శ్రవణపేయంగా త్యాగరాజ కీర్తనలు
తెనాలి: శ్రీసీతారామ గానసభ 70వ వార్షిక సంగీత ఉత్సవాలు 10వ రోజయిన బుధవారం రాత్రితో ముగిశాయి. ఇక్కడి మూల్పూరు సుబ్రహ్మణ్యశాస్త్రి కళ్యాణ మండపంలో జరిగిన ఈ ఉత్సవాల్లో చివరిరోజు రాత్రి త్యాగరాజ వైభవం, ప్రఖ్యాత త్యాగరాజ కీర్తనలు, వ్యాఖ్యాన సహితంగా నిర్వహించటం విశేషం. సంగీత త్రిమూర్తులైన శ్యామశాస్త్రి, త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్ భూమికములుగా ఆయా విద్వాంసుల ఆధ్యాత్మిక ప్రవృత్తి ఆధారంగా కార్యక్రమం జరిపారు. ప్రధాన భూమికగా త్యాగరాజస్వామి జీవితంలో ఆయన రచించిన విశేష సంగీత కృతులను విజయవాడకు చెందిన చావలి రామకృష్ణ ఆలపించారు. ముఖ్య కీర్తనలకు బ్రహ్మర్షి ములుకుట్ల బ్రహ్మానందశాస్త్రి చేసిన వ్యాఖ్యానం ఆకట్టుకుంది. చావలి శ్రీనివాస్ వయొలిన్పై కృష్ణమోహన్ మృదంగంపై సహకరించారు. గానసభ అధ్యక్షుడు ఆచార్య పిరాట్ల నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.