United Nations General Secretary
-
UNGA: పాకిస్తాన్‌కు రుచిరా కంబోజ్ కౌంటర్
ఐక్యరాజ్య సమతిలో పాకిస్తాన్ రాయబారిపై భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కంబోజ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ ఒక పగలగొట్టబడిన రికార్డు అని ఆమె ఎద్దేవా చేశారు. శుక్రవారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాకిస్తాన్ రాయబారి మునీర్ అక్రమ్ చేసిన వ్యాఖ్యలపై రుచిరా కంబోజ్ ఘాటుగా స్పందించారు. ‘ఇస్లామోఫోబియాను ఎదుర్కొవటానికి చర్యలు’పై తీర్మాన్నాని ప్రవేశపెట్టే సందర్భంలో పాక్ రాయబారి మునీర్ అక్రమ్ భారత దేశానికి సంబంధించిన రామ మందిర్ నిర్మాణం, సీఏఏ అమలు అంశాలను ప్రస్తావించారు. మునీర్ అక్రమ్ చేసిన వ్యాఖ్యలపై రుచిరా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘మా దేశం (భారత్)కు సంబంధించిన విషయాలపై పాకిస్తాన్ చాలా పరిమితమైన, తప్పుదోవ పట్టించే అభిప్రాయాలు కలిగి ఉండటం దురదృష్టకరం. ప్రపంచం మొత్తం ఒకవైపు అభివృద్ది మార్గంలో దూసుకువెళ్తుంటే పాక్ తీవ్ర విషాదంతో కూడిన స్తబ్దతను కనబరుస్తోంది. ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ ఒక పగలగొట్టబడిన రికార్డు’ అని రుచిరా మండిపడ్డారు. ఇక పాకిస్తాన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా 115 దేశాలు ఓటు వేయాగా.. ఎవరు వ్యతిరేకంగా ఓటు వేయలేదు. కానీ, 44 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఇండియాతోపాటు బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఉక్రెయిన్, యూకే ఓటింగ్‌లో పాల్గొనలేదు. -
భారత పర్యావరణ కృషి భేష్
ఐక్యరాజ్య సమితి: పర్యావరణ పరిరక్షణ కోసం భారత్ చేస్తున్న కృషి అద్భుతమని, సంప్రదాయేతర ఇంధన రంగాన్ని ముందుకు పరుగులు పెట్టించడంలో ఆ దేశం అమోఘంగా పనిచేస్తోందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ కొనియాడారు. ప్రధాని మోదీని తను పలుమార్లు కలుసుకున్నానని సౌర విద్యుత్‌ని వినియోగించుకోవడానికి అంతర్జాతీయ దేశాలను కూడగట్టడంలో ఆయనలోని నాయకత్వ లక్షణాలు ప్రపంచానికి తెలిసాయని ప్రశంసించారు. ఐరాస ప్రధాన కార్యాలయంలో ఏర్పాటైన గాంధీజీ సోలార్ పార్క్‌ని మోదీ 24న ప్రారంభించనున్నారు. ఐక్యరాజ్య సమితి పర్యావరణ సదస్సుని పురస్కరించుకొని గుటెరెస్ మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా విందు సమావేశం ఏర్పాటు చేశారు. సౌర విద్యుత్ రంగంలో భారత్ భారీగా పెట్టుబడులు పెడుతోందని, అయితే ఇంకా థర్మల్ పవర్ వినియోగాన్ని బాగా తగ్గించాల్సిన అవసరం ఉందని అన్నారు. -
ప్రార్థనలు.. ప్రశాంతం!
