గోడ కూలి ఇద్దరు మృతి
రోలుగుంట: విశాఖ జిల్లా రోలుగుంట మండలం వడ్డిప గ్రామంలో ఓ పాడుబడిన ఇంటిని కూలగొడుతుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామానికి చెందిన ఎల్. లింగయ్యపాత్రుడుకు చెందిన పెంకిటిల్లు పాడుబడింది. కొత్త ఇంటి నిర్మాణానికి వీలుగా ఆ ఇంటిని సోమవారం కూలగొట్టడం ప్రారంభించారు. మధ్యాహ్నం వరకూ ఇంటి పైకప్పు తొలగించారు. భోజనాల అనంతరం మధ్యాహ్నం గోడలు తొలగించే పనులు చేపట్టారు. ఇటీవల వర్షాలకు బాగా నానిపోయిన గోడ ఒక్కసారిగా అక్కడున్న ఐదుగురు కూలీలపై పడిపోయింది. తీవ్రంగా గాయపడిన వారందరినీ 108 వాహనంలో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో లంక జనాపాత్రుడు(45), లంక రాము(30) చనిపోయారు. వీరాపాత్రుడు, ఆనంద్, వరహాలబాబులను నర్సీపట్నం ఏరియా అస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. వీఆర్వో శ్రీనివాసరావు ఇచ్చిన సమాచారంతో రోలుగుంట ఇన్చార్జి ఎస్ఐ పి.రమేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణాలను ఆరా తీశారు. పోస్టుమార్టానికి మృతదేహాలను నర్సీపట్నం ఏరియా అస్పత్రికి తరలించారు. తహసీల్దార్ అప్పలనాయుడు గ్రామానికి వెళ్లి ప్రమాద వివరాలు తెలుసుకొన్నారు.