ఉత్తర కాలిఫోర్నియా జడ్జిగా ఎన్నారై సునీల్
ప్రముఖ ఎన్నారై న్యాయవాది సునీల్ ఆర్ కులకర్ణి (41) ఉత్తర కాలిఫోర్నియా కోర్టుకు జడ్జిగా నియమితులయ్యారని భారతీయ సంతతి ఆధ్వర్యంలో నడుస్తున్న ఇండియా వెస్ట్ పత్రిక శుక్రవారం ఇక్కడ వెల్లడించింది. ఆ పదవిని చేపట్టిన మొట్టమొదటి దక్షిణాసియా వాసిగా ఆయన చరిత్ర సృష్టించారని తెలిపింది.తనను ప్రధాన న్యాయమూర్తి పదవికి ఎంపిక చేసినట్లు గవర్నర్ కార్యాలయం నుంచి ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకున్న తాను ఒక్కసారిగా ఆనందం కలిగిందని సునీల్ తెలిపారని పేర్కొంది.
అమెరికాలో దక్షిణాసియా వాసులు చాలా మంది న్యాయవాద వృత్తిని ఎంచుకుని ఆ రంగంలో ముందుకు సాగుతున్నారని తెలిపారు. శ్రీకాంత్ శ్రీనివాసన్, పౌల్ సింగ్ అగర్వాల్, రూప ఎస్ గోస్వామి తదితర ఎన్నారైలు యూఎస్ న్యాయవ్యవస్థలో పలు కీలక స్థానాలను ఆధిరోహించిన సంగతిని సునీల్ ఆర్ కులకర్ణి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
లాస్ ఎంజిల్స్లో జన్మించిన కులకర్ణి కాలిఫోర్నియాలో స్థిరనివాసం ఏర్పరుచుకున్నారని చెప్పింది. యూసీ -బర్కిలీ నుంచి ఆయన బీఎస్ డిగ్రీ అందుకున్నారు. అలాగే యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా హస్టింగ్ కాలేజ్ నుంచి కులకర్ణి లా డిగ్రీ పట్టా పుచ్చుకున్నారని ఇండియా వెస్ట్ పత్రిక పేర్కొంది.