United States Army
-
జేమ్స్ బాండ్ సినిమా తరహాలో ప్రతీకారం తీర్చుకున్న అమెరికా
అల్‌ఖైదా అగ్రనేత అల్ జవాహిరీని అమెరికా వేటాడి, వెంటాడి ప్రాణాలు తీసిన వార్త కొంచెం ఆలస్యంగా వెలుగు చూసింది. గురికి బారెడు దూరంలో ఉన్న ఆస్తులకు, మనుషులకు ఏమాత్రం హాని కలిగించకుండా కేవలం లక్ష్యాన్ని మాత్రమే చేధించగల ఆధునిక క్షిపణి సాయంతో, అఫ్గానిస్తాన్‌లో తలదాచుకున్న ఆ ఉగ్రవాదిని మట్టుబెట్టింది. ఇరవై ఏళ్ళ క్రితం 2001 సెప్టెంబర్ 11 తేదీన (9/11) అప్పటి అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కారణంగా జరిగిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన 2,997 మంది అమెరికన్ కుటుంబాల బాధకు, ఆవేదనకు జవాహిరీ మరణం ఓ ముగింపు అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. 9/11గా ప్రసిద్ధమైన ఆనాటి విధ్వంసానికి ప్రతీకారంగా, అమెరికా పదేళ్ల తర్వాత, 2011లో బిన్ లాడెన్‌ను వధించి పగ తీర్చుకుంది. అప్పట్లో లాడెన్‌కు కుడి భుజంగా వ్యవహరించిన జవాహిరీని కూడా వదిలిపెట్టలేదు. మరో పదేళ్ల తర్వాత ఇప్పుడు అల్ జవాహిరీని చంపి, తమది పాము పగ అని అమెరికా యావత్ ప్రపంచానికీ మరోమారు చాటి చెప్పింది. ఈ నేపథ్యంలో గతంలో ఏం జరిగిందో చూద్దాం. ‘మతం కోసం ఎలాంటి మారణహోమానికి అయినా సిద్ధం’ అనే సిద్ధాంతం అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌ది. ‘ప్రపంచం మీద పెత్తనం కోసం ఎంతటి దురాగతానికయినా సంసిద్ధం’ అనే తత్వం అమెరికాది. ‘పాముకు పాలుపోసి పెంచుతాను, కానీ ఆ పాము తనను తప్ప ఎవరిని కాటేసినా ఫరవాలేదు అనే థియరీ’ అమెరికాది. ‘కోరల్లో దాచుకున్న విషం కక్కేటప్పుడు స్వపర భేదాల ప్రసక్తి పనికి రాదనే భావజాలం’ ఒసామాది. ఒకానొక కాలంలో అమెరికా తన అవసరాల కోసం పెంచి పోషించిన ఒసామా బిన్ లాడెన్ అనే ఈ విషనాగు, ఇరవై ఏళ్ళ క్రితం అమెరికాపైనే ఎదురుతిరిగి, పాలు పోసి పెంచిన చేతినే కాటేసింది. సోవియట్ యూనియన్ అంతర్ధానం తరువాత ఏర్పడ్డ ఏకధృవ ప్రపంచానికి... లేని పెద్దరికాన్ని ఆపాదించుకుని అనేక అకృత్యాలకు పాల్పడుతున్న అమెరికా అహంభావాన్ని... బిన్ లాడెన్ తనదైన శైలిలో దెబ్బ తీశాడు. అప్పుడు కానీ ‘పాము – పాలు’ కథ లోని అంతరార్థం అమెరికాకు అవగతం కాలేదు. తన దాకా వస్తేగాని తత్వం బోధపడదన్నట్టుగా... అల్‌ఖైదా తీవ్ర వాదులు 2001, సెప్టెంబర్ 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట టవర్లను విమానాలతో ఢీ కొట్టించి కనీ వినీ ఎరగని భయోత్పాతాన్ని సృష్టించిన ఘటన తర్వాత గానీ ఉగ్రవాదం వల్ల పొంచి వున్న ముప్పు ఎలా ఉంటుందన్నది అమెరికాకు అర్థం కాలేదు. ఆనాటి పరాభవం అమెరికాలో పట్టుదలను పెంచింది. ఆ దురాగతానికి రూపశిల్పి అయిన ఒసామా