unhygeinic
-
ఫాస్ట్‌ఫుడ్ సెంటర్స్‌లో తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త అంటూ..
వైరల్: మనం రోజూ తినే ఆహారం.. ఎంత హైజెనిక్ అనేది ఊహించలేం. అలాగే ప్రాసెసింగ్ ఫుడ్ విషయంలోనూ ఎలాంటి పద్ధతులు పాటిస్తారు, ఎంత నాణ్యంగా వ్యవహరిస్తారు అని అంచనా వేయడమూ కష్టమే!. ఈ రెండింటి విషయంలో పట్టింపు ఉన్నవాళ్లు బయటి ఫుడ్ల జోలికి పోరనేది వాస్తవం. మరి బయటి ఫుడ్ ఎక్కువగా లాగించే వాళ్ల పరిస్థితి!. అలాంటి వాళ్లను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో తరచూ కొన్ని వీడియోలు, ఫొటోలు కనిపిస్తున్నాయి. వాటిని పట్టించుకోవడం, పట్టించుకోకపోవడం ఇక వాళ్ల వంతు. తాజాగా.. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో నూడుల్స్ తింటున్నారా? అయితే జాగ్రత్త అంటూ ఓ వీడియో నెట్లో వైరల్ అవుతోంది. తయారీ విధానం చూడండి అంటూ ఓ వ్యక్తి ఆ వీడియోను ట్విటర్ ద్వారా వదలడంతో హల్ చల్ చేస్తోంది. ఓ చిన్నఫ్యాక్టరీలో చిన్నస్థాయి రెస్టారెంట్లలో, రోడ్‌సైడ్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో వాడే నూడుల్స్ తయారీ విధానం ఇదంటూ ఓ వ్యక్తి వీడియోను పోస్ట్ చేశాడు. దీంతో ఆహార నాణ్యతపై మరోసారి చర్చ మొదలైంది. ఇది ఎక్కడ ఎప్పుడు తీశారనే దానిపై స్పష్టత లేదు. రకరకాల కామెంట్లు కనిపిస్తున్నాయి. స్టార్ హోటల్స్‌లోనూ ఇంతకంటే దారుణమైన పరిస్థితులు ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. నిత్యం మనం తీసుకునే ఆహారాన్ని అంచనా వేయడం కష్టమని కొందరు.. ఇలాంటి ఆహారం తినకపోవడమే మంచిదంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఆ వీడియోను మీరూ చూసేయండి. When was the last time you had road side chinese hakka noodles with schezwan sauce? pic.twitter.com/wGYFfXO3L7 — Chirag Barjatya (@chiragbarjatyaa) January 18, 2023 -
అథ్లెట్ల భోజనంలో వెంట్రుకలు, గోళ్లు...
న్యూఢిల్లీ : పాటియాలాలోని నేతాజీ సుభాష్ జాతీయ క్రీడాసంస్థ (ఎన్ఎస్–ఎన్ఐఎస్) డొల్లతనం బయటపడింది. ఇటీవలే అక్కడి సిబ్బంది సామాజిక దూరాన్ని పాటించకపోవడంతో పాటు ఇద్దరు బాక్సర్లు క్వారంటైన్ నిబంధనల్ని ఉల్లంఘించారంటూ వార్తలు రాగా... తాజాగా అథ్లెట్లకు అందించే ఆహారం మరీ నాసిరకంగా ఉన్నట్లు తెలిసింది. భారత స్ప్రింటర్ ద్యుతీ చంద్‌తో పాటు ఇతర అథ్లెట్లు ఆహారం నాణ్యతపై, వంటగదిలో అపరిశుభ్ర వాతావరణంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది. తనకు అందించిన ఆహారంలో వెంట్రుకలు, గోళ్లు ఉండటంతో హిమదాస్ ఈ అంశాన్ని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. వాటి ఫోటోలను కెమెరాతో చిత్రీకరించిన హిమ ఆ దృశ్యాలను ఎన్ఐఎస్ పాలక అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లిందంట. (నా మనసు చెబుతోంది అది కుట్రేనని...) ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కిరణ్ రిజుజు వెంటనే భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) అధికారులను మందలించి సమస్యను పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. ‘ఎన్ఐఎస్ భోజనశాలలో అపరిశుభ్రత, ఆహారం నాసిరకంగా ఉండటంపై అథ్లెట్లు ఆగస్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే తగిన చర్యలు తీసుకున్నాం. అథ్లెట్లు, అధికారులతో కలిసి సమావేశం నిర్వహించాం. ఆటగాళ్ల అవసరాలకు అనుగుణంగా వారికి అందించాల్సిన ఆహారం నాణ్యత, పరిమాణంపై సూచనలు జారీ చేశాం. ఇప్పుడు వారికి అందుతున్న ఆహారం పట్ల అథ్లెట్లు కూడా సంతోషంగా ఉన్నారు’ అని ‘సాయ్’ పేర్కొంది. (ఫ్రెంచ్ ఓపెన్‌కూ యాష్లే బార్టీ దూరం) -
