Tyson Fury
-
నువ్వు మనిషి కాదు.. రాక్షసుడివి..!
లాస్ వేగాస్: ప్రపంచ బాక్సింగ్ కౌన్సిల్(డబ్యూబీసీ) హెవీ వెయిట్ ఛాంపియన్‌షిష్‌లో విజేతగా నిలిచిన తర్వాత బ్రిటన్ బాక్సర్ టైసన్ ఫ్యూరీ చేసిన ఓ పనికి ఎంజీఎం గ్రాండ్ గార్డెన్ ఎరీనాలో ఉన్నవారు ఆశ్చర్యపోయారు. ఆదివారం జరిగిన టైటిల్ పోరులో అమెరికా చాంపియన్ బాక్సర్ డియోంటి వైల్డర్‌పై విజయం సాధించిన ఫ్యూరీ ప్రత్యర్థిని కౌగిలించుకొని అతని నుంచి కారుతున్న రక్తాన్ని నాకడం ఒళ్లు జలదరించేలా చేసింది. ఇరువురి మధ్య ఏడో రౌండ్ వరకూ హోరీ హోరీ పోరు జరగ్గా, ఫ్యూరీ పైచేయి సాధించాడు. వైల్డర్‌కు తన పంచ్‌ల పవర్‌తో చుక్కలు చూపించాడు. తన ప్రొఫెషనల్ కెరీర్లోనే ఓటమి లేని వైల్డర్‌పై కసిదీరా పంచ్‌లు విసిరాడు. ఎలాగైనా చాంపియన్‌గా నిలవాలనే కసితో రింగ్‌లో పదునైన పంచ్‌లను రుచి చూపించాడు. ఈ క్రమంలోనే వైల్డర్ చెవికి, నోటికి గాయం కావడంతో రక్తం వచ్చింది. బౌట్ జరిగిన తీరు కొందర్నీ ఆశ్చర్య పరిస్తే, ‘జిప్సీకింగ్’గా పలువబడే అతను తన ప్రత్యర్థి రక్తాన్ని నాకడాన్నే అందరూ ఆశ్చర్యంగా గమనించారు. అయితే ఫ్యూరీ రక్తాన్ని నాకుతున్న ఫుటేజీ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ‘ఇతను మనిషి కాదు రాక్షసుడు’ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
చిక్కుల్లో బాక్సింగ్ చాంపియన్
మాంచెస్టర్: వరల్డ్ హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్ టైసన్ ఫ్యూరీ(బ్రిటన్) చిక్కుల్లో పడ్డాడు. విద్వేష నేరాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో అతడిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హోమోసెక్సువాలిటీ గురించి చేసిన వ్యాఖ్యలకు తోడు నిబంధనలకు విరుద్ధంగా ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఫెడరేషన్(ఐబీఎఫ్) బెల్ట్ విప్పాడనన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. టైసన్ ఫ్యూరీపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేపట్టామని గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు తెలిపారు. నవంబర్ 28న జరిగిన వరల్డ్ హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో వ్లాదిమిర్ (ఉక్రెయిన్)ను ఓడించి టైసన్ ప్యూరీ విజేతగా నిలిచాడు. -
'మరోసారి అతనితో మ్యాచ్ నిర్వహించండి'
బెర్లిన్: వ్లాదిమిర్ క్లిచ్ కో.. అతను తిరుగులేని బాక్సింగ్ చాంపియన్. 2004 నుంచి ఓటమి అనేది ఎరుగకుండా డబ్యూబీఏ, ఐబీఎఫ్, ఐబీవో, డబ్యూబీవో వంటి టైటిల్స్ ను తన ఖాతాలో వేసుకుని అప్రతిహత జైత్రయాత్ర సాగిస్తున్న వ్లాదిమిర్(ఉక్రెయిన్)కు ఇటీవల టైసన్ ఫ్యూరీ(బ్రిటన్)చెక్ పెట్టాడు. గత శనివారం డ్యూసెలదార్ఫ్ లో వరల్డ్ హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో వ్లాదిమిర్ ను ఓడించిన ఫ్యూరీ సరికొత్త చరిత్రను సృష్టించాడు. కాగా, మరోసారి అతనితో మ్యాచ్ నిర్వహిస్తే తన సత్తాను చాటుతానంటున్నాడు వ్లాదిమిర్. టైసన్ ఫ్యూరీతో సాధ్యమైనంత త్వరలో రీ మ్యాచ్ నిర్వహించాలంటూ ఓ ప్రకటనలో కోరాడు. 