బిన్ లాడెన్ అంతం చూడడానికి దశాబ్ద కాలంగా అమెరికా చేయని ప్రయత్నం అంటూ లేదు. చిట్టచివరికి, పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, పాకిస్తాన్ భూభాగంలో ఆ దేశ పాలకులకే తెలియకుండా తలదాచుకుంటున్న ఒసామా బిన్ లాడెన్‌ను, జల్లెడ పట్టి గాలించి పట్టుకుని మట్టు పెట్టేదాకా మాజీ అగ్ర రాజ్యాధినేత బరాక్ హుస్సేన్ ఒబామాకు కంటిమీద కునుకు లేకుండాపోయింది. ఒసామా మరణించిన విషయాన్ని స్వయంగా అమెరికన్ అధ్యక్షుడే ప్రకటించిన అంశాన్ని గమనిస్తే ఈ విషయానికి ఆ దేశం ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో విశదమవుతుంది. లాడెన్ మరణ వార్తను ధృవ పరచుకోవడానికి వీలుగా అమెరికా వ్యూహకర్తలు పకడ్బందీగా అమలు చేసిన హైటెక్ పద్ధతులు టీవీల్లో చూసినవారికి జేమ్స్ బాండ్ సినిమాలు జ్ఞప్తికి వచ్చాయి. వైట్ హౌస్‌లో కూర్చుని పథకం అమలవుతున్న తీరు తెన్నులను ఎప్పటి కప్పుడు ఉపగ్రహ సాయంతో గమనిస్తున్న ప్రెసిడెంట్ ఒబామా హావభావాలను బట్టి అన్ని దేశాలలోని టీవీ వీక్ష కులూ లాడెన్ మృతి పట్ల ఆ దేశానికి వున్న పట్టుదలను అర్థం చేసుకోగలిగారు. (క్లిక్: జవహరీ మృతిపై తాలిబన్ల సంచలన ప్రకటన) ఒసామా బిన్ లాడెన్ పూర్వీకులు ఎమెన్‌లో కడు నిరుపేదలు. అతడి తండ్రి మహమ్మద్ బిన్ లాడెన్, ఎమెన్ నుంచి ఉదర పోషణార్థం సౌదీ అరేబియాకు వలస వెళ్లి నిర్మాణ రంగంలో కాలుపెట్టి కోట్లకు పడగలెత్తాడు. గల్ఫ్ యుద్ధం సహాయక చర్యల్లో భాగంగా... అమెరికా మిలిటరీ స్థావరం ఏర్పాటుకు సౌదీ ప్రభుత్వం తన భూభాగంలో అనుమతించడాన్ని ఒసామా విమర్శించాడు. దీంతో కోపగించిన సౌదీ ప్రభుత్వం అతడి పౌరసత్వాన్నీ, పాస్‌పోర్ట్‌నూ రద్దు చేసింది. అప్పటికే లాడెన్ కుటుంబం కూడా ఒసామాను తమ నుంచి వెలి వేసింది. ఆ తర్వాత ప్రపంచంలోనే భయంకర ఉగ్రవాదిగా తయారయ్యి అమెరికా చేతిలో హతుడయ్యాడు. ఒసామా తర్వాత అల్‌ఖైదా పగ్గాలు చేపట్టిన అల్ జవాహిరీ కూడా లాడెన్ తరహాలోనే మరణించడం కాకతాళీయం. - భండారు శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్ట్ -
మిలటరీని దింపుతా: ట్రంప్
వాషింగ్టన్: జార్జ్‌ఫ్లాయిడ్ హత్యోదంతంపై అమెరికాలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రాలు ఈ ఉద్యమాలను అణచివేయడంలో విఫలమైతే సైన్యాన్ని రంగంలోకి దింపేందుకూ వెనుకాడనని అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. మరోవైపు భారతీయ అమెరికన్ సీఈవోలు పలువురు ఆందోళనలకు మద్దతు పలికారు. వైట్‌హౌస్‌లోని రోజ్ గార్డెన్లో సోమవారం ట్రంప్ ప్రసంగిస్తూ..