కరెంట్ షాక్‌తో ఆకలిని చంపేస్తుంది..
వాషింగ్టన్: బరువు తగ్గేందుకు రకరకాల పద్ధతులు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. అందులోకి తాజాగా మరో కొత్త పద్ధతి చేరింది. అదే.. షాక్ కొట్టించి ఆకలిని చంపేసే పద్ధతి! కడుపులోని నాడులకు విద్యుత్ ప్రేరణలు ఇచ్చి ఆకలిని చంపేసే ఈ పద్ధతికి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) ఇటీవల అనుమతి ఇచ్చేసింది. ఈ పద్ధతిలో ‘మ్యాస్ట్రో రీచార్జబుల్ సిస్టమ్’ అనే పరికరంతో స్థూలకాయం, టైప్ 2 డయాబెటిస్లకు చికిత్స చేసేందుకు ఎఫ్‌డీఏ ఆమోదం తెలిపింది.
బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ) 35 నుంచి 45 మధ్యలో ఉండి, 18 ఏళ్లు నిండిన రోగులకే దీనిని ఉపయోగించాలని షరతు కూడా పెట్టింది. స్థూలకాయ చికిత్సకు ఇలాంటి పరికరం తయారు చేయడం, దానికి ఆమోదం లభించడం ఇదే తొలిసారట. ఈ పరికరం సాయంతో కొన్ని నెలలపాటు ప్రయోగాలు చేయగా.. వాలంటీర్లలో సగంమందికి పైగా 20 శాతం వరకూ అదనపు బరువును కోల్పోయారట. హైబీపీ, కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించేందుకూ ఇది ఉపయోగపడుతుందట. ఇతర ఎలాంటి దుష్ర్పభావాలు లేకుండానే రోగులకు ఆకలి లేకుండా చేయొచ్చు కాబట్టి.. ఈ పద్ధతి చాలా సురక్షితమని దీని తయారీదారులు చెబుతున్నారు.