మహానేతకిచ్చే గౌరవం ఇదేనా?
ఏలూరు : తాడేపల్లిగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన యూనివర్సీటీకి వైఎస్సార్ పేరు తొలగించాలన్న అధికార తెలుగుదేశం పార్టీ ఆలోచనలపై జిల్లా అంతటా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మహోన్నతమైన సేవల చేసినవారి పేర్లు సంస్థలకు పెట్టడం పరిపాటని, వాటి మార్చాలనుకోవడమేమిటని పలువురు టీడీపీ వైఖరిపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా పురోభివృద్ధికి, వివిధ ప్రాజెక్టుల రూపక ల్పనకు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అవిరళ కృషి చేశారు. జిల్లాకు ఎప్పుడొచ్చినా వరాల జల్లు కురిపించి, ఆ దిశగా కోట్లాది నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదల చేయించి అభివృద్ధిపై ఆయన చెరగని ముద్ర వేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో అంతకుముందు ఎన్నడూ జరగని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు వైఎస్సార్ హయూంలో జరిగింది.
అటువంటి వ్యక్తి పేరును తొలగించాలన్న టీడీపీ ప్రజాప్రతినిధుల తీరుపై నిరసనలు మిన్నంటుతున్నాయి. జెడ్పీ సర్వసభ్య సమావేశ మందిరానికి రూ.కోటిన్నర విడుదల చేయించిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సమావేశ మందిరం పేరును తొలగించాలని గత సమావేశంలో జెడ్పీ తీర్మానం ఆమోదించింది. తాజాగా శనివారం జరిగిన జెడ్పీ సమావేశంలో ఉద్యానవర్సిటీ పేరు మార్చాలనే ప్రతిపాదనను కొవ్వూరు ఎమ్మెల్యే కెఎస్ జవహర్ చేయడం విమర్శలకు తావిచ్చింది.దివంగతులైన వారిని అవమాన పరచడం మంచిది కాదని జెడ్పీ సర్వసభ్య సమావేశం వేదికపై డీసీసీబీ ైచైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు(రత్నం) వారించినప్పటికీ విప్ ప్రభాకర్, జెడ్పీ చైర్మన్ బాపిరాజులు ఆయనపై విరుచుకుపడి మెజార్టీ సభ్యుల బలంతో మార్చుకుంటామని తెగించారు.
గతంలో టీడీపీ పాలించిన తొమ్మిదేళ్లు, కాంగ్రెస్ పాలన పదేళ్లల్లోను వివిధ సంస్థలకు ముఖ్య నాయకుల పేర్లు తొలగించిన సందర్భాలు లేవు. గతంలో మంత్రులుగా చేసిన నేతల పేర్లు కాలనీలకు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ మరచిపోయి కుతంత్రాలతో మహానేత పేరు మార్చాలని టీడీపీ యత్నించడం తగదని పలువురు అంటున్నారు. కాగా వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఎన్నో మేలైన పనులకు బాటలు వేశారు. ఆయన హయాంలోనే ఉద్యానవర్సిటీకి జీవో తీసుకువచ్చి, దాని అభివృద్ధికి దశల వారీగా నిధులు విడుదల చేయిం చారు. ఈ నేపథ్యంలో ఆయన మరణానంతరం జిల్లాలోని అం దరి ఆలోచనలను పరిగణనలోకి తీసుకొని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం యూనివ ర్సిటీకీ ఆయన పేరు పెట్టిందని, ఇప్పుడు టీడీపీ తొలగించాలనుకోవడం ఫక్తు రాజకీయమేనని వైఎస్సార్ అభిమానులు అంటున్నారు.
గతంలో మీరే చేస్తే ఒప్పా
లోకసభ స్పీకర్గా పనిచేసిన జీఎంసీ బాలయోగి ఈ జిల్లా సరిహద్దులో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారన్న కారణంతోనే ఆయన పేరును ఏలూరు అమీనాపేటలో సైన్సు పార్కుకు పెట్టారు. అప్పటి జెడ్పీ చైర్మన్ కొక్కిరగడ్డ జయరాజు ఆ పేరును పెట్టించారు. ఆయన మన జిల్లాకు చెందినవాడు కాదని, ఆ పేరు తొలగించాలని ఎవరూ చెప్పలేదు కదా మరి ఇప్పుడెందుకని, గతంలో మీరు చేస్తే ఒప్పా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.