ఆందోళనలను, దుకాణాల లూటీ, విధ్వంసకర చర్యలను అదుపు చేసేందుకు సాయుధులైన వేలాది మంది సైనికులు, మిలటరీ అధికారులను పంపుతున్నట్లు ప్రకటించారు. ‘‘హింసాత్మక ఘటనలు తగ్గేంతవరకూ ఆయా రాష్ట్రాల గవర్నర్లు, మేయర్లు తగినంత మంది నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌ను విధుల్లో నియమించాలి. చట్టాలు అమలయ్యేలా అన్ని చర్యలు తీసుకోవాలి’’అని స్పష్టం చేశారు. ఏదైనా రాష్ట్రం, నగరంతగిన చర్యలు తీసుకోలేని పక్షంలో సమస్యలు పరిష్కరించేందుకు అక్కడ అమెరికా మిలటరీని నియమిస్తామని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా ఇటీవలి కాలంలో నేరస్తులు, దుండగులు, విధ్వంసకారుల చేతుల్లో బందీ అయిపోయిందని ఇది స్థానిక ఉగ్రవాదమేనని, అమాయకుల ప్రాణాలు తీయడం మానవజాతిపై మాత్రమే కాకుండా దేవుడికి వ్యతిరేకంగా జరుగుతున్న నేరాలని అన్నారు. వైట్‌హౌస్ ప్రాంగణంలో సైనిక వాహనాలు.. ఇదిలా ఉండగా.. ఫ్లాయిడ్ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. గొంతు నొక్కుకుపోయిన కారణంగా అతడి మరణం సంభవించిందని ఇది హత్యేనని అధికారికంగా ప్రకటించారు జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసగా మొదలైన నిరసనలు సోమవారం కూడా కొనసాగాయి. ఇప్పటికే 40 నగరాల్లో కర్ఫ్యూ విధించగా.. సుమారు 150 నగరాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఆరు రాష్ట్రాలతోపాటు 13 నగరాల్లో అత్యవసర పరిస్థితిని విధించారు. నేషనల్ సెక్యురిటీ గార్డ్స్‌కు చెందిన 67 వేల మంది పలు నగరాల్లో పరిస్థితిని నియంత్రించే ప్రయత్నాల్లో ఉన్నారు. చర్చిని సందర్శించిన ట్రంప్... వాషింగ్టన్లో ఆందోళనకారుల చేతుల్లో పాక్షికంగా దహనమైన సెయింట్ జాన్స్ చర్చ్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం సందర్శించారు. చేతిలో బైబిల్ పట్టుకున్న ట్రంప్ చర్చిలో కొంత సేపు గడిపారు. అధ్యక్షుల చర్చిగా పేర్కొనే సెయింట్ జాన్స్ ఎపిస్కాపల్ చర్చ్‌లో తొలి ప్రార్థనలు 1816 అక్టోబరు 27న జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. వైట్‌హౌస్‌కు దగ్గరగా ఉంటుంది ఈ చర్చి. జేమ్స్ మాడిసన్ మొదలుకొని అధ్యక్షులంతా ఈ చర్చిలో ప్రార్థనలు చేసిన వారే. సత్య నాదెళ్ల మద్దతు జార్జ్‌ఫ్లాయిడ్ మృతికి నిరసనగా చేపట్టిన ఆందోళనలకు మైక్రోసాప్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ మద్దతు పలికారు. ‘సమాజంలో హింసకు, ద్వేషానికి తావులేదు. సానుభూతి, అర్థం చేసుకోవడం అవసరం. అయితే వీటికంటే ఎక్కువ చేయాల్సి ఉంది’అని సత్య నాదెళ్ల ట్వీట్ చేశారు. ఆఫ్రికన్ అమెరికన్లకు మద్దతు తెలుపుతున్నానని, తమ కంపెనీలోనూ, సమూహాల్లోనూ ఇదే పంథా అనుసరిస్తామన్నారు. సుందర్ పిచాయ్ ఒక ట్వీట్ చేస్తూ.. ‘‘ఈ రోజు అమెరికాలోని గూగుల్, యూట్యూబ్ హోం పేజీల్లో ఆఫ్రికన్ అమెరికన్లకు సంఘీభావం తెలుపుతా’’అని చెప్పారు. పెప్సీ కో మాజీ సీఈవో ఇంద్రా నూయీ కూడా ఆందోళన చేస్తున్న వారికి మద్దతు పలికారు. వారం రోజులుగా లక్షలాది మంది అమెరికన్లు తమ బాధను నిరసన ప్రదర్శనల రూపంలో వ్యక్తం చేశారని ట్వీట్ చేశారు. -
