'ఆయన అహంకార దోరణి వీడాలి'
- తెలంగాణ నిరుద్యోగ జేఏసీ
కవాడిగూడ (హైదరాబాద్‌సిటీ) : గ్రూప్-2 సర్వీస్ ఉద్యోగుల పరీక్షలను నిరుద్యోగుల డిమాండ్ మేరకే రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్ల ఒత్తిడి మేరకే పరీక్షలు వాయిదా వేశామని చెప్పడం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఛైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అహంకార దోరణికి నిదర్శనమని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర ఛైర్మన్ నీల వెంకటేష్ తీవ్రంగా విమర్శించారు. 439 పోస్టుల కోసం లక్షలాది మంది నిరుద్యోగులు పోటీ పడుతున్న తరుణంలో పోస్టుల సంఖ్య పెంచాలని రెండు నెలలు ఉద్యమాలు చేస్తే ఉద్యమాలను అవమాన పర్చేలా మాట్లాడడం సిగ్గు చేటన్నారు.
తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఛైర్మన్ నీల వెంకటేష్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఛైర్మన్ ప్రొ. ఘంటా చక్రపాణి దిష్ఠిబొమ్మను బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ వద్ద శుక్రవారం దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రూప్-2 సర్వీస్‌లో మొత్తం 18 శాఖలలో పోస్టులు ఖాళీలుంటే కేవలం 5 శాఖలలో ఖాళీలకు మాత్రమే నోటిఫికేషన్ వేశారని తెలిపారు. మిగతా శాఖలలో ఖాళీగా పోస్టులకు నోటిఫికేషన్ వేయాల్సిన బాధ్యత టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌కు లేదా అంటూ ప్రశ్నించారు. గ్రూప్-2 పరీక్షలకు సిలబస్‌కు తగినట్లుగా పుస్తకాలు లేకపోవడం, పోస్టులు ఎక్కువగా ఉన్నప్పటికీ కేవలం 439 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ వేయడం ఛైర్మన్‌కు సమస్యల్లాగా కన్పించడం లేదా అంటూ నిలదీశారు.
గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయడంలో నిరుద్యోగులు చేసిన ఉద్యమాలా..? కోచింగ్ సెంటర్లా అనే విషయం తేల్చుకోవడానికి ఛైర్మన్ బహిరంగ విచారణకు సిద్దంగా కావాలని సవాల్ విసిరారు. అందుకు ఉస్మానియా యూనివర్శిటీయా.. చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీయా తేల్చుకోవాలన్నారు. ఛైర్మన్ ఘంటా చక్రపాణి బహిరంగ విచారణకు రాకపోతే నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే వేలాది మంది నిరుద్యోగులతో పబ్లిక్ సర్వీస్ కమీషన్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ నిరుద్యోగ సంఘర్షణ సమితి అధ్యక్షులు ర్యాగ రమేష్, అడపా చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.