గోళ్లు కొరుక్కునే అలవాటు ఉందా? ఐతే ఓకే!
స్టడీ
గోళ్లు కొరుక్కోవడం (గో.కొ), జుత్తు పీక్కోవడం (జు.పీ)లాంటి వాటిని నిరాశ, ఆందోళనలను సూచించే లక్షణాలకు సూచికగా చెప్పుకుంటాం. అయినంత మాత్రాన ఈ అలవాటును పూర్తి వ్యతిరేక భావంతో చూడనక్కర్లేదని తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది. గో.కొ, జు.పీ అలవాటు అనేది ఆయా వ్యక్తులలోని పర్ఫెక్షనిజాన్ని సూచిస్తుందని యూనివర్శిటీ ఆఫ్ మాన్ట్రెయెల్, కెనడా బృందం చెబుతుంది.
‘‘రిపీటివ్ బిహేవియర్స్ అనేవి ఒక ఒక అర్థాన్ని సూచించవు. పర్ఫెక్షనిజానికి అనుబంధంగా ఉన్న అనేక లక్షణాలను సూచిస్తాయి’’ అంటున్నారు అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ కైరాన్.
ఒత్తిడి నుంచి విముక్తి పొందడంలో కూడా గో.కొ, జు.పీ ప్రధాన పాత్ర పోషిస్తాయని ఈ అధ్యయనం తెలియజేస్తుంది. రిపీటివ్ బిహేవియర్ ఉన్న వారిని, లేని వారిని రెండు బృందాలుగా ఏర్పాటు చేసి అధ్యయనాన్ని ప్రారంభించింది కైరాన్ బృందం. ఒక్కొక్కరికి నాలుగు సెషన్ల చొప్పున కేటాయించి ఒత్తిడి, ఉపశమనం, నిరాశ... మొదలైన లక్షణాల గురించి అధ్యయనం చేసింది.
‘‘పర్ఫెక్షన్ కోసం తపించే తరుణంలో ఒకటికి రెండు ఆలోచనలు చేస్తుంటాం. ఒక ఆలోచనకు మరో ఆలోచనకు మధ్య విరామంలోనే గో.కొ, జు.పీలు ఎక్కువ చోటు చేసుకుంటాయి’’ అంటున్నారు అధ్యయనబృందంలో ఒకరైన సారా రాబర్ట్. ఈ అధ్యయనానికి సంబంధించిన పూర్తి వివరాలు ‘బిహేవియర్ థెరపీ’ జర్నల్లో ప్రచురితమయ్యాయి.