21 ఏళ్లలోపు వారికి సిగరెట్ల అమ్మకంపై నిషేధం
ధూమపానాన్ని నియంత్రించేందుకు న్యూయార్క్ నగర కౌన్సిల్ కఠిన చర్యలు తీసుకుంది. 21 ఏళ్ల లోపు వయసు వారికి సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులను అమ్మకుండా నిషేధం విధించింది. న్యూయార్క్ నగర కౌన్సిల్ ఈ మేరకు ఆమోద ముద్ర వేసింది.
యువత ప్రాణాంతక కేన్సర్ వ్యాధిబారిన పడకుండా ఉండేందుకుగాను అమెరికాలో పొగాకు ఉత్పత్తుల అమ్మకంపై కఠిన చట్టాలున్నాయి. 18 ఏళ్ల లోపు వారికి సిగరెట్లు అమ్మరాదు. కొన్ని రాష్ట్రాలు ఈ వయో పరిమితిని పెంచాయి. కొన్ని రాష్ట్రాల్లో 19 ఏళ్ల వయసు లోపు వారికి అమ్మరాదనే నిబంధన ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో 21 ఏళ్ల వరకు వయోపరిమితి నిబంధనలు అమల్లో ఉన్నాయి. దీని వల్ల పొగతాగే వారి సంఖ్యను గణనీయంగా తగ్గంచవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కువగా 18-20 ఏళ్ల వయసు వారే సిగరెట్ కాల్చే అలవాటు నేర్చుకుంటారని తెలిపారు. ఈ వయసులో వారిని కట్టడి చేస్తే ఆ తర్వాత ధూమపానం వ్యాపకంగా మారే అవకాశాలు తక్కువని వెల్లడించారు.