సమైక్య ఉద్యమంతో స్తంభించిన రవాణా
రాష్ట్ర విభజన నిర్ణయం రాజేసిన ‘సమైక్య’ ఉద్యమ ప్రభావం రవాణా వ్యవస్థపై పడింది. రాజధాని హైదరాబాద్, సీమాంధ్ర ప్రాంతాల మధ్య రోడ్డు రవాణా దాదాపు స్తంభించిపోయింది. హైదరాబాద్ నుంచి రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలకు రోడ్డు మార్గంలో రోజూ దాదాపు 50 వేల మంది ప్రయాణిస్తారని, సీమాంధ్ర నుంచి హైదరాబాద్‌కు కూడా రోజూ 50 వేల మంది వరకు వస్తారని అంచనా. అంటే ఇరువైపులా కలిపి రోజూ దాదాపు లక్ష మంది ప్రయాణిస్తారు. కానీ సమైక్య ఉద్యమం ప్రారంభమైన గత నెల 31 నుంచి రాజధాని, సీమాంధ్ర మధ్య ప్రయాణిస్తున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మంగళవారం కేవలం 10 వేల మంది రాకపోకలు సాగించారని అంచనా. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలకు రోడ్డు రవాణా పూర్తిగా స్తంభించింది. కోస్తాంధ్ర, హైదరాబాద్ మధ్య కొన్ని బస్సులు తిరుగుతున్నా ప్రయాణికులు పెద్దగా లేరు.
హైదరాబాద్ నుంచి రాయలసీమ జిల్లాలు.. కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరుకు రోజూ 260 బస్సులను రాత్రి సర్వీసులుగా ఆర్టీసీ తిప్పుతోంది. ఇదే సంఖ్యలో రాయలసీమ జిల్లాల నుంచి రోజూ ఉదయాన్నే హైదరాబాద్‌కు వస్తాయి. వీటిలో ఒక్క బస్సును కూడా ఆర్టీసీ తిప్పడం లేదు. సాధారణ పరిస్థితుల్లో ప్రయివేటు బస్సులు కూడా దాదాపు ఇదే సంఖ్యలో తిరుగుతాయి. కానీ ఇప్పుడు.. అవి కూడా పరిమిత సంఖ్యలోనే ఈ రూట్లలో తిరుగుతున్నాయి. ప్రముఖ ప్రయివేటు ఆపరేటర్లు రాయలసీమ రూట్లలో బస్సులను నిలిపివేశారు. ఇక హైదరాబాద్, కోస్తాంధ్ర మధ్య పరిస్థితి కూడా దాదాపు ఇదే తీరుగా ఉంది. సాధారణ పరిస్థితుల్లో కోస్తాంధ్ర, హైదరాబాద్ మధ్య ఇటు 700, అటు 700 బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. ఇప్పుడు రెండు వైపులా కలిపి 100 బస్సులు కూడా నడవడం లేదు. నడుపుతున్న బస్సుల్లోనూ ఆక్యుపెన్సీ రేషియో (ప్రయాణికుల సంఖ్య) అతి తక్కువగా ఉందని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. సమైక్య ఉద్యమానికి తోడు వర్షాలు, వరదల ప్రభావం కూడా ఆర్టీసీ బస్సుల రాకపోకల మీద పడిందని, ఫలితంగా పెద్ద సంఖ్యలో కోస్తాంధ్రకు సర్వీసులను నిలిపివేయాల్సి వచ్చిందని వెల్లడించాయి. ఇక సరిహద్దు జిల్లాల డిపోల నుంచి తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల మధ్య నిత్యం రాకపోకలు సాగించే వందలాది సర్వీసులు కూడా సమైక్య ఉద్యమ ప్రభావంతో పరిమిత సంఖ్యలోనే నడుస్తున్నాయి.
ప్రైవేటు బస్సులదీ అదే పరిస్థితి
హైదరాబాద్ నుంచి కోస్తాంధ్ర, రాయలసీమకు దాదాపు 600 ప్రయివేటు బస్సులు తిరుగుతున్నాయి. సమైక్య ఉద్యమం నేపథ్యంలో వంద బస్సులకు మించి నడపలేకపోతున్నామని ప్రయివేటు బస్సుల ఆపరేటర్లు చెప్పారు. ‘పగటిపూట సర్వీసులు దాదాపు పూర్తిగా నిలిచిపోయాయి. రాత్రి పూట కొన్ని రూట్లలో పరిమిత సంఖ్యలో తిప్పుతున్నాం. అవి కూడా ఎక్కువ కాదు. మా మొత్తం బస్సుల్లో 15 శాతం కూడా రోడ్డెక్కడం లేదు’ అని ప్రముఖ ప్రయివేటు బస్సు ఆపరేటర్ ఎస్వీఆర్ ట్రావెల్స్ బోస్ చెప్పారు. రంజాన్‌కు రాయలసీమ బస్సులు కిటకిటలాడతాయని, కానీ ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని పలువురు ఆపరేటర్లు వెల్లడించారు. సమైక్య ఉద్యమం వల్ల పరిమిత సంఖ్యలో బస్సులు తిప్పుతున్నా.. అవి కూడా నిండటం లేదన్నారు. ఇంటర్నెట్లో టికెట్ల బుకింగ్ కోసం పలు సర్వీసులు పెడుతున్నామని, టికెట్లు అమ్ముడుపోకపోతే సాయంత్రం రద్దు చేస్తున్నామని చెప్పారు.
