కూచిపూడికి ఉమారావు సేవలు నిరుపమానం
ప్రసిద్ధ నాట్యాచార్యులు ఉమా రామారావు
మృతిపై కళాకారుల సంతాపం
కూచిపూడి :
ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులు, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ ఉమా రామారావు శనివారం కన్నుమూయడంతో కూచిపూడి కళాలోకం ఆమెకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. ఆమె సేవలను కొనియాడింది. 1938వ సంవత్సరంలో విశాఖపట్నంలో జన్మించిన డాక్టర్ ఉమా రామారావు తన 5వ ఏటనుంచే కూచిపూడి నాట్యాభ్యాసం ప్రారంభించి ఆ రంగంలో లబ్ధప్రతిష్టులయ్యారు. హైదరాబాదులో లాస్యప్రియా నృత్య అకాడమిని ఏర్పాటు చేసి దాదాపుగా 2000 మందికి పైగా ఔత్సాహికులను కళాకారులుగా తీర్చిదిద్దారు. పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నృత్య శాఖ హెడ్‌గా ఇరవై సంవత్సరాలకు పైగా సేవలనందించారు. దేశవిదేశాలలో వెయ్యికిపైగా ప్రదర్శనలు ఇచ్చి అందరి ప్రశంశలను అందకుని, అనేక అవార్డులను సొంతం చేసుకున్న ఘనత ఉమారావుది.
ఎన్నో అవార్డులు
ఉమారావును ఎన్నో అవార్డులు వరించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కళానీరాజనం అవార్డు, బెస్ట్ టీచర్ అవార్డు,శ్రీ కళపూర్ణ అవార్డులను అందుకున్నారు, పొట్టి శ్రీ రాములు విశ్వవిద్యాలయం నుంచి 2003లో ప్రతిభా పురస్కారం లభించింది.
కళా ప్రముఖుల సంతాపం
ఉమ మృతి పట్ల కేంద్ర సంగీతనాటక అవార్డు గ్రహీతలు పసుమర్తి రత్తయ్య శర్మ, వేదాంతం రాధేశ్యాం, కూచిపూడి కళాపీఠం ప్రిన్స్‌పాల్ రామలింగ శాస్త్రి, బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార అవార్డు గ్రహీతలు వేదాంతం వెంకట నాగ చెలపతి, చింతా రవి బాలకృష్ణ, యేలేశ్వరపు శ్రీనివాస్, కూచిపూడి నాట్య కళామండలి పసుమర్తి కేశవప్రసాద్ సంతాపాన్ని తెలియచేశారు.