బట్టతల గుట్టుపై ముందడుగు
లండన్: పురుషుల్లో బట్టతల వచ్చేందుకు అవకాశమున్న 200కు పైగా జన్యుపరమైన అంశాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనివల్ల జుట్టు రాలే సమస్యను ముందుగానే అంచనా వేయొచ్చన్నారు. బ్రిటన్లోని యూని వర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్కు చెందిన శాస్త్రవేత్తల బృందం దీనిపై పరిశోధనలు చేసింది. దీనికోసం యూకే బయోబ్యాంక్ నుంచి సుమారు 52 వేల మంది పురుషులకు సంబంధించిన జన్యుపరమైన, ఆరోగ్య పరమైన సమాచారాన్ని సేకరించారు.
వీరిలో జుట్టు రాలే సమస్య తీవ్రంగా ఉన్న వారిలో 287 జన్యువులు ఒకేలా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీన్ని ఆధారంగా చేసుకొని ఒక ఫార్ములాను రూపొందించిన శాస్త్రవేత్తలు ఈ జన్యువులు ఉన్నప్పుడు లేదా లేనప్పుడు ఒక వ్యక్తికి బట్టతల వచ్చే అవకాశాలపై అధ్యయనం చేశారు.