సరకు రవాణాకూ తప్పని సెగ
సమైక్య ఉద్యమం కారణంగా కేవలం ప్రయాణికుల రాకపోకలకే కాకుండా సరకు రవాణాకూ ఇబ్బంది కలుగుతోంది. ఆందోళనల భయంతో పగటిపూట లారీలు అస్సలు రోడ్డెక్కడం లేదు. కేవలం రాత్రి పూట పరిమిత సంఖ్యలో లారీలు దూరప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుండటంతో సరకు రవాణా నిలిచిపోతోంది. దీంతో ఇటు హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలలో సరుకులు నిండుకుంటున్నాయి. నిత్యావసరాలపై సైతం ఈ ప్రభావం పడుతోంది. వంట నూనెల స్టాకు లేదని హైదరాబాద్‌లోని హోల్‌సేల్ దుకాణదారులు చెబుతున్నారు. ముఖ్యంగా పామాయిల్‌తో పాటు మరికొన్ని రకాల నూనెలు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు సరఫరా అవుతాయి. గత కొన్నిరోజులుగా చాలావరకు రవాణా స్తంభించడంతో అక్కడినుంచి నూనె తగినంతగా ఇతర నగరాలు, పట్టణాలకు చేరడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే వంట నూనె కొరత ఏర్పడక తప్పదని హైదరాబాద్‌లోని ఓ టోకు వర్తకుడు చెప్పారు. మరికొన్ని రకాల సరుకుల విషయంలోనూ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని అన్నారు. ఆ పేరిట ధరలూ రెట్టింపయ్యే అవకాశం ఉందని చెప్పారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి నిత్యం నిత్యం పదుల సంఖ్యలో వచ్చే చేపల లారీలపై కూడా ఉద్యమ ప్రభావం పడింది. బయలుదేరిన లారీలు కూడా సకాలంలో చేరకపోవడంతో రెండువైపులా వ్యాపారులు నష్టపోతున్నారు. అలాగే బయటి రాష్ట్రాల నుంచి సీమాంధ్రను దాటి తెలంగాణకు రావాల్సిన సరుకు రవాణా వాహనాలకు పలు అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఇక బెంగళూరు నుంచి కోల్‌కతా వరకు ఆంధ్ర మీదుగా రోజూ దాదాపు 100 లారీలు క్యాబేజీ, టమోటా లోడుతో వెళతాయి. తాజా కూరగాయలతో మరో 100 లారీలు ఈ మార్గంలో ప్రయాణిస్తాయి. బెంగళూరులో బయలుదేరిన తర్వాత 72 గంటల్లో సరుకు చేర్చాల్సి ఉంటుంది. నిర్ణీత సమయం దాటితే కూరగాయలు చెడిపోతాయి. కోల్‌కతా, బెంగుళూరు మధ్య చేపలు కూడా పెద్ద ఎత్తున రవాణా అవుతాయి. కేవలం రాత్రి పూట ప్రయాణం చేసి సకాలంలో తాజా సరకును చేర్చడం సాధ్యం కావడం లేదు. దీంతో సీమాంధ్ర మీదుగా ప్రయాణించే తాజా సరకు రవాణా దాదాపు నిలిచిపోయింది.
ఒక్క లారీ సకాలంలో చేరడం లేదు
‘‘తెలంగాణ ఉద్యమ సమయంలో సరకు రవాణాకు కొంత కాలం విఘాతం కలిగింది. పెట్రో ట్యాంకర్ల మీద వ్యాట్‌ను నిరసిస్తూ కొంతకాలం మేమే సమ్మె చేశాం. ఇప్పుడేమో సమైక్య ఉద్యమం వల్ల రోడ్డు రవాణా నిలిచిపోయింది. దీంతో అనేక కష్టనష్టాలకు గురవుతున్నాం. గత నెల 31 నుంచి సకాలంలో గమ్యస్థానం చేరిన లారీ ఒక్కటి కూడా లేదు’’ అని లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకుడు ఈశ్వరరావు చెప్పారు.