శ్రీనగర్/న్యూఢిల్లీ/ఐరాస/వాషింగ్టన్: కశ్మీర్లో ప్రార్థనలు చేసుకునేందుకు ప్రభుత్వం శుక్రవారం ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేసింది. దీంతో చాలా ప్రాంతాల్లో ప్రజలు శాంతియుతంగా మసీదుల్లో ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోపోర్‌సహా కొన్నిచోట్ల అల్లరిమూకలు భద్రతాబలగాలపై రాళ్లు విసరగా, వారిని బలగాలు చెదరగొట్టాయి. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి, ప్రత్యేక హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల రద్దుచేసిన సంగతి తెలిసిందే. ఏచూరి, రాజాల అడ్డగింత.. కశ్మీర్లో పర్యటించేందుకు వచ్చిన సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజాలను పోలీసులు అడ్డుకున్నారు. శ్రీనగర్ విమానాశ్రయంలో దిగిన వీరిద్దరినీ అధికారులు తిరిగి ఢిల్లీకి విమానంలో పంపించారు. ఈ విషయమై సీతారాం ఏచూరి మాట్లాడుతూ..‘శ్రీనగర్‌లోకి ఎవ్వరినీ అనుమతించరాదని ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను పోలీసులు మాకు చూపించారు. భద్రతా కారణాల రీత్యా ఎవ్వరినీ అక్కడకు తీసుకెళ్లలేమని చెప్పారు. ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ శుక్రవారం కూడా శ్రీనగర్‌లోని సున్నితమైన ప్రాంతాల్లో తన సహాయకులతో కలిసి పర్యటించారు. పలుచోట్ల కశ్మీరీలతో ముచ్చటించారు. అనంతరం సీఆర్పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులతో ఆయన సమావేశమయ్యారు. సంయమనం పాటించండి: గ్యుటెరస్ జమ్మూకశ్మీర్ విషయంలో భారత్–పాకిస్తాన్‌లు సంయమనం పాటించాలని ఐక్యరాజ్యసమితి(ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్ కోరారు. ఐరాస మార్గదర్శకాలకు లోబడి సిమ్లా ఒప్పందం మేరకు ఇరుదేశాలు తమ సమస్యల్ని పరిష్కరించుకోవాలని సూచించారు. కశ్మీర్ సమస్యను మరో పక్షం జోక్యంలేకుండా ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని 1972లో భారత ప్రధాని ఇందిర, పాక్ అధ్యక్షుడు జుల్ఫీకర్ అలీ భుట్టో ఒప్పందంపై సంతకాలు చేశారు. మా పాలసీ మారలేదు: అమెరికా కశ్మీర్ విషయంలో తమ విధానంలో ఎలాంటి మార్పులేదని అమెరికా తెలిపింది. ఈ సమస్య పరిష్కారానికి భారత్–పాకిస్తాన్‌లు ప్రత్యక్ష చర్చలు ప్రారంభించడమే మార్గమని పునరుద్ఘాటించింది. కాగా, అమెరికా విదేశాంగ సహాయ మంత్రి జాన్ ఆగస్టు 11–17 మధ్య భూటాన్, భారత్‌లో పర్యటించనున్నారు. భారత్, పాకిస్తాన్‌లు తమ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చైనా శుక్రవారం పిలుపునిచ్చింది. పాక్ భయపడుతోంది: విదేశాంగ శాఖ కశ్మీర్లో భారత చర్యలు చూసి పాక్ భయపడుతోందనీ, ఆ ప్రాంతం అభివృద్ధి చెందితే ఇకపై ప్రజలను తప్పుదోవ పట్టించలేమని పాక్ ఆందో ళన చెందుతోందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ అన్నారు. కుల్‌భూషణ్ జాధవ్ ను భారత రాయబారులు కలిసే అంశంపై తాము పాక్‌తో మాట్లాడుతున్నామన్నారు. మరోవైపు, జమ్మూ కశ్మీర్‌లోని అన్ని పంచాయతీలు, వార్డులు, మొహల్లాల్లోనూ స్వాతంత్య్ర దినోత్సవాలను నిర్వహిస్తామని బీజేపీ ప్రకటించింది. ఆగ్రా జైలుకు కశ్మీర్ వేర్పాటువాదులు కశ్మీర్‌లోని హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు