ఏ ఊరైనా... ఏ ఇల్లయినా..వందేళ్ల మందు ‘జిందా తిలిస్మాత్'
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జలుబు, తలనొప్పి, దగ్గు, ఒళ్లునొప్పులు... ఇలా ఏదైనా కావచ్చు. మందు మాత్రం ఒక్కటే. ఆ మందు కూడా ఇప్పటిదేమీ కాదు. దాదాపు వందేళ్ల కిందటిది. ఇంకా సరిగ్గా చెప్పాలంటే 94 ఏళ్ల కిందటిది. ఇదంతా ‘జిందా తిలిస్మాత్’ గురించేనని మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. నిజమే! దాని గురించే. పల్లెటూళ్లోని పచారీ కొట్టు మొదలు సిటీలోని డిపార్ట్మెంటల్ స్టోర్ వరకు ఎక్కడైనా దొరికే ఔషధమిది.
ఔరంగాబాద్ నుంచి వలస వచ్చిన ఓ వ్యక్తి చేతుల్లో తయారైన ఈ మందు... ఇపుడొక బ్రాండ్‌గా, ఓ పెద్ద కంపెనీగా ఎదిగిందంటే మాటలు కాదు. ఇదంతా ఎలా సాధ్యమైందని అడిగిన ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికి జిందా తిలిస్మాత్ పార్టనర్ మహ్మద్ ఓవైసుద్దీన్ ఫారూఖీ చెప్పిందొక్కటే. జనానికి తమపై ఉన్న నమ్మకం వల్లేనని. అంతేకాదు. ఆ నమ్మకాని తమ తండ్రి ఎలా సంపాదించారో కూడా వివరించారు.
‘‘నాన్నగారి పేరు హకీం మహ్మద్ మొయిజుద్దీన్ ఫారూఖీ. చిన్నప్పటి నుంచీ ఆయనకు పరిశోధనలంటే ఇష్టం. పేదల జీవితాలను దగ్గర్నుంచి చూశారాయన. రోగం ముదిరి చనిపోవడం వేరు.. దానికి చికిత్స చేయించుకునే స్థోమత లేక చనిపోవడం వేరు... అని గట్టిగా నమ్మేవారు. యునానీ కోర్సు చేశారు. షికాగో మెడికల్ కాలేజీ ఆఫ్ హోమియోపతి నుంచి హోమియోపతి మెడిసిన్ అండ్ సర్జరీ కోర్సు చేశారు.
తర్వాత పరిశోధనలు మొదలెట్టారు. హైదరాబాద్ మోతీ మార్కెట్లోని మా ఇంట్లోనే ఆసుపత్రిని ఆరంభించారు. ఒకవైపు పేదలకు వైద్యం చేస్తూనే మరోవైపు ఔషధ తయారీకి శ్రమించారు. మందు కనిపెట్టడం ఒక ఎత్తయితే అది సరిగ్గా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడం మరో ఎత్తు. ఫలితాలను అంచనావేసి మందు తయారీలో మార్పులు చేర్పులు చేసేవారు. అలా సర్వరోగ నివారిణి జిందా తిలిస్మాత్, ఫారూఖీ పళ్లపొడి ఫార్ములాలు కనిపెట్టారు నాన్న.
వినూత్నంగా ప్రచారం...
అప్పట్లో ఏ వస్తువుకైనా ప్రచారమంటే అంత తేలిక కాదు. పగలంతా వైద్యం చేసి చీకటి పడగానే ఏదో గ్రామానికి వెళ్లేవారు నాన్న. ఈ మందు వాడండి. మీ ఇంటిల్లిపాదికీ సర్వరోగ నివారిణి... అంటూ ఇంటింటా ప్రచారం చేసేవారు. గ్రామాల్లో గోడలపై ఆయనే ప్రకటనలు రాసేవారు. ప్రయాణాల్లో పక్కనున్నవారికి ఉచితంగా జిందా తిలిస్మాత్ ఇచ్చేవారు. గాలిపటాలపై కూడా రాయించేవారు. ఆయన శ్రమ ఫలించింది. ప్రతి ఇంట్లోనూ తప్పక ఉండాల్సిన సర్వరోగ నివారిణిగా జిందా తిలిస్మాత్ అవతరించింది. జిందా తిలిస్మాత్, ఫారూఖీ పళ్లపొడి మందులకు తయారీదారు.. ప్రకటనకర్త.. అమ్మకందారు.. కార్మికుడు.. యజమాని అన్నీ మొయిజుద్దీన్ ఫారూఖీగారే.
నీగ్రో బొమ్మ ఎందుకంటే...
జిందా తిలిస్మాత్ బాటిల్‌పై ఆఫ్రికన్ నీగ్రో బొమ్మ ఉంటుంది. అది చూసి అప్పట్లో... ఎవరో ఒక ఆఫ్రికన్ మా నాన్నగారికి ఈ ఫార్ములా చెప్పి ఉంటారనే ప్రచారం జరిగింది. అది కరెక్టు కాదు. నీగ్రో బొమ్మ పెట్టడం వెనుక ఓ కారణముంది. అప్పట్లో నిజాం ఆర్మీలో ఆఫ్రికన్లుండేవారు. వాళ్లు చాలా ఆరోగ్యంగా, దృఢంగా ఉంటారు. అప్పట్లో ఆరంభించిన సంస్థ కాబట్టి వీళ్ల బొమ్మనే ముద్రిస్తే ప్రజలకు సులువుగా అర్థమవుతుందని నాన్నగారి ఆలోచన. మా ఉత్పత్తులైన జిందా తిలిస్మాత్, ఫారూఖీ పళ్లపొడి, జింట్ లాజిస్టర్స్కు మన రాష్ట్రంతో పాటు మధ్య ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, యూఎస్, సౌదీ, దుబాయ్, అబుదాబిలలో కూడా మార్కెట్ ఉంది.
యంత్రాలుండవ్..
మా కంపెనీలో మెషిన్లు లేవు. వీలైనంత మందికి ఉపాధి కల్పించాలని నాన్నగారు చెప్పిన మాటలు ఎప్పటకీ మేం మరిచిపోలేం. మా సంస్థలో 85 మంది పనిచేస్తున్నారు. అప్పట్లో నాన్నగారితో పనిచేసిన వారి మూడో తరం వారసులే ఇప్పుడు మా దగ్గర ఉద్యోగులు. అంతా ఒకే కుటుంబంలా ఉంటాం. మేమూ ఉద్యోగుల్లానే ఉంటాం. మా కంపెనీ వార్షిక టర్నోవర్ రూ.12 కోట్లే. మేం నిజంగా దీన్నో వ్యాపారంలా చూడటం లేదు. ఇదో సేవా కార్యక్రమం. ప్రకతి వైపరీత్యాలు జరిగినప్పుడు మా సాయంగా జిందా తిలిస్మాత్, ఫారూఖీ పళ్లపొడి ఉచితంగా పంపిణీ చేస్తాం. ఏటా హైదరాబాద్ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారికి కూడా దీన్ని ఇస్తుంటాం’’.