నదీజలాల హక్కులపై తెరాస వ్యాఖ్యలు : నాగిరెడ్డి
నందిగామ, న్యూస్‌లైన్ : నదుల దిగువ ప్రాంతాలవారికి నదీజలాలపై ఎటువంటి హక్కులూ ఉండవని టీఆర్ఎస్ నాయకులు మాట్లాడటం శోచనీయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. హైదరాబాదు నుంచి విజయవాడ వెళుతూ మార్గ మధ్యంలో నందిగామ రహదారి బంగ్లాలో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన వల్ల రెండు ప్రాంతాలకు వినాశనమేనన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచకపోతే అన్ని ప్రాంతాల్లో వ్యవసాయం దెబ్బతిని, ఆంధ్రప్రదేశ్‌కు అన్నపూర్ణ అన్న పేరు పోతుందన్నారు.
1న సమైక్య రైతు శంఖారావం
అక్టోబరు ఒకటిన విజయవాడ ప్రకాశం బ్యారేజీపై ట్రాక్టర్లతో సహా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన రైతులతో ‘సమైక్య రైతు శంఖారావం’ నిర్వహిస్తున్నట్లు నాగిరెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మల్లో ఒకరు హాజరుకానున్నట్లు ఆయన చెప్పారు. రెండు జిల్లాల్లోని రైతులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
వైఎస్ ముమ్మాటికీ సమైక్యవాదే
దివంగత నేత వైఎస్సార్ ఎప్పుడూ విభజనవాదాన్ని సమర్ధించలేదన్నారు. 2004 ఎన్నికల సమయంలోనూ రెండో ఎస్సార్సీ ద్వారా రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకోవాలని అధిష్టానానికి సూచించారని, అదే విషయాన్ని అప్పటి ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపర్చారన్నారు. వేర్పాటువాదాన్ని తనదైన శైలిలో అడ్డుకున్న వైఎస్సార్ లేకపోవడం వల్లే రాష్ట్రం అగ్నిగుండంలా మారిందని ప్రతి ఒక్కరి మనస్సులో ఉందన్నారు. తన హయాంలో విభజనకై తొమ్మిది అంశాలతో ప్రత్యేకంగా జీఓ విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో నియోజకవర్గ పార్టీ కార్యాలయ ఇన్చార్జి మొండితోక అరుణ్, మండల కన్వీనర్లు కుక్కల సత్యనారాయణ ప్రసాద్ (నందిగామ), తాటి రామకృష్ణ (పట్టణ), బండి కోటేశ్వరరావు (కంచికచర్ల), దాసరి రాము (కంచికచర్ల పట్టణ), కోట బుచ్చయ్య చౌదరి (చందర్లపాడు), జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మంగునూరి కొండారెడ్డి, పీజెవీఎస్ కుమార్, ముక్కపాటి శివాజీ, పలు విభాగాల కన్వీనర్లు బుచ్చిరెడ్డి, పాములపాటి రామకృష్ణ, కామసాని ఉదయకుమార్, అనుముల చుక్కయ్య, మువ్వల శ్రీనివాసరావు, రబ్బానీ, సుభానీ, సుఖదేవ్ తదితరులు పాల్గొన్నారు.