ఏఎన్‌యూను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యం
ఏఎన్‌యూ: నవ్యాంధ్రప్రదేశ్‌లో విద్య, పరిశోధన, శాస్త్ర సాంకేతిక, మౌలిక వసతుల అంశాల్లో నాగార్జున యూనివర్సిటీని అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా తన పరిధిలో కృషి చేస్తానని ఇన్చార్జి వీసీ కేఆర్ఎస్ సాంబశివరావు (కొత్తపల్లి రాజ సూర్య సాంబశివరావు) అన్నారు. ఏఎన్‌యూ ఇన్చార్జి వీసీగా నియమితులైన సాంబశివరావు సోమవారం ఉదయం అధికారికంగా బాధ్యతలు స్వీకరిం చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ విద్య, శాస్త్ర రంగాల్లో యూనివర్సిటీని సమర్ధంగా తీర్చిదిద్దుతానన్నారు.
యూనివర్సిటీ వ్యవస్థలో జాతీయ స్థాయిలో కీలకమైన నాక్‌లో ఏఎన్‌యూకి ఏ గ్రేడ్ తేచ్చేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. నాక్ పనుల పర్యవే క్షణ బాధ్యతలను ఓఎస్డీ ఆచార్య ఏవీ దత్తాత్రేయరావుకు అప్పగిస్తామని తెలిపారు. ఏఎన్‌యూను సెంట్రల్ యూనివర్సిటీగా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తామన్నారు. యూనివర్సిటీలోని అభివృద్ధి పనుల ప్రతిపాదన, పర్యవే క్షణకు నలుగురు సీనియర్ అధ్యాపకులతో మానిటరింగ్ అండ్ డెవలప్మెంట్ కమిటీని కొద్ది రోజుల్లో ఏర్పాటు చేస్తానని తెలిపారు.
వీసీతో సహా అధికారులు, సిబ్బంది విధుల హాజరులో పారదర్శకత కోసం యూనివర్సిటీలోని కార్యాలయాలు, విభాగాల్లో 28 చోట్ల బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశపెడుతున్నామని తెలిపా రు. జాతీయ స్థాయిలో వివిధ సంస్థల నుంచి ప్రాజెక్టులు సొంతం చేసుకునే విధంగా విభాగాలను సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణను ఇప్పటికే రూపొందించానన్నారు. విలేకరుల సమావేశంలో రిజిస్ట్రార్ రాజశేఖర్ పాల్గొన్నారు.
పరీక్షా భవన్ అధికారులతో సమావేశం
విద్యార్థులకు మెరుగైన సేవలు అందించే అంశాలపై చర్చించేందుకు సోమవారం మధ్యాహ్నం పరీక్షా భవన్ అధికారులతో ఇన్చార్జి వీసీ కేఆర్ఎస్ సాంబశివరావు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల, విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ, విద్యార్థులకు అందించే సేవలపై పలు సూచనలు చేశారు. సమావేశంలో రిజిస్ట్రార్ పి.రాజశేఖర్, పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.