ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్
శామీర్‌పేట్ రూరల్: మోసపూరిత వాగ్దానాలతో కేసీఆర్ గద్దెనెక్కి, ఇప్పుడు ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నాడని టీపీసీసీ ఉపాధ్యాక్షుడు ఉద్దమర్రి నర్సింహారెడ్డి విమర్శించారు. గురువారం మండల కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఐదునెలలు గడిచినా ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని ఆచరణలో పెట్టలేదని ఆరోపించారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి ఇప్పటివరకు 500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు 8గంటలు విద్యుత్ అందజేస్తానని చెప్పిన కేసీఆర్ ప్రస్తుతం 5 గంటలు సక్రమంగా ఇవ్వడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో 2006లో భూపాలపల్లిలో కాకతీయ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి శంకుస్థాపన చేసి నిర్మాణా పనులను ప్రారంభించామన్నారు. జూరాల, పులిచింతల, భూపాలపల్లిలో 1500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ప్రణాలికలు రూపొందించి పనులు చేపట్టిన వాటిని టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
పింఛన్ లబ్ధిదారుల్లో భారీగా కోతలుపెట్టడం తగదన్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు చురుకగా జరుగుతోందని సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 20లక్షల మంది, జిల్లాలో 2.50 లక్షల సభ్యత్వాలను నమోదు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు సుదర్శన్, కాంగ్రెస్ నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, మహేందర్‌యాదవ్, వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్, గోపాల్‌రెడ్డి, మల్లేశ్, రాజయ్య, రాజనర్సయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.