ఏపీసెట్ సప్లిమెంటరీ ఫలితాలు లేనట్టే!
సాక్షి, హైదరాబాద్: ఏపీసెట్-2013 సప్లిమెంటరీ ఫలితాల విడుదల లేనట్టేనని తేలిపోయింది. గత ఏడాది నవంబరు 24న జరిగిన ఏపీసెట్ ఫలితాలను ఫిబ్రవరి 8న విడుదల చేసిన విషయం తెలిసిందే. యూజీసీ నిబంధనల ప్రకారం ఉత్తీర్ణులైన అభ్యర్థుల్లో 15 శాతం మందినే ఏపీసెట్లో అర్హులుగా ప్రకటించారు. దీంతో ఈ పరీక్షలో అత్యధిక మార్కులు తెచ్చుకున్నా.. 15 శాతం నిబంధన కారణంగా అర్హత పొందలేక అభ్యర్థులు ఆందోళనలో మునిగిపోయారు.
దీనిపై విద్యార్థి సంఘాల విజ్ఞప్తి మేరకు ఏపీ సెట్ చైర్మన్, ఉస్మానియా వీసీ సత్యనారాయణ మరో ఐదు శాతం ఫలితాల పెంపునకు అనుమతి కోసం యూజీసీకి లేఖ రాశారు. ఈ లేఖ రాసి మూడు నెలలైనా యూ జీసీ నుంచి సమాధానం రాలేదు. దీంతో సప్లిమెంటరీ ఫలితాలకు అవకాశం లేదని ఏపీసెట్ సభ్య కార్యదర్శి ప్రొ.రాజేశ్వర్రెడ్డి తెలిపారు.