ఎంగిలి చేసిన పాలను మళ్లీ అదే గిన్నెలో పోశాడు
-
ఛీ.. ఇదేం బుద్ధిరా నాయనా
సాక్షి, హైదరాబాద్ : మీరు రోజు పాలు తాగుతారా.. అయితే ఈ వార్త చదవకపోవడమే మంచిది. సాధారణంగా పాలలో నీళ్లు కలుపుతారన్న మాట నిజమే.. కానీ ఇక్కడ ఒక వ్యక్తి చేసిన పనికి మాత్రం పాలు తాగాలనిపించదు. డబీర్‌పురకు చెందిన మహ్మద్ సోహైల్ డైరీ ఫాం నడుపుతున్నాడు. తాజాగా మహ్మద్ సోహైల్ గేదెల నుంచి పాలు పిండాడు. తర్వాత ఆ పాలను ఒక గ్లాస్లో పోసుకొని సగం తాగాడు. ఎంగిలి చేసిన మిగిలిన పాలను మళ్లీ అదే గిన్నెలో పోశాడు. అనంతరం గేదెలు నీళ్లు తాగడం కోసం ఏర్పాటు చేసిన తొట్టిలో గ్లాసు నీళ్లు ముంచి అపరిశుభ్రంగా ఉన్న నీళ్లను తీసుకొచ్చి మళ్లీ గిన్నెలో కలిపాడు.(చదవండి : కేసీఆర్ ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం, వ్యక్తి ఆరెస్ట్) మహ్మద్ సోహైల్ చేసిన పనిని కొందరు యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. విషయం తెలుసుకున్న కొందరు స్థానికులు ప్రజలు తాగే పాలను ఇలా అపరిశుభ్రం చేస్తున్న వ్యక్తికి అదుపులోకి తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో డబీర్‌పుర పోలీసులు డైరీ ఫామ్ యజమాని సోహైల్ పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
మురిగిన కోడిగుడ్లే పౌష్టికాహారం
మాతాశిశు మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారంలో నాణ్యత లోపిస్తోంది. ఐసీడీఎస్ అధికారులు పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్లు నాసిరకం సరుకులను పంపిణీ చేస్తున్నారు. పెద్దసైజు కోడిగుడ్ల స్థానంలో చిన్నసైజువి, మురిగిపోయినవి సరఫరా చేస్తున్నారు. ఈ గుడ్లను తిన్న చిన్నారులు, గర్భిణులు, బాలింతలు అనారోగ్యం బారిన పడుతున్నారు. వెంకటగిరిరూరల్: ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందజేసే పౌష్టికాహారం నాణ్యంపై విమర్శలు వినిపిస్తున్నాయి. మండలంలోని 111 అంగన్వాడీ కేంద్రాలు, 3 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ అంగన్వాడీ కేంద్రాల పరిధిలో వందలాది మంది బాలింతలు, గర్భిణులు, చిన్నారులు ఉన్నారు. వీరికి పౌష్టికాహారం కింద ప్రతి నెల డజనుకుపైగా కోడిగుడ్లను అందజేస్తోంది. అయితే టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు మురిగిన, సైజు లేని కోడిగుడ్లను అందజేస్తున్నారు. ఈ గుడ్లను తిన్న చిన్నారులు, గర్భిణులు రోగాల బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు. కొన్ని కేంద్రాల్లో సుమారు 7 నెలల నుంచి తరచూ మురిగిన కోడిగుడ్లను సరఫరా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గర్భిణులు, బాలింతలు ఆరోపిస్తున్నారు. మురిగిన గుడ్లను సరఫరా చేస్తున్నారు– రాజేశ్వరి, వెంకటగిరి. అంగన్వాడీ కేంద్రంలో అందజేసే గుడ్లు మురిగిపోయి ఉంటున్నాయి. గుడ్లను ఉడకబెడితే దుర్గంధం వెదజల్లుతున్నాయి. పౌష్టికాహారం మాట దేవుడెరుగు ప్రభుత్వం అందజేసే గుడ్లను తింటే ఆస్పత్రి పాలవ్వాల్సిందే. అధికారులు పట్టించుకోవడం లేదు– జి మల్లెమ్మ, బంగారుపేట. అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే కోడి గుడ్లు చిన్నపరిమాణంలో, మురిపోయి ఉంటున్నాయి. మురిగిపోయిన గుడ్లను తిని చిన్నారులు అస్వస్థతకు గురవుతున్నారు. అదికారులు పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.