‘అమెరికాకు పాకిస్తాన్ వెన్నుపోటు’
వాషింగ్టన్: తీవ్రవాదం అంతమొందించే విషయంలో అమెరికాకు పాకిస్తాన్ వెన్నుపోటు పొడించిందని యూఎస్ ఆర్మీ మాజీ కల్నల్ లారెన్స్ సెల్లిన్ ఆరోపించారు. తాలిబన్తోపాటు, ఇతర ఉగ్ర సంస్థలతో పాక్ వ్యవహరించే తీరు పలు అనుమానాలకు తావిస్తుందని ఆయన అన్నారు. అప్ఘనిస్తాన్, ఉత్తర ఇరాక్లలో యూఎస్ ఆర్మీ తరఫున పనిచేసిన సెల్లిన్ తన అభిప్రాయాలను ఓ అర్టికల్‌లో వెల్లడించారు. 2001లో అమెరికా అఫ్ఘనిస్తాన్‌పై దాడులు ప్రారంభించగానే పాక్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) తాలిబన్లకు ఆయుధాలను, పేలుడు పదార్థాలను సరాఫరా చేసిందని తెలిపారు. అప్పటి పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్, అప్పటి ఐఎస్ఐ డైరక్టర్ లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ అహ్మద్‌తో పాటు ఇతర ఆర్మీ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారని.. ఆ సమావేశంలో తాలిబన్, అల్ఖైదాలకు వ్యతిరేకంగా యూఎస్ జరిపే దాడులకు సహాయం చేయరాదని నిర్ణయం తీసుకున్నట్టు సెల్లిన్ పేర్కొన్నారు. ఇలా 17ఏళ్ల నుంచి పాక్ కపట నాటకం ఆడుతూనే ఉందని విమర్శించారు. ఓ వైపు అమెరికా నుంచి బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం పొందుతూ.. మరోవైపు నెమ్మదిగా అఫ్ఘనిస్తాన్‌లో అమెరికా బలగాలను దెబ్బతీసేందుకు తాలిబన్, హకానీ నెట్వర్క్ గ్రూపులకు సహాయం చేసిందని మండిపడ్డారు. తాలిబన్ గాడ్ ఫాదర్‌గా పేరు గాంచిన పాక్ ఐఎస్ఐ మాజీ చీఫ్ హమీద్ గుల్, ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఏదో ఒక రోజు ఐఎస్ఐ, యూఎస్ సహాయంతో అఫ్ఘనిస్తాన్ నుంచి సోవియట్ యూనియన్ బలగాలను బయటకు పంపుతోందని, అలాగే యూఎస్ సహాయంతోనే యూఎస్‌ను అఫ్ఘనిస్తాన్ నుంచి పంపిచి వేస్తామని చేసిన వ్యాఖ్యలను సెల్లిన్ గుర్తుచేశారు. 2001కి ఇప్పటికీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని ఆయన అన్నారు. ప్రస్తుతం తాలిబన్ బలగాలు పాక్‌లోనే తలదాచుకుంటున్నాయని.. వారికి కావాల్సిన రిక్రూట్మెంట్, ట్రైనింగ్ అంత అక్కడే జరుగుతోందని ఆయన తెలిపారు. ఐఎస్ఐ కూడా ఇందులో కీలక భూమిక పోషించడం బహిరంగ రహస్యమేనని పేర్కొన్నారు. అలాగే చైనా కూడా పాక్‌కు సలహాలు అందజేస్తుందని ఆయన ఆరోపించారు. -
సమాచార యోధుడికి ఖైదు