మియన్ ఖయ్యూంను పోలీసులు కశ్మీర్ లోయలోని జైలు నుంచి యూపీలోని ఆగ్రాకు తరలించారు. కశ్మీర్లో సమస్యలు సృష్టించగల వ్యక్తులను కేంద్రం ఇతర ప్రాంతాలకు తరలిస్తోంది. ఖయ్యూంతోపాటు 25 మంది వేర్పాటువాదులనుఆగ్రాకు తరలించగా, శుక్రవారం మరో 20 మందిని కశ్మీర్ నుంచి ఆగ్రా సెంట్రల్ జైలుకు తీసుకొచ్చారు. ముందు జాగ్రత్త చర్యగా వారిని పోలీసులు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రముఖ న్యాయవాదిగా పేరున్న ఖయ్యూం, వేర్పాటువాదులకు సంబంధించిన అనేక కేసులను వాదించారు. -
సంస్కరణలకు భారత్ మద్దతు
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్ మూడ్రోజుల పర్యటనలో భాగంగా సోమవారం భారత్‌కు చేరుకున్నారు. ఇక్కడి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న గ్యుటెరస్‌కు ఐరాస సీనియర్ ప్రతినిధులు స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌తో ఆయన భేటీ అవుతారు. భారత పర్యటన సందర్భంగా గ్యుటెరస్ మీడియాతో మాట్లాడుతూ..‘ప్రపంచం మునుపెన్నడూ చూడని సవాళ్లను ప్రస్తుతం ఎదుర్కొంటోంది. వీటిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా ఐరాసను తీర్చిదిద్దాలి. నా సిఫార్సులకు ఐరాసలో సంపూర్ణ మద్దతు ప్రకటించిన భారత్‌కు ధన్యవాదాలు. ప్రస్తుతం భారత్ ఉమ్మడి లక్ష్యాల కోసం ప్రపంచ దేశాలతో కలిసి పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌కు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా భిన్నధ్రువ ప్రపంచాన్ని నిర్మించడం అసాధ్యం. ఇండియా ప్రపంచ శక్తిగా మారుతోంది’ అని పేర్కొన్నారు. -
కశ్మీర్లో స్వతంత్ర విచారణకు మద్దతు
ఐక్యరాజ్యసమితి: కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలపై స్వతంత్ర అంతర్జాతీయ విచారణకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరెస్ మద్దతు పలికారు. ఈ విషయంలో మానవ హక్కుల హైకమిషనర్ నిర్ణయాలు ఐరాస గొంతును ప్రతిబింబిస్తాయని ఆయన పేర్కొన్నారు. స్వతంత్ర విచారణ జరపాలని ఐరాస మానవ హక్కుల విభాగం హైకమిషనర్ ప్రతిపాదించి ఓ నివేదిక రూపొందించారు. అయితే స్వతంత్ర విచారణ చేయాలన్న ప్రతిపాదనను భారత్ ఖండించింది. కాగా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, కశ్మీర్‌లలో సాయుధులు, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న హింస వల్ల పిల్లలపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆ నివేదికలో పేర్కొన్నారు. అంతర్జాతీయ శాంతిభద్రతకు విఘాతం కలిగించే స్థాయి లేని అంశాలను కూడా ఆ నివేదికలో పేర్కొన్నారని భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. -
ఐరాస ప్రధాన కార్యదర్శులు
ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రధాన కార్యదర్శి (జనరల్ సెక్రటరీ)... ఆ సంస్థ నాయకుడిగా వ్యవహరిస్తారు. వీరి పదవీ కాలం ఐదేళ్లు. ఐరాస నూతన ప్రధాన కార్యదర్శిగా పోర్చుగల్ మాజీ ప్రధాని ఆంటోనియో గ్యుటెరస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఐరాస ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన ఎనిమిది మంది వివరాలు.. ట్రిగ్వెలీ నార్వేకు చెందిన ట్రిగ్వెలీ 