ప్రిడేటర్ డ్రోన్లు ఇవ్వండి
అమెరికాను కోరిన భారత్
న్యూఢిల్లీ: ప్రిడేటర్ సీ మానవ రహిత వైమానిక యుద్ధ వాహనాలు (యూసీఏవీలు) కావాలని భారత్ అమెరికాను కోరింది. బుధవారం వాషింగ్టన్ పర్యటనలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ఒబామాను ప్రిడేటర్ సీ వాహనాలు కావాలని కోరారని విశ్వసనీయ వర్గాలు తెలిపినట్లు ఓ ప్రముఖ డిఫెన్స్ జర్నల్ వెల్లడించింది. కాగా ఒబామా భారత్ అభ్యర్థన కు అంగీకారం తెలపాలని స్టేట్, రక్షణ శాఖలకు చెప్పనున్నట్లు తెలిసింది.
జనరల్ అటామిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్ ఇంక్ (జీఏ-ఏఎస్ఐ) ద్వారా తయారు చేసే ప్రిడేటర్ సీని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్), ఇండియన్ నేవీల నిఘా అవసరాల కోసం భారత్ అమెరికాను కోరినట్లు తెలుస్తోంది. మానవ సహిత యుద్ధ జెట్ విమానాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో యూసీఏవీలను ఐఏఎఫ్ నిర్వహించనుంది. భారత్కు నలువైపులా ఉగ్రవాద ప్రమాదం పొంచి ఉన్న పరిస్థితుల్లో మానవ రహిత, సహిత యుద్ధ విమానాలు దేశానికి అత్యవసరం. అందుకే యూసీఏవీలు కావాలని భారత రక్షణ శాఖను ఐఏఎఫ్ ఆరేడేళ్ల నుంచి అడుగుతూ వస్తోంది.