వైఎస్సార్ సీపీ నేతపై దాడి
సాక్షి, మండపేట(తూర్పు గోదావరి) : వైఎస్సార్ సీపీ నేతపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి గాయపర్చిన సంఘటన శనివారం రాత్రి పట్టణంలో చోటు చేసుకుంది. పాలతోడుకు చెందిన పార్టీ నాయకుడు పిల్లా వీరబాబు పట్టణంలో నివాసం ఉంటూ స్థానికంగా డెయిరీ పార్లర్‌ను నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో షాపు వద్దకు పాల వ్యాన్ రావడంతో పాలు అన్లోడింగ్ చేసుకుని మోటారు సైకిల్‌పై ఇంటికి తిరిగి వెళుతున్నారు. స్థానిక రావిచెట్టు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇనుప ఊచతో ఆయనపై దాడి చేసి పరారయ్యారు. ఈ ఘటనలో వీరబాబు నుదుటిపై రక్తపు గాయమైంది. ఊహించని ఘటనతో దాడికి పాల్పడిన వారు ఎవరనేది గుర్తించలేకపోయానని ఆయన అన్నారు. అర్ధరాత్రి సమయంలో విషయం తెలుసుకున్న ఏడిదకు చెందిన పార్టీ నాయకులు వల్లూరి రామకృష్ణ, మారేడుబాకకు చెందిన మట్టపర్తి గోవిందరాజులు, పాలతోడుకు చెందిన పిల్లా అరవరాజు, పిల్లా చంద్రరావు, వెలగతోడుకు చెందిన ముక్కపాటి కోటేష్ మండపేట చేరుకుని ఈ ఘటనపై పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
వీరబాబును ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయించారు. పార్టీ నాయకులు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి షాపు వద్దకు వెళ్లి ఆయనను పరామర్శించి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు పోతంశెట్టి ప్రసాద్, అధికారి శ్రీనివాస్, సాధనాల శివ ఉన్నారు. విజయవాడలో ఉన్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు ఫోన్లో పరామర్శించారు. పార్టీ నాయకులు యరమాటి వెంకన్నబాబు, యర్రగుంట అయ్యప్ప, తిరుశూల అప్పారావు, తోరం పెదకాపు, తుమ్మా వీరబాబు, ముక్కపాటి రాజు తదితరులు వీరబాబును పరామర్శించారు. దాడికి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.