1946, ఫిబ్రవరి 2 నుంచి 1952, నవంబర్ 10 వరకు ఐరాస తొలి ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. పదవీ కాలంలో ఇజ్రాయెల్‌కు పూర్తి మద్దతిచ్చారు. కొరియా యుద్ధం (1950-1953)లో ఐరాస సైనిక జోక్యాన్ని సమర్థించారు. అయితే దాన్ని సోవియట్ యూనియన్ తీవ్రంగా వ్యతిరేకించడంతో 1952లో రాజీనామా చేశారు. ఈయన రచించిన ‘ఇన్ ది కాజ్ ఆఫ్ పీస్’ పుస్తకం 1954లో ప్రచురితమైంది. టిగ్వెలీ 1968, డిసెంబర్ 30న మరణించారు. డ్యాగ్ హామ్మర్‌సజోల్డ్ స్వీడన్‌కు చెందిన ఈయన 1953, ఏప్రిల్ 10 నుంచి 1961, సెప్టెంబర్ 18 వరకు ఐరాస రెండో ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1961లో కాంగో వెళ్తుండగా విమాన ప్రమాదంలో మరణించారు. ఇప్పటి వరకు ఈ పదవిలో కొనసాగుతూ మరణించిన ఏకైక వ్యక్తి ఈయనే. ఆమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నడీ.. ఈ శతాబ్దపు అతి గొప్ప రాజనీతిజ్ఞుడని హామ్మర్సజోల్డ్ను అభివర్ణించారు. 1961లో మరణానంతరం జోల్డ్‌కు నోబెల్ శాంతి బహుమతి లభించింది. యునెటైడ్ నేషన్స లైబ్రరీని డ్యాగ్ హామ్మర్‌సజోల్డ్ లైబ్రరీగా పిలుస్తున్నారు. 1997లో ఐరాసలోని భద్రతామండలి డ్యాగ్ హామ్మర్‌సజోల్డ్ మెడల్‌ను ఏర్పాటు చేసింది. ఐరాస శాంతి స్థాపన కార్యకలాపాల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి దీన్ని అందిస్తారు. ఈ అవార్డును 1998లో తొలిసారి ముగ్గురికి మరణానంతరం ప్రదానం చేయగా అందులో జోల్డ్ కూడా ఉండటం విశేషం. యు థాంట్ ఈయన బర్మాకు చెందిన దౌత్యవేత్త. 1961, నవంబర్ 30 నుంచి1971, డిసెంబర్ 31 వరకు ఐరాస మూడో ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈ పదవిని నిర్వహించిన తొలి ఐరోపాయేతర వ్యక్తిగా గుర్తింపు పొందారు. 1962లో క్యూబాక్షిపణి సంక్షోభ సమయంలో అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నెడీ, సోవియట్ యూనియన్ ప్రధాని నికితా కృశ్చేవ్‌ల మధ్య చర్చలకు కృషి చేసి మరో యుద్ధం రాకుండా నివారించగలిగారు. 1966లో రెండోసారి ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యాక వియత్నాం యుద్ధంలో అమెరికా చర్యలను తీవ్రంగా విమర్శించారు. 1974, నవంబర్ 25న యు థాంట్ కన్నుమూశారు. ఈయనకు అంతర్జాతీయ అవగాహనకు ఇచ్చే జవహర్లాల్ నెహ్రూ అవార్డు (1965), గాంధీ శాంతి బహుమతి (1972) లభించాయి. కుర్ట వాల్దీమ్ ఆస్ట్రియాకు చెందిన వాల్దీమ్ 1972, జనవరి 1 నుంచి1981, డిసెంబర్ 31 వరకు ఐరాస నాలుగో ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. ఉత్తర కొరియాలో (1979) పర్యటించిన తొలి ప్రధాన కార్యదర్శిగా గుర్తింపు పొందారు. ఐరాస ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ పొందిన తర్వాత 1986 నుంచి 1992 వరకు ఆస్ట్రియా అధ్యక్షుడిగా పనిచేశారు. 2007, జూన్ 14న కన్నుమూశారు. జేవియర్ పెరెజ్ డి కుల్లర్ పెరూకి చెందిన కుల్లర్ 1982, జనవరి 1 నుంచి 1991, డిసెంబర్ 31 వరకు ఐరాస ఐదో ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. బ్రిటన్, అర్జెంటీనాల మధ్య జరిగిన ఫాక్ల్యాండ్స యుద్ధానంతరం.. ఆ రెండు దేశాల మధ్య శాంతి చర్చల్లో కీలక పాత్ర పోషించారు. నమీబియా స్వాతంత్య్రం పొందడంలో ప్రధాన భూమిక వహించారు. 