లాకప్‌లో మహిళపై అత్యాచారం: పోలీసుల అరెస్ట్
చెన్నై: కాపాడాల్సిన పోలీసు అధికారులే కాటేశారు. పోలీస్ స్టేషన్ లోనే మహిళపై లైంగికదాడి జరిపి చివరికి కటకటాలపాలయ్యారు. ఒక హత్యకేసులో నిందితురాలైన మహిళను గత ఏడాది ఆగస్టు11వ తేదీన అరెస్ట్ చేసి, తిరుపూరు జిల్లా ఉడుమలైపేట పోలీస్‌స్టేషన్ కు తరలించిన పోలీసులు.. చట్టవిరుద్ధంగా ఆమెను మూడురోజులపాటు లాకప్ లోనే ఉంచి ఒకరితర్వాత ఒకరు లైంగికదాడికి పాల్పడ్డారు.
తనకు జరిగిన అన్యాయంపై బాధిత మహిళ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. విచారణ చేపట్టిన హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరిస్తూ.. బాధిత మహిళకు మధ్యంతర నష్టపరిహారంగా రూ.2 లక్షలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడంతోపాటు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు ఉడుమలైపేట పోలీస్‌స్టేషన్ ఎస్ఐ విజయకుమార్, కానిస్టేబుళ్లు తిలక్‌కుమార్, రంగనాయకంలను సీబీఐ క్రైంబ్రాంచ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.