పట్టభద్రులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి
తెలంగాణ పట్టభద్రుల సంఘం డిమాండ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగ పట్టభద్రులకు నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని తెలంగాణ పట్టభద్రుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మంగళవారం జరిగిన రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో పట్టభద్రుల సమస్యలకు సంబంధించి పలు తీర్మానాలు చేసినట్లు సంఘం అధ్యక్షుడు కె.లక్ష్మయ్య తెలిపారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో పదేళ్లుగా పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బందిని క్రమబద్ధీకరించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా రాజకీయ నాయకులకు కూడా పదవీ విరమణ వయో పరిమితిని విధించాలని పేర్కొన్నారు. ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులకు పదో తరగతి కనీస విద్యార్హతగా నిర్ణయించాలని కోరారు. చట్ట సభలకు ఎన్నికైన వ్యక్తి రాజీనామా చేస్తే తిరిగి ఎన్నికలకు బదులు తర్వాత అధికంగా ఓట్లు పొందిన వ్యక్తి ఎన్నికైనట్లుగా ప్రకటించాలని సంఘం ఏకగ్రీవంగా తీర్మానించినట్లు ఆయన తెలిపారు.