రుణం తీర్చుకోలేనంటే ఇదేనా!
కీలకమైన పదవుల పందేరం సమయంలో చంద్రబాబుకు మేం కనిపించమా? అని టీడీపీలోని కాపు సామాజికవర్గ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బలమైన సామాజికవర్గంగా ఉన్న కాపుల వల్లే గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయ తీరాలకు చేరింది. ఈ విషయాన్ని పరోక్షంగా అంగీకరిస్తూ ఈ జిల్లా రుణం తీర్చుకోలేనని పదే పదే చెప్పిన చంద్రబాబు.. తీరా రుణం తీర్చుకునే అవకాశం వచ్చేసరికి తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
* కేంద్రమంత్రి పదవికి పనికిరామా?
* చంద్రబాబుపై కాపుల గుర్రు
* గోదావరి నేతలకు మొండిచేయి
* ‘తోట’ పేర్లను కనీసం పరిశీలనలోకి కూడాతీసుకోకపోవడంపై ఆవేదన
సాక్షి ప్రతినిధి, ఏలూరు : కేంద్రంలో ఎన్డీఏ సర్కారు మంత్రివర్గ విస్తరణలో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలకు చోటు దక్కకపోవడంపై ఆయా వర్గాల నుంచి అసంతృప్తరాగం వినిపిస్తోంది. టీడీపీ అధికారంలోకి రావడానికి గోదావరి జిల్లాల ఫలితాలే కీలకమయ్యాయనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అంతెందుకు ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు విచ్చేసిన సందర్భంలోనూ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ఈ జిల్లా రుణం తీర్చుకోలేనిదంటూ పదే పదే ప్రకటనలు చేశారు. కానీ పదవుల పందేరానికి వచ్చేటప్పటికి మొండిచేయి చూపిస్తున్నారంటూ టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రధానంగా కేంద్రమంత్రివర్గ విస్తరణలో గోదావరి జిల్లాలకు ప్రాతినిథ్యం కల్పించకపోవడం, కాపు సామాజికవర్గానికి చెందిన వారిని కనీసం పరిశీలనలోకి కూడా తీసుకోకపోవడం ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
పదేళ్ల యూపీఏ సర్కారులో గోదావరి జిల్లాలకు చెందిన కాపు సామాజికవర్గ కాంగ్రెస్ నేతలను కేంద్రంలో కీలక పదవులు వరించాయి. పశ్చిమగోదావరికి చెందిన దర్శకరత్న దాసరి నారాయణరావుకు కార్మిక, బొగ్గుగనుల శాఖ దక్కగా, సినీనటుడు చిరంజీవికి స్వతంత్రహోదాలో పర్యాటకశాఖ దక్కింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎం.ఎం. పళ్లంరాజుకు ఏకంగా రక్షణశాఖనే కట్టబెట్టారు.
మొత్తంగా గత పదేళ్లలో గోదావరి జిల్లాలకు చెందిన కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు కేంద్రంలో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఐదునెలల కిందట ఎన్డీఏ సర్కారు కొలువుదీరిన తర్వాత కేంద్రంలో మిత్రపక్షమైన టీడీపీ తరఫున ఒకే ఒక కేంద్ర మంత్రి పదవి విజయనగరం ఎంపీ అశోక గజపతిరాజుకు దక్కింది. ఈ నేపథ్యంలో మంత్రివర్గవిస్తరణలోనైనా గోదావరి జిల్లాలకు చెందిన టీడీపీ నేతలకు, ప్రత్యేకించి రాష్ట్ర విభజన నేపథ్యంలో అధిక సంఖ్యలో ఉన్న కాపుల తరఫున ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలకు పదవులు దక్కుతాయని అందరూ ఆశించారు.
ఆశలపై నీళ్లు
బీజేపీ నుంచి కాపు సామాజికవర్గానికి చెందినవారు ఎంపీలుగా లేకపోవడంతో తెలుగుదేశం పార్టీలోని కాపు ఎంపీలకు కేంద్రమంత్రి వర్గ విస్తరణలో స్థానం లభిస్తుందని ఆశించారు. కాపులకు సముచిత స్థానం కల్పిస్తామంటూ ఇటీవలికాలంలో బాబు చేస్తున్న ప్రకటనలతో వారు పదవులపై ఆశలు పెంచుకున్నారు. అయితే విస్తరణలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన సుజనాచౌదరికి కట్టబెట్టి గోదావరి జిల్లాలకు చెందిన కాపునేతలను విస్మరించారన్న వ్యాఖ్యలు ఇప్పుడు జోరుగా వినిపిస్తున్నాయి. గోదావరి జిల్లాల నుంచి తెలుగుదేశం తరఫున ఇద్దరు కాపు సామాజిక వర్గనేతలు ఎంపీలుగా ఉన్నా పదవుల పందేరంలో చంద్రబాబు కనీసం పరిగణనలోకి కూడా తీసుకోలేదన్న వాదనలు స్వయంగా ఆ పార్టీ వర్గాల నుంచే వ్యక్తమవుతున్నాయి.
టీడీపీ నుంచి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తోట నరసింహం కాకినాడ ఎంపీగా గెలుపొందారు. ఆయన గతంలో రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. అయితే కాంగ్రెస్ నుంచి ఎన్నికల ముందు చివరి నిమిషంలో టీడీపీలో చేరిన నేపథ్యం కాబట్టి ఈయన్ను పక్కన పెట్టారనుకున్నా రాజ్యసభ సభ్యురాలిగా వ్యవహరిస్తున్న పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి కేంద్రమంత్రి పదవికి అన్ని విధాలా అర్హురాలని పార్టీవర్గాలు వాదిస్తున్నాయి. 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎవ రూ పోటీ చేయడానికి ముందుకు రాని సమయంలో నరసాపురం ఎంపీగా ఆమె బరిలోకి దిగి ఓటమి చెందారు.
పార్టీకి కష్టకాలంలో జిల్లా అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టి ఎన్నికల సమయంలో పార్టీ విజయంలో ప్రధానభూమిక పోషించారు. దీంతో సహజంగానే కాపులు ఈసారి ఆమెకు కేంద్రమంత్రి వర్గంలో కనీసం సహాయమంత్రి పదవైనా వస్తుందని ఆశించారు. అయితే ఆమె పేరు ఎక్కడా ప్రస్తావనలోకి కూడా రాకపోవడంతో పార్టీలోని కాపు సామాజికవర్గ నేతలు, కార్యకర్తలు నిర్వేదానికి లోనవుతున్నారు. కానీ బయుటపడితే బాగోదని నోరునొక్కుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గోదావరి జిల్లాల్లో బలమైన సామాజికవర్గంలో రాజుకుంటున్న అసంతృప్తిని చంద్రబాబు ఏవిధంగా చల్లారుస్తారో చూడాల్సిందే!