సంపాదకీయం: నిజం చెప్పడం నేరమైంది. ఇక్కడ సరిగా లేదని చెప్పడం ద్రోహమైంది. అమాయకుల్ని పొట్టనబెట్టుకుంటున్నారని వెల్లడించడం తప్పయింది. ఇరాక్, అఫ్ఘానిస్థాన్లలో అమెరికా సైన్యం సాగిస్తున్న యుద్ధ నేరాలపై ప్రపంచ ప్రజలను అప్రమత్తం చేసిన అమెరికా సైనికుడు బ్రాడ్లీ మానింగ్‌కు అక్కడి సైనిక న్యాయ స్థానం బుధవారం 35 ఏళ్ల జైలుశిక్ష విధించింది. అమెరికా రహస్యాలను బట్ట బయలు చేస్తున్న జూలియన్ అసాంజ్ నేతృత్వంలోని వికీలీక్స్‌కు అతను 7 లక్షల రహస్య పత్రాలు అందించాడని, యుద్ధక్షేత్రంలో జరిగిన ఘటనలకు సంబంధించి వీడియోలను, దౌత్యసంబంధమైన కేబుల్స్‌ను ఆ సంస్థకు చేరవేశాడని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. వీటివల్ల అల్‌కాయిదా వంటి ఉగ్రవాద సంస్థలకు దేశం రహస్యాలన్నీ తెలిసిపోయాయని, పర్యవసానంగా వాటినుంచి పెనుముప్పు ఏర్పడిందని అభియోగం మోపింది. తన చర్యల ద్వారా అతను శత్రువుకు సహకరించాడని పేర్కొంది. వికీలీక్స్‌కు ఇలాంటి పత్రాలన్నీ చేరవేసే సమయానికి మానింగ్ బాగ్దాద్‌లో సైనిక అనలిస్టుగా పనిచేస్తున్నాడు. అతను బయటపెట్టిన పత్రాల్లో ఉన్న అంశాలు అసాధారణమైనవి. నాగరిక సమాజం ఏమాత్రం హర్షించలేనివి. ఇరాక్‌లోని అమెరికా బలగాలు 2007లో హెలికాప్టర్ నుంచి బాంబులు విసిరి రాయ్‌టర్స్ వార్తాసంస్థకు చెందిన ఇద్దరు ప్రతినిధులతోసహా డజనుమంది సాధారణ పౌరులను చంపడానికి సంబంధించిన విడియోను మానింగ్ బయటపెట్టాడు. అఫ్ఘాన్‌లోని కాందహార్‌లో ఒక ప్రయాణికుల బస్సును చుట్టుముట్టి విచక్షణారహితంగా కాల్పులు జరపడం, చెక్పోస్టులవద్దా, రహదారులపైనా పౌరులను హింసించడం, కాల్చిచంపడం, ఉన్మాదంతో కేరింతలు కొట్టడంవంటివి వెల్లడించాడు. ఏమీ జరగనట్టు, ఎరగనట్టు ఉండిపోతున్న అమెరికా ప్రభుత్వ తీరుపై కలత చెందాడు. ప్రపంచ ప్రజలకు ఇవన్నీ తెలిసేలా చేస్తే తప్ప ఈ అమానుషాలకు తెరపడదన్న నిర్ణయానికొచ్చాడు. మానింగ్‌కు పడిన శిక్ష ఇప్పుడు లేవనెత్తుతున్న ప్రశ్నలెన్నో! సైన్యమంటే ఉక్కు క్రమశిక్షణ కలిగి ఉండాలని, పైనుంచి వచ్చిన ఆదేశాలను పొల్లుపోకుండా పాటించడమే తప్ప ప్రశ్నించనేరాదని చాలా మంది నమ్ముతారు. సైనికులకు హృదయం కాక మెదడు మాత్రమే పనిచేయాలని, అలా చేస్తేనే అంకితభావంతో వ్యవహరించినట్టని విశ్వసిస్తారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్, ముసోలిని ఉన్మాద చర్యలను గేలిచేస్తూ చార్లీ చాప్లిన్ నిర్మించిన ‘గ్రేట్ డిక్టేటర్’ చిత్రం సైనికులను మరలుగా బతకొద్దని చెబుతుంది. మనుషులుగా ఆలోచించ మంటుంది. యుద్ధోన్మాదుల తరఫున పోరాడవద్దని ఉద్బోధిస్తుంది. సరిగ్గా మానింగ్ చేసింది అదే. తమ దేశం ప్రపంచంలోనే అగ్రరాజ్యమని, కనుక అది ఏం చేసినా సరైందే అవుతుందని అతను భావించలేదు. ఉగ్రవాదులనుంచి ఇరాక్, అఫ్ఘాన్ ప్రజల్ని రక్షిస్తామని అడుగుపెట్టిన తమ సైన్యమే ఉగ్రవాదిగా మారడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. సాధారణ సైనికుడిలా ఆదేశాలందిన వెంటనే ముందుకు ఉరకడం తప్ప మరేమీ ఆలోచించకపోతే మానింగ్ దేశం కోసం పోరాడిన ధీరుడిగా ప్రభుత్వ మన్ననలు అందుకొనేవాడేమో! కానీ, 23 ఏళ్ల వయస్సుకే అతను పరిణతి ప్రదర్శించాడు. తాము వచ్చింది దేనికో, చేస్తున్నదేమిటో, ప్రపంచానికి చెబుతున్నదేమిటోనన్న విచికిత్సలో పడిపోయాడు. తమ చర్యలను ప్రపంచానికి తెలియజెబితేతప్ప ఇది ఆగేలా లేదని విశ్వసించాడు. 9/11 ఉగ్రవాద దాడుల తర్వాత అమెరికా సమాజం కరడుగట్టిందని, ‘నువ్వు మాతో లేకపోతే మా శత్రువుతో ఉన్నట్టేన’న్న బుష్ తాత్వికతను తలకెక్కించుకుని మీడియా మౌనం వహిస్తున్నదని గుర్తించలేకపోయాడు. అందుకే, మీడియా ప్రజాభిప్రాయాన్ని కూడగడుతుందని, కనీసం అప్పుడైనా ఇరాక్, అఫ్ఘానిస్థాన్ ప్రజలపై సాగుతున్న అమానుషాలకు తెరపడుతుందనుకున్నాడు. తనకు తెలిసిన భోగట్టాను ‘వాషింగ్టన్ పోస్ట్’ వంటి పత్రికలకు అందజేశాడు. ఆ పత్రికలు నిరాసక్తత కనబరచడంతో గత్యంతరంలేక వికీలీక్స్‌కు అందజేశాడు. మానింగ్ చర్యలవల్ల అమెరికా ప్రజలకూ, అమెరికాకు సమాచారం అందించిన ఆయా దేశాల్లోని పౌరులకూ ముప్పు ఏర్పడిందని ప్రభుత్వం ఆరోపించింది. అనేక దేశాల్లో దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించాల్సివచ్చిందని, కొందరు రాజీనామాలు చేశారని తెలిపింది. అయితే, అందుకు ఎలాంటి సాక్ష్యాధారాలనూ సమర్పించలేదు. తన చర్యలు దేశానికిగానీ, ప్రజలకుగానీ హాని కలిగించివుంటే పశ్చాత్తాపపడుతున్నానని అధ్యక్షుడు ఒబామాకు రాసిన లేఖలో మానింగ్ కూడా చెప్పాడు. ప్రజలకు సాయపడటమే తప్ప, ఎవరినైనా బాధ పెట్టడం తన ఉద్దేశం కాదన్నాడు. దేశంపై ప్రేమతో, కర్తవ్యదీక్షతో ఈ పని చేశానన్నాడు. నిజానికి శిక్ష ఖరారుకు ముందే మానింగ్ దారుణ నిర్బంధాన్ని చవి చూశాడు. మూడేళ్ల నిర్బంధంలో దాదాపు పది నెలలు అతన్ని ఒంటరి ఖైదు చేశారు. నిద్రపోనీయకుండా గంటల తరబడి ప్రశ్నించారు. మానింగ్ జులాయి అయినట్టయితే, అతనికేమీ ఉన్నతాదర్శాలు లేనట్టయితే తనకు అందుబాటులోకి వచ్చిన సమాచారాన్ని కోట్లాది డాలర్లకు అమ్ముకునేవాడు. లేదా సైన్యం నుంచి తప్పుకున్నాక వాటి ఆధారంగా సంచలన గ్రంథాలు రాసి డబ్బు, ప్రచారం పొందేవాడు. అతను అదేమీ చేయలేదు. ప్రభుత్వం ఆరోపించినట్టు అతను దేశద్రోహి కాదు...ఉగ్రవాది అంతకన్నా కాదు. స్ఫటిక స్వచ్ఛమైన హృదయంతో, వజ్ర సదృశమైన సంకల్పంతో ఉన్నతమైన సమాజాన్ని కాంక్షించిన సమాచార యోధుడు. ఇప్పుడు మానింగ్ క్షమాభిక్ష కోరుతూ రాసిన లేఖ ఒబామా చేతిలో ఉంది. దాన్ని ఆమోదించి అమెరికాలో ఔన్నత్యం ఇంకా మిగిలే ఉన్నదని నిరూపిస్తారో, లేదో తేల్చుకోవాల్సింది ఆయనే. ఒబామా అలా వ్యవహరించేలా ఒత్తిడి తేవాల్సిన బాధ్యత ప్రపంచ ప్రజానీకంపైనా, మరీ ముఖ్యంగా అమెరికా పౌరులపైనా ఉంది.