దారుణంపై వెల్లువెత్తిన నిరసనలు
దేశ రాజధానిలో ‘నిర్భయ’ ఘటన నుంచి తేరుకోకముందే రాష్ట్ర రాజధానిలో ‘అభయ’ ఘటన జరగడంపై సర్వత్రా దిగ్భ్రాంతి వ్యక్తమైంది. ఇంత పెద్ద మహానగరంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మహిళలు, ప్రజాసంఘాలు, వివిధ పార్టీల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. దారుణానికి ఒడిగట్టిన కీచకులను ఆషామాషీగా కాకుండా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ‘అభయ’ ఘటనను వ్యతిరేకిస్తూ బుధవారం నగరంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. మహిళా సంఘాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనకు దిగారు.
భారతీయ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. భారీగా చేరుకున్న మహిళలు ప్లకార్డులు ప్రదర్శించి రక్షణ కల్పించాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. మహిళలపై అఘాత్యాయిల నివారణకు ప్రత్యేక చట్టాలు చేసినప్పటికీ లైంగిక వేధింపులు, అత్యాచారాలను నివారించడంలో పోలీసులు విఫలమయ్యారని మోర్చా రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఉమామహేశ్వరి దుయ్యబట్టారు.
రాజేంద్రనగర్‌లో బీజేపీ మహిళా మోర్చా నేతలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎన్జీరంగా వర్సిటీ క్రీడాప్రాంగణం నుంచి ప్రేమావతీపేట బస్తీ వరకు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు.
మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు రామక ృష్ణ విమర్శించారు. ‘అభయ’ ఘటనను వ్యతిరేకిస్తూ రాంనగర్ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎడ్యుకేషన్ హబ్‌గా ఉన్న నగరంలో ‘అభయ’లాంటి ఘటనలు నగరస్థాయిని దిగజారుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
నగరంలో రాత్రి సమయాల్లో పెట్రోలింగ్‌ను ఉద్ధృతం చేయాలని, బహిరంగప్రదేశాల్లో సీసీ కెమెరాల సంఖ్యను పెంచాల ని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు జ్యోతి డిమాండ్ చేశారు. మహిళలపై వేధింపులు,అత్యాచారాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ గోల్కొండ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
మహానగరంలో జరుగుతున్న ఘటనలతో మహిళా ఉద్యోగులు ఇంటికొచ్చే వరకు తల్లిదండ్రులు భయపడాల్సిన దుస్థితులు ఏర్పడ్డాయని పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.లక్ష్మణ్ అన్నారు. మాదాపూర్ సైబర్‌టవర్ వద్ద అత్యాచారాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ఒంటరిగా ఉన్నప్పుడు క్యాబ్‌లలో ప్రయాణించొద్దని..ఐటీ ప్రదేశాల్లో సీసీ కెమెరాలు, ఆర్టీసీ సర్వీసులను పెంచాలని డిమాండ్ చేశారు.