కృష్ణా నదిలో అండర్ వాటర్ టన్నెల్
విజయవాడ: రాజధానిలో అచ్చెరువొందే కట్టడాలతో పాటు పర్యాటకులను అబ్బురపరచే ఆకర్షణలు ఏర్పాటు చేయాలని మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదించారు. ప్రధాన ఆకర్షణగా కృష్ణానదిలో ఐదు కిలోమీటర్ల మేర అండర్ వాటర్ టన్నెల్‌ను నిర్మించనున్నారు. కృష్ణా నదిలో రాజధాని వైపు నుంచి విజయవాడ వరకూ ఈ టన్నెల్‌ను నిర్మించనున్నారు. ఈ టన్నెల్ గుండా వాహనాల రాకపోకలకు అనుమతించడం ద్వారా ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు ప్రయాణీకులకు నది మధ్యలో నుంచి రోడ్డు మార్గం గుండా వెళ్లే ప్రత్యేక అనుభూతిని కల్పించేందుకు దీన్ని ప్రతిపాదించారు.
కృష్ణా నది ద్వీపంలో 95 హెక్టార్లలో బొటానికల్ గార్డెన్‌ను అత్యాధునిక ల్యాండ్‌స్కేప్ డిజైన్‌తో ఏర్పాటు చేస్తారు. మరో ద్వీపంలోని 75 హెక్టార్లలో థీమ్ పార్కును నెలకొల్పుతారు. ఉండవల్లి కొండను తొలచి రెండు మార్గాలను ఏర్పాటు చేస్తారు. సిటీ పార్కులు-హెల్త్ వాక్‌లు, సెంట్రల్ లైబ్రరీ, క్రికెట్ స్టేడియం, జూ- థీమ్ పార్క్, ఆర్ట్ సెంటర్, మ్యూజియం-సిటీ గ్యాలరీ, సీటీ స్క్వేర్స్, హైకోర్టు, ఎక్స్పో సెంటర్ ను ఆకర్షణలుగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు.