University of Sydney
-
భారత్ బయోటెక్.. యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ మధ్య ఒప్పందం - అందుకేనా?
హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఇన్స్టిట్యూట్ ఈ రోజు ఒక ఆవాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ఎందుకు జరిగింది? దీని వల్ల ఉపయోగం ఏంటి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వ్యాక్సిన్ పరిశోధన కార్యక్రమాలు, విద్యా పరిశ్రమ భాగస్వామ్యాలను బలోపేతం చేయడం మాత్రమే కాకుండా.. అంటు వ్యాధులను ఎదుర్కోవడానికి ప్రపంచ ప్రయత్నాలను పెంపొందించడానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ భాగస్వామ్యం బయో థెరప్యూటిక్స్ శాస్త్రాన్ని అభివృద్ధి చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. వ్యాక్సిన్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను సరైన సమయంలో రక్షించుకోవడానికి తక్కువ ఖర్చుతో సాధ్యమవుతాయి. ప్రాణాంతక వ్యాధుల భారీ నుంచి కాపాడానికి వ్యాక్సిన్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. కరోనా మహమ్మారి సమయంలో చాలా దేశాలకు వ్యాక్సిన్స్ అందించిన ఘనత భారత్ సొంతం. ఈ సమయంలోనే మన దేశం సామర్థ్యం వెలుగులోకి వచ్చింది. ఈ ఒప్పందం సందర్భంగా.. భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ 'కృష్ణ ఎల్లా' మాట్లాడుతూ.. యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఇన్స్టిట్యూట్తో ఏర్పడిన ఈ బంధం పరిశోధనలను సులభతరం చేస్తుంది, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది, సైన్స్ వ్యాక్సిన్ టెక్నాలజీని మరింత ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. సురక్షితమైన వ్యాక్సిన్ ప్లాట్‌ఫామ్‌లను అభివృద్ధి చేయడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడం, ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి ఒప్పందం ఉపయోగపడుతుందని వెల్లడించారు. కొత్త వ్యాక్సిన్లు, బయోథెరఫిటిక్స్ అభివృద్ధిలో మా నైపుణ్యాన్ని హైలైట్ చేయడానికి, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌తో కలిసి, ప్రపంచ ఆరోగ్యంపై శాశ్వత ప్రభావాన్ని చూపడమే లక్ష్యమని.. యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఇన్స్టిట్యూట్ డిప్యూటీ డైరెక్టర్ ప్రొఫెసర్ 'జామీ ట్రిక్కాస్' అన్నారు. కరోనా సమయంలో భారత్ బయోటెక్ వంటి కంపెనీలు ప్రపంచ డిమాండ్‌లో దాదాపు 60 శాతం కంటే ఎక్కువ వ్యాక్సిన్లను అందించగలిగాయి. ఏకంగా 2.4 బిలియన్ డోస్‌ల కోవిడ్-19 వ్యాక్సిన్లను సరఫరా చేసిన రికార్డ్ భారత్ సొంతమైంది. దీంతో దేశ ఖ్యాతిని గుర్తించిన చాలా సంస్థలు, ఇండియన్ కంపెనీలతో చేతులు కలపడానికి ఆసక్తి చూపాయి. భవిష్యత్తులో ఇలాంటి మహమ్మారి వైరస్ భారీ నుంచి ప్రజలను రక్షించుకోవడానికి వ్యాక్సిన్ అభివృద్ధి రూపకల్పన కోసం భారతదేశం ఆర్&డీ పెట్టుబడులను కొనసాగిస్తోంది. -
300 కోట్ల ప్రాణులు కనుమరుగు!
మెల్బోర్న్: దాదాపు 300 కోట్ల వన్య ప్రాణులు మరణాలు/వలసలకు ఆస్ట్రేలియాలో చెలరేగిన భీకర కార్చిచ్చు కారణమని తాజా నివేదికలో వెల్లడించింది. యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ, యూనివర్సిటీ ఆఫ్ సౌత్ వేల్స్, యూనివర్సిటీ ఆఫ్ న్యూ కసెల్, చార్లెస్ స్టర్ట్ యూనివర్సిటీ, బర్డ్ లైఫ్ ఆస్ట్రేలియాలు కలసి వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్)లు సంయుక్తంగా 11.46 మిలియన్ల హెక్టార్ల పరిధిలోని కార్చిచ్చుతో ధ్వంసమైన అటవీ ప్రాంతం, జనావాసాలపై పరిశోధన నిర్వహించి నివేదికను వెల్లడించాయి. గతంలో 120 కోట్ల వన్య ప్రాణులు చనిపోయినట్లు ఆ నివేదికలో వెల్లడించాయి. అయితే ఆ పరిశోధన పూర్తి స్థాయిలో జరగలేదని, కార్చిచ్చు వ్యాపించిన చోటంతా నిర్వహించిన తాజా పరిశోధనలో దానికి మూడు రెట్ల సంఖ్యలో వన్య ప్రాణులు మరణించినట్లు వేరే ప్రాంతానికి వెళ్లినట్లు వెల్లడైందని పరిశోధకులు చెప్పారు. 143 మిలియన్ల పాలిచ్చే జంతువులు, 246 కోట్ల పాకే జంతువులు, 180 మిలియన్ల పక్షులు, 5.1 కోట్ల కప్పలు మరణించినట్లు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ చెప్పింది. ఆధునిక ప్రపంచంలో ఈ స్థాయిలో నష్టం కలిగిన ఘటన కనీవినీ ఎరుగనిదని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ తెలిపింది. ఎగసిన మంటల నుంచి వన్యప్రాణులు తప్పించుకునే అవకాశం లేదని, తప్పించుకున్నా ఆహారం లేక మరణించి ఉంటాయని, వేరే చోట మనుగడ సాగించలేక కూడా మరణించి ఉండవచ్చని పేర్కొంది. -
చూయింగ్ గమ్‌తో క్యాన్సర్!
సిడ్నీ: చూయింగ్ గమ్ తినడాన్ని చాలామంది ఇష్టపడతారు. మరీ ముఖ్యంగా చిన్నారులు వీటిని ఎక్కువగా తింటుంటారు. అయితే రుచికి తియ్యగా ఉండే ఈ చూయింగ్ గమ్ల వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని తాజా పరిశోధనల్లో తేలింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు చూయింగ్ గమ్ వల్ల కలిగే దుష్పభ్రావాలపై పరిశోధనలు చేశారు. చూయింగ్ గమ్‌లు, మేయోన్నైస్ (గుడ్డు, వెనిగర్‌తో తయారు చేసే క్రీములు)లను నిత్యం తీసుకోవడం వల్ల కొలన్ క్యాన్సర్ (పేగులకు వచ్చే క్యాన్సర్) వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. ఎలుకలపై పరిశోధనలు చేసిన తరువాత శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు వచ్చారు. చూయింగ్ గమ్‌లో ‘ఈ171’ (టైటానియమ్ డైఆక్సైడ్ నానోపార్టికల్స్) అనే పదార్థం ఉంటుంది. చూయింగ్ గమ్ తరచూ తినడం వల్ల వీటి నుంచి విడుదలయ్యే బ్యాక్టీరియా మన పేగుల్లోకి చేరుతుంది. క్రమంగా అది పేగులకు హాని చేస్తూ క్యాన్సర్‌గా మారుతుందని పరిశోధనలో గుర్తించారు. ఆహారం, మందులు.. తెలుపు రంగులో ఉండేందుకు ‘ఈ171’ పదార్థాన్ని ఉపయోగిస్తుంటారు. అందుకే ‘ఈ171’ వాడే పదార్థాలకు దూరంగా ఉండడమే మేలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. -
మొబైల్ ఫోన్లతో ఆ ముప్పులేదు!
మెల్ బోర్న్: మొబైల్ ఫోన్స్ వాడితే చాలా రకాల సమస్యలు ఎదురవుతాయని యూజర్లు భావిస్తుంటారు. అయితే ఈ విషయంపై ఆస్ట్రేలియాకు చెందిన సిడ్నీ శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేసి వాటి ఫలితాలను వెల్లడించారు. మొబైల్ ఫోన్లు వాడకానికి బ్రెయిన్ క్యాన్సర్ కు అసలు సంబంధమే లేదని తేల్చేశారు. ఫోన్లు వాడకం వల్లే బ్రెయిన్ క్యాన్సర్ రావడం లాంటివి జరగవని తెలిపారు. 20 వేల మంది పురుషులు, 14వేల మంది స్త్రీలను సంప్రదించి కొన్ని ప్రశ్నలు వేసి ఈ విషయాలను నిర్ధారించుకున్నారు. 1982-2012 మధ్య బ్రెయిన్ క్యాన్సర్ బారిన పడ్డ ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తుల వివరాలు, 1987-2012 మధ్య కాలంలో మొబైల్ ఫోన్లు వాడుతున్న వారి డేటాను సిడ్నీ రీసెర్చర్స్ సేకరించారు. ఈ డేటాను పరిశీలించగా ఫోన్ల వాడకం వల్ల బ్రెయిన్ క్యాన్సర్ పెరుగుతుందన్న సూచనలు తమకు కనిపించలేదని రీసెర్చ్ బృందం వెల్లడించింది. 60,70 ఏళ్ల వయసున్న వారిలో మాత్రమే బ్రెయిన్ క్యాన్సర్ లక్షణాలు కనిపించాయట. మొబైల్ ఫోన్ల వాడకం వల్ల చాలా తక్కువ శక్తి విడుదలవుతుందని దానివల్ల మనకు జరిగే నష్టమేంలేదని తాజా సర్వేలో వెల్లడైంది. -
సినిమాలే కాదు...రాజకీయాలు కూడా ముఖ్యమే!
యువత ‘ప్రాధాన్యత జాబితా’లో రాజకీయ వార్తలకు తక్కువ ప్రాధాన్యత ఉంటుంది.ఆరోజు విడుదలైన సినిమా గురించి, ఆరోజు చూసిన క్రికెట్ మ్యాచ్ గురించి... రకరకాల కోణాల్లో విశ్లేషించే యువత మిగిలిన విషయాల్లో మాత్రం అంటీ ముట్టనట్లుగా ఉండేది. వినోదానికి, క్రికెట్టుకు ఇచ్చే ప్రాధాన్యతతో పోల్చితే...రాజకీయ, సామాజిక విశ్లేషణకు యువత ఇచ్చే ప్రాధాన్యత తక్కువ. అయితే సోషల్ మీడియా విస్తృతమయ్యాక పరిస్థితిలో చాలా మార్పు వచ్చిందని తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 16-29 మధ్య వయసు ఉన్న యువతీ యువకులను ఈ అధ్యయనం కోసం ఎంచుకున్నారు. దినపత్రికలు, టీవీల కంటే ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా సమకాలీన రాజకీయ పరిణామాలు, దేశస్థితిగతులు, ముఖ్యమైన సంఘటనలను గురించి తెలుసుకోగలిగామని ఆస్ట్రేలియా యువతలో 65 శాతం చెబుతోంది. ‘యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ’కి చెందిన అధ్యాపక బృందం ఈ అధ్యయనాన్ని చేపట్టింది. కామెంటింగ్, పోస్ట్‌లను షేరింగ్ చేయడం ద్వారా సమకాలీన రాజకీయాలపై తమ ఆసక్తిని ప్రదర్శిస్తుంది యువత. ‘‘ఫేస్బుక్ ద్వారా తెలుసుకున్న విషయాల ద్వారా నేటి యువత రాజకీయాలను సీరియస్‌గా తీసుకుంటుంది’’ అన్నారు ‘యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ’ ప్రొఫెసర్ రొయెన్.సోషల్ మీడియా కారణంగా రాజకీయ వార్తల పట్ల ఆసక్తి మాత్రమే కాదు, రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న యువకుల సంఖ్య పెరుగుతుందని అంటున్నారు ఆయన. -
అరబ్ భూమిలో ఆ ఇద్దరు!
ఆ ఇద్దరి శక్తిసామర్థ్యాలను ప్రశంసించడానికి లేదా గుర్తు తెచ్చుకోవడానికి ‘లీడింగ్ గ్లోబల్ థింకర్స్’ జాబితా ఒక కారణం అయితే కావచ్చు గానీ, అది మాత్రమే ప్రమాణం కాదు. విజయపథం వైపు వారి ప్రయాణానికి అది మాత్రమే కొలమానం కాదు. హైఫా, నౌర అనే ఇద్దరు మహిళలు... ఏ అమెరికాలోనో, బ్రిటన్‌లోనో పుట్టి విజయాలు సాధించి ఉంటే పెద్దగా చెప్పుకునే వాళ్లం కాదేమో. కానీ వాళ్లు విజయాలు సాధించింది, మహిళలు విజయాలు సాధించడానికి అంతగా అనుకూలం కాని అరబ్ భూమిలో! అంతర్జాతీయ కీర్తి ముందు హైఫా గురించి. ఆమెకు సినిమాలు అంటే ఇష్టం. సినిమా డెరైక్టర్ కావాలనేది ఆశయం. ఆడపిల్లలు సినిమాలు చూడడమే అనైతికం అని భావించే సౌదీలో... ఒక ఆడపిల్ల సినిమా డెరైక్టర్ కావాలనుకోవడానికి చాలా ధైర్యమే ఉండాలి. అది హైఫాలో ఉంది. ఆమె తండ్రి కవి. బహుశా ఆయన స్వతంత్ర భావాలే కూతురుకీ వచ్చి ఉంటాయి. హైఫా ఎలాంటి నియమ నిబంధనల మధ్యా పెరగలేదు. 2009లో ‘యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ’ లో డెరైక్టింగ్ అండ్ ఫిల్మ్ స్టడీస్‌లో మాస్టర్ డిగ్రీ సాధించించి సినిమా ఎలా తీయాలో తెలుసుకున్నారు హైఫా. అంతేకాదు... ‘వా-జె-ద’ రూపంలో తన దగ్గర కథ కూడా సిద్ధంగా ఉంది. మరి డబ్బులు కావాలి కదా! మధ్యప్రాచ్యంలో ప్రతి కళాసంస్థకు, యూరప్‌లోని ప్రతి ప్రొడక్షన్ కంపెనీకి ఆర్థిక సహాయం కోసం ఈ-మెయిల్స్ పంపారు హైఫా. అనేక ప్రయత్నాల తరువాత, అవమానాల తరువాత ఆమె ప్రయత్నం ఫలించింది. ‘వా-జె-ద’ షూటింగ్ మొదలైంది. షూటింగ్ జరిపే క్రమంలో సహజంగానే ఆమెకు రకరకాల అవాంతరాలు ఎదురయ్యాయి. కొందరైతే తమ ఇంటి పరిసరాల్లో షూటింగ్ చేయడానికి ససేమిరా అన్నారు. ‘‘సౌదీ అరేబియాలో షూటింగ్ చేయడం అనేది చట్టవ్యతిరేకం కాదు. ఎందుకంటే అక్కడ చట్టం అంటూ ఉంటే కదా’’ అంటారు హైఫా వ్యంగ్యంగా. అంతమాత్రాన ఆమె సౌదీ ప్రజలకు వ్యతిరేకం ఏమీ కాదు. ‘‘సౌదీయులకు హస్యచతురత ఎక్కువ. అది ప్రతి మాటలోనూ కనిపిస్తుంది’’ అంటారు ఆమె. ఈ నేపథ్యంలో తనకు వ్యతిరేకంగా వచ్చిన ట్వీట్లను కూడా గుర్తుకు తెచ్చుకొని అందులోని చమత్కారానికి నవ్వుకుంటారు హైఫా. సౌదీ అరేబియాలో పూర్తిగా చిత్రీకరణ జరుపుకున్న తొలి చిత్రం ‘వా-జె-ద’. సైకిల్ తొక్కడానికి అనుమతి లేని దేశంలో ఒక బాలిక సైకిల్ కొనడానికి పడిన పాట్లు ఈ సినిమాలో గొప్పగా చూపారు. ‘వా-జె-ద’ ఆస్కార్‌కు కూడా నామినేట్ అయింది. ఇప్పుడు సౌదీలో ఆమె భావాలకు నిశ్శబ్దంగా మద్దతు లభిస్తోంది. చిత్రానికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు వచ్చింది. సౌదీ తొలి మహిళా డెరైక్టర్ హైఫా గ్లోబల్ థింకర్‌గా నిలిచారు. ఇప్పుడు ఆ దేశంలో మరెందరో హైఫాలు తయారుకావడానికి ఒక కొత్త దారి ఏర్పడింది. కళకు పునరుజ్జీవనం ఇక నౌరా గురించి. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యు.ఎ.ఇ.)లో సృజనాత్మక రంగాన్నీ, వేదికలను ఒంటి చేత్తో నిలిపిన ఘనత ఆమెది. యు.ఎ.ఇ.లో 1980 దశాబ్దారంభం ప్రాంతీయ నాటకాలకు బంగారు కాలం. కానీ... కాలం గడుస్తున్న కొద్దీ అక్కడ నాటకం కొడిగట్టింది. రీజనల్ డ్రామా మార్కెట్టుకు గడ్డుకాలం దాపురించింది. ఈ క్రమంలో... ‘ఎందుకిలా జరిగింది’ అనే ప్రశ్న నౌరాను తరచు వేధించసాగేది. లండన్ బిజినెస్ స్కూలులో చదువుకున్న నౌరా యు.ఎ.ఇ. గవర్నమెంట్ గ్యాస్ కంపెనీ ‘డాల్ఫిన్ ఎనర్జీ’లో మేనెజ్మెంట్ విభాగంలో చేరారు. ఉన్నత ఉద్యోగం... కానీ, ఎక్కడో అసంతృప్తి. తనకు ఇష్టమైన అభిరుచులు... ఫొటోగ్రఫీ, పుస్తకాలు, రచన... ఆమెను ఒక దగ్గర నిలవనివ్వలేదు. 2007లో రెండువందల పేజీల ఒక డాక్యుమెంట్‌ను చదవడం ద్వారా ఆమె అసంతృప్తికి పరిష్కారం దొరికింది. అది ‘టూఫోర్54’ అనే ఫ్రీ మీడియా సంస్థకు సంబంధించిన డాక్యుమెంట్. ఆ సంస్థ తొలి సీఇవోగా ఎంపిక కావడం ద్వారా తన కోరికను నెరవేర్చుకున్నారు నౌరా. ‘టుఫోర్54’ అనేది టెలివిజన్, రేడియో, ఫిల్మ్, పబ్లిషింగ్, ఆన్లైన్, మ్యూజిక్, గేమింగ్, యానిమేషన్ విభాగాల అభివృద్ధికి పని చేసే ప్రభుత్వ సంస్థ. అది వర్క్‌షాపులు నడపడమే కాకుండా అవసరమైన చోట సబ్సిడీలు కూడా ఇస్తుంటుంది. ‘‘ఒక అరుదైన ప్రాజెక్ట్‌కు ఆడపిల్ల సిఇవో కావడం ఏమిటి? ఆ పోస్ట్‌కు మగవాళ్లు మాత్రమే సరిపోతారు. అబ్బాయిల మాదిరిగా అమ్మాయిలు దూసుకోపోలేరు’’ అనుకుంది అక్కడి పురుషాధిక్యసమాజం. అయినా చాలా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోయింది నౌరా. అయిదేళ్లలో ఆ దేశంలో ‘క్రియేటివ్ బిజినెస్’ను కొత్తపుంతలు తొక్కించింది. ‘టుఫోర్54’ పక్కా బిజినెస్‌లాగే అనిపించినా దానిలో కళాపునరుజ్జీవం ఉంది. ‘సృజనాత్మక వ్యక్తీకరణ లేకుండా యు.ఎ.ఇ. ఎప్పటికీ సుసంపన్నమైన సాంస్కృతిక వికాసానికి చేరుకోదు’ అనే వాస్తవాన్ని నమ్ముతుందామె. ఆ నమ్మకానికి నౌరా ఆధ్వర్యంలోని ‘టుఫోర్54’ ఒక నిదర్శనంలా నిలుస్తోంది.