అశ్వగంధతో మేలైన నిద్ర!
టోక్యో: నిద్రలేమితో బాధపడుతున్నారా? అయితే అశ్వగంధ ఉపయోగించండి అంటున్నారు శాస్త్రవేత్తలు. అశ్వగంధ ఆకులలో నిద్రకు ఉపకరించే లక్షణాలు ఉన్నట్లు వారు చెబుతున్నారు. అశ్వగంధలోని వివిధ మూలకాలు నిద్రపై ఏవిధంగా ప్రభావం చూపుతాయనే విషయంపై జపాన్లోని యూనివర్సిటీ ఆఫ్ త్సుకుబాకు చెందిన శాస్త్రవేత్తలు ఎలుకలపై పరిశోధన నిర్వహించారు. అశ్వగంధ ఆకుల నుంచి సంగ్రహించిన నీటిలో ట్రైఎథిలీన్ గ్లైకోల్(టీఈజీ) అధికంగా ఉంటుందని, ఇది సాధారణ నిద్రకు ఉపకరిస్తుందని వారు తెలిపారు.
ఇన్సోమ్నియా, నిద్ర సంబంధిత రుగ్మతలకు చికిత్స అందించడంలో ఈ పరిశోధనలు ఎంతో సహాయపడతాయని త్సుకుబా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు మహేశ్ కె.కౌశిక్ తెలిపారు. భారత్లోని సంప్రదాయ వైద్య విధానమైన ఆయుర్వేదలో అశ్వగంధను ఉపయోగిస్తారు. దీని లాటిన్ పదం సోమ్నిఫెరా (నిద్రను కలిగించేది అని అర్థం). అశ్వగంధ నిద్రకు మేలు చేస్తుందని శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నప్పటికీ, అందులో నిద్రకు ఉపకరించే లక్షణాలున్న మూలకం ఏమిటో ఇప్పటికీ తెలియలేదని పరిశోధకులు తెలిపారు.