
కేంద్ర ఆయుష్ శాఖ ప్రకటన
న్యూఢిల్లీ: వివిధ వ్యాధుల నివారణలో ఆయుర్వేద, సిద్ధ, యునాని, హోమియోపతి ఔషధాలు అద్భుతంగా పనిచేస్తాయంటూ ప్రకటించడం చట్ట వ్యతిరేకమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎటువంటి ధ్రువీకరణలు లేని ఇలాంటి ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టించడంతోపాటు వారి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని హెచ్చరించింది. ఇటువంటి ప్రకటనలపై నిషేధం విధించామని, ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని తెలిపింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక బహిరంగ ప్రకటన జారీ చేసింది.
తాము ఏవిధమైన ఆయుర్వేద, సిద్ధ, యునాని, హోమియోప తి(ఏఎస్‌యూహెచ్) మందులకు ధ్రువీకరణలను ఇవ్వలేదని కూడా తెలిపింది. అదేవిధంగా, ఆయా వైద్య విధానాలకు సంబంధించిన ఔషధాల తయారీ, విక్రయాలకు కూడా ఏ ఉత్పత్తిదారు లేదా కంపెనీకి అనుమతులు మంజూరు చేయలేదని ఆయుష్ శాఖ స్పష్టం చేసింది.
డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం–1940ని అనుసరించి ఏఎస్‌యూహెచ్ ఔషధాల తయారీ, విక్రయాలకు అనుమతులను సంబంధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలే జారీ చేస్తాయని కూడా వివరించింది. ఏఎస్‌యూహెచ్ ఔషధాలను సంబంధిత వైద్యులు/ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ పర్యవేక్షణలో మాత్రమే వాడాలని కూడా తెలిపింది. అభ్యంతరకర, తప్పుడు ప్రకటనలు, నకిలీ మందులపై రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీకి లేదా ఆయుష్ శాఖకు ఫిర్యాదు చేయాలని కేంద్ర ఆయుష్ శాఖ సూచించింది.