unorganised sector
-
నోట్ల రద్దు ‘అసంఘటితం’పై శరాఘాతం
న్యూఢిల్లీ: నోట్ల రద్దు భారత అసంఘటిత రంగంపై దాడి అని, దీనిపై సమైక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశంలోని పేద ప్రజలు, రైతాంగం, అసంఘటిత రంగకార్మికులపై, చిన్నాచితకా దుకాణదారులపై తీవ్రమైన దాడి అని ఆరోపించారు. సామాజిక మాధ్యమాల్లో రాహుల్ వెలువరిస్తోన్న వీడియో సిరీస్ ద్వితీయ భాగంలో ఆయన భారత ఆర్థిక వ్యవస్థపై మాట్లాడారు. ప్రధాని మోదీ దేశాన్ని నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా మార్చాలని భావిస్తున్నారని, కానీ పేదలు, రైతులు, కార్మికులు చిన్న వ్యాపారులు, అసంఘటితరంగ కార్మికులంతా నగదుపైనే ఆధారపడి ఉన్నారని రాహుల్ వ్యాఖ్యానించారు. మోదీ చెప్పినట్టు నోట్ల రద్దు కారణంగా నల్లధనం బయటకు రాలేదనీ, పేదప్రజలు లబ్ధిపొందిందీ లేదని, దీనివల్ల సంపన్నులకే మేలు జరిగిందని రాహుల్ అన్నారు. -
కోవిడ్ -19 విధ్వంసం : పేదరికం గుప్పిట్లోకి 40 కోట్ల మంది
ఐక్యరాజ్యసమితి : కరోనా మహమ్మారి విధ్వంసంతో భారత్‌లోని అసంఘటిత రంగంలో పనిచేసే 40 కోట్ల మంది తీవ్ర పేదరికంలోకి జారుకుంటారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ఈ మహమ్మారి ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా 19.5 కోట్ల ఉద్యోగాలు కనుమరుగవుతాయని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) అంచనా వేసింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కరోనావైరస్ మహమ్మారి అతిపెద్ద అంతర్జాతీయ సంక్షోభమని ఐఎల్ఓ-మానిటర్ రెండో ఎడిషన్ : కోవిడ్-19 పేరిట విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో వ్యాపారాలు, కార్మికులపై కరోనా మహమ్మారి పెను ప్రభావం చూపుతుందని తెలిపింది. ఈ మహమ్మారి ప్రభావాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు మనం వేగంగా, నిర్ణయాత్మకంగా ముందుకు సాగాలని పిలుపు ఇచ్చింది. సరైన సమయంలో సరైన తక్షణ చర్యలు చేపడితేనే వ్యవస్థ కుప్పకూలకుండా కాపాడుకోగలుగుతామని ఐఎల్ఓ డైరెక్టర్ జనరల్ గై రైడర్ అన్నారు. ప్రపంచవ్యాపంగా 200 కోట్ల మంది ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారని, వీరంతా కోవిడ్-19 విసిరిన సవాళ్లతో ముప్పును ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్, నైజీరియా, బ్రెజిల్ సహా పలు దేశాల్లోని అసంఘటిత రంగంలో పనిచేస్తున్న లక్షలాది సిబ్బంది, కార్మికులు లాక్డౌన్ ఇతర నియంత్రణలతో ప్రతికూల పరిస్థితి ఎదుర్కొంటున్నారని ఐఎల్ఓ వెల్లడించింది. చదవండి : మోదీ చాలా గొప్పవారు.. మంచివారు: ట్రంప్ భారత్‌లో అసంఘటిత రంగంలో పనిచేసే దాదాపు 40 కోట్ల మంది పేదరికంలో కూరుకుపోయే ముప్పు నెలకొందని ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌లో చేపట్టిన లాక్డౌన్ చర్యలతో భారత్‌లో పెద్దసంఖ్యలో అసంఘటిత రంగ కార్మికులు గ్రామీణ ప్రాంతాల్లోని తమ స్వస్ధలాలకు వెనుతిరిగారని పేర్కొంది. అంతర్జాతీయ సహకారానికి గడిచిన 75 ఏళ్లలో ఇదే అతిపెద్ద పరీక్షగా ముందుకొచ్చిందని, ఏ ఒక్క దేశం కుప్పకూలినా ఇతర దేశాలపైనా దాని ప్రభావం ఉంటుందని హెచ్చరించింది. సరైన చర్యలతో కోవిడ్-19 పెను ప్రభావాన్ని పరిమితం చేయవచ్చని తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా పనిగంటలు, రాబడులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. -
కరోనాపై వార్ : అసంఘటిత రంగానికి భరోసా..
సాక్షి, న్యూఢిల్లీ : మహమ్మారి కరోనా వైరస్ ప్రబలుతున్న క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన మూడు వారాల లాక్‌డౌన్‌తో అసంఘటిత రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పనుల్లేక పస్తులుండాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్న వ్యవసాయ కూలీలు, కార్మికులు, ఫ్యాక్టరీ కార్మికులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయి. వ్యవసాయ కూలీలు, వలస కార్మికులు, ఫ్యాక్టరీ వర్కర్లు, అసంఘటిత రంగ కార్మికుల భారీ వలసలను అడ్డుకోవాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు సూచించింది. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన కార్మికులకు ఉచితంగా ఆహారం అందేలా చూడాలని కోరింది. హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్, అద్దె వసతి గృహాలకు నిత్యావసరాలు అందేలా చూడాలని సూచించింది. విద్యార్థులు, వర్కింగ్ వుమెన్‌కి నిత్యావసరాలు నిరాటంకంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర హోంశాఖ కోరింది. చదవండి : వారికోసం ఐటీసీ రూ. 150 కోట్ల ఫండ్ -
పింఛను పథకం ప్రచారాస్త్రమే!
సాక్షి, న్యూఢిల్లీ : అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల ