కమిటీకి తాను కొత్తగా జనగామ జిల్లా చేయాలని కోరానే తప్ప మండలాల ప్రస్తావన తీసుకురాలేదని పేర్కొన్నారు. భౌగోళికంగా ఏ జిల్లాకు మండలాలు దగ్గరలో ఉంటే ఆ మండలాలను అందులో కలపాల్సి ఉంటుందన్నారు. రఘునాథపల్లి, లింగాలఘణపురం మండలాలు తిరిగి జనగామ పాత నియోజక వర్గంలో కలువాలని ప్రజలు కోరుకుంటున్నారని, వారితో తాను ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. దర్మసాగర్, జఫర్‌గఢ్, స్టేషన్‌ఘన్‌పూర్ మండలాల ప్రజల అభీష్టం మేరకు నడుచుకుంటానని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో ధర్మసాగర్ జెడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, జఫర్‌గఢ్ ఎంపీపీ గుజ్జరి స్వరూప, నాయకులు రాంబాబు, బుచ్చయ్య, బ్రహ్మారెడ్డి,తదితరులు పాల్గొన్నారు.