1988లో ఇరాన్-ఇరాక్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కోసం చర్చలు జరిపారు. ఐరాస ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణానంతరం 2000 నవంబర్ 22 నుంచి 2001, జూలై 28 వరకు పెరూ ప్రధానిగా పనిచేశారు. బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ ఈయన ఈజిప్ట్‌కు చెందిన రాజకీయ నాయకుడు, దౌత్యవేత్త. 1992, జనవరి 1 నుంచి1996, డిసెంబర్ 31 వరకు ఐరాస ఆరో ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అమెరికా తిరస్కరించడంతో ఘలీ రెండోసారి ఎన్నిక కాలేకపోయారు. ఫలితంగా ఇప్పటివరకు ఐరాస ప్రధాన కార్యదర్శిగా రెండోసారి ఎన్నిక కాని వ్యక్తిగా గుర్తింపు పొందారు. 1994లో రువాండాలో జరిగిన నరమేధాన్ని నివారించలేకపోయారనే విమర్శలకు గురయ్యారు. ఇందులో పది లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. యుగోస్లేవియా విచ్ఛిన్నం తర్వాత జరిగిన యుద్ధాల్లో కూడా ఘలీ ప్రభావవంతంగా వ్యవహరించలేదనే విమర్శలున్నాయి. ఘలీ 2016, ఫిబ్రవరి 16న కైరోలో మరణించారు. కోఫీ అన్నన్ ఘనా దేశస్తుడైన కోఫీ అన్నన్ 1997, జనవరి 1 నుంచి 2006, డిసెంబర్ 31 వరకు ఐరాస ఏడో ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2001లో కోఫీ అన్నన్‌కు, ఐక్యరాజ్యసమితికి సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఐక్యరాజ్యసమితిని శక్తిమంతంగా తీర్చిదిద్దడం, ఆఫ్రికాలో ఎయిడ్స వ్యాధిని నియంత్రించడం, మానవ హక్కుల పరిరక్షణకు కృషిచేయడం వంటి అంశాల్లో అన్నన్‌కు నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఈయన జెనీవాలో కోఫీ అన్నన్ ఫౌండేషన్‌ను (2007) స్థాపించారు. ఇది లాభాపేక్ష లేని సంస్థ. ప్రపంచ శాంతి, ఉత్తమ పాలన కోసం కృషి చేస్తుంది. కోఫీ అన్నన్ 2007 నుంచి నెల్సన్ మండేలా స్థాపించిన ‘ది ఎల్డర్స’ (లండన్) అనే ప్రభుత్వేతర సంస్థకు చైర్మన్‌గా కొనసాగుతున్నారు. వాతావరణ మార్పులు, ఎయిడ్స, పేదరికం వంటి ప్రపంచ సమస్యలపై ఇది పోరాటం చేస్తుంది. బాన్ కీ మూన్ దక్షిణ కొరియాకు చెందిన బాన్ కీ మూన్ 2007, జనవరిలో ఐరాస ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2012లో రెండోసారి ఎన్నికయ్యారు. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఈ పదవిలో కొనసాగుతారు. వాతావరణ మార్పులు, భూతాపం వంటి సమస్యలపై కృషిచేస్తున్నారు. ఆంటోనియో గ్యుటెరస్ ఇటీవల భద్రతామండలి నిర్వహించిన ఓటింగ్‌లో పోర్చుగల్ మాజీ ప్రధాని ఆంటోనియో గ్యుటెరస్ ఐరాస తొమ్మిదో ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్వ ప్రతినిధి సభ గ్యుటెరస్ పేరును ఖరారు చేయాల్సి ఉంది. పోర్చుగల్ రాజధాని లిస్బన్లో 1949, ఏప్రిల్ 30న జన్మించిన గ్యుటెరస్ 1995 నుంచి 2002 వరకు ఆ దేశానికి ప్రధానిగా పనిచేశారు. 2005, జూన్ నుంచి 2015, డిసెంబర్ వరకు ఐక్యరాజ్యసమితి శరణార్థుల హై కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. ఐరాస ప్రధాన కార్యదర్శి పదవి కోసం గ్యుటెరస్‌తో పోటీపడిన వారిలో ఇరీనా బకోవా (యునెస్కో డెరైక్టర్ జనరల్), హెలెన్ క్లార్క (యూఎన్డీపీ అడ్మినిస్ట్రేటర్) వంటి ప్రపంచ మహిళా నేతలున్నారు.