'ఆ మ్యాచ్ లో ఓటమిని చవిచూశా. ఓటమి అనేది ఆప్షన్ కాదు. ఆరోజు మ్యాచ్ లో కొన్ని తప్పిదాల వల్ల ఓడిపోయా. అప్పటి మ్యాచ్ కంటే మరింత ఉన్నతమైన గేమ్ ను ఆడాలని కోరుకుంటున్నా. మరోసారి ఫ్యూరీతో ఆడితే సత్తా చూపిస్తా' అని వ్లాదిమిర్ తెలిపాడు. కాగా, వ్లాదిమిర్ తో మరోసారి మ్యాచ్ ను టైసన్ ఫ్యూరీ ట్రైనర్, అంకుల్ పీటర్ ఫ్యూరీ స్వాగతించాడు. తాము కూడా అదే కోరుకుంటున్నామని పీటర్ స్పష్టం చేశాడు. ముందస్తు ఒప్పందం ప్రకారం ఆ ఇద్దరి బాక్సర్స్ మధ్య మరో మ్యాచ్ జరగాల్సి ఉంది. దీన్ని వచ్చే సంవత్సరం లండన్ లో నిర్వహించే అవకాశం ఉంది. టైసన్ ఫ్యూరీ కొత్త చరిత్ర -
టైసన్ ఫ్యూరీ కొత్త చరిత్ర
బెర్లిన్: అనుభవం ఓడిపోయింది.. అద్భుతం జరిగింది. వరల్డ్ హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో అంచనాలకు మించి రాణించిన టైసన్ ఫ్యూరీ(బ్రిటన్) సరికొత్త చాంపియన్ గా అవతరించాడు. బాక్సింగ్ క్రీడా చరిత్రలో గత 11 ఏళ్లుగా ఓటమి ఎరుగకుండా అప్రతిహత జైత్రయాత్ర సాగిస్తున్న వ్లాదిమిర్ క్లిచ్ కో(ఉక్రెయిన్) కు టైసన్ ఫ్యూరీ తాజాగా చెక్ పెట్టి కొత్త చరిత్ర సృష్టించాడు. డ్యూసెలదార్ఫ్ లో శనివారం జరిగిన పోరులో టైసన్ ఫ్యూరీ 115-112,115-112, 116-111 తేడాతో వ్లాదిమిర్ ను కంగుతినిపించాడు. 2004 నుంచి డబ్యూబీఏ, ఐబీఎఫ్, ఐబీవో, డబ్యూబీవో తదితర టైటిల్స్ ను తన ఖాతాలో వేసుకున్న వ్లాదిమిర్ ను టైసన్ ఫ్యూరీ మట్టికరిపించి వరల్డ్ హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్ షిప్ టైటిల్ ను ముద్దాడాడు. ఆద్యంతం హోరాహోరీగా సాగిన పోరులో టైసన్ ఫ్యూరీ విజయం సాధించినట్లు జడ్జిలు తమ ఏకగ్రీవ నిర్ణయంలో ప్రకటించారు. ఈ విజయంతో టైసన్ ఫ్యూరీ ఆనందంలో మునిగిపోయాడు. తాను విజయం సాధించినందుకు ముందుగా జీసెస్ క్రిస్ట్ కు ధన్యవాదాలు తెలిపాడు. తాను ఏమైతే చేయాలనుకున్నానో దాన్ని రింగ్ లో కచ్చితంగా అమలు చేసినట్లు ఫ్యూరీ తెలిపాడు. ఇప్పటివరకూ 25 ప్రొఫెషనల్ బౌట్లను గెలుచుకున్నతనకు వరల్డ్ హెవీ వెయిట్ చాంపియన్ గా నిలవాలన్నది ఓ కల అని ఫ్యూరీ ఆనంద బాష్పాలు రాల్చాడు. గత కొంత కాలం నుంచి పడ్డ శ్రమకు తగిన ఫలితం దక్కిందన్నాడు. ఈ రోజు కోసం విపరీతంగా కష్టించినట్లు ఫ్యూరీ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా, ఫ్యూరీ వేగం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని వ్లాదిమిర్ తెలిపాడు. త్వరలో తన రిటైర్మెంట్ పై నిర్ణయం వెలువడే అవకాశం ఉందని వ్లాదిమిర్ తెలిపాడు. ఇటీవల 40 ఒడిలోకి అడుగుపెట్టిన వ్లాదిమిర్.. 27 ఏళ్ల వయసుగల ఫ్యూరీ చేతిలో ఓడిపోవడం బాక్సింగ్ విశ్లేషకుల్ని సైతం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. ముందు నుంచి ఈ పోరులో వ్లాదిమిర్ చాంపియన్ గా నిలుస్తాడన్న అంచనాలను ఒమ్ముచేసిన టైసన్ ఫ్యూరీ.. అద్భుతాలు చేయడానికి అనుభవం అక్కర్లేదని మరోసారి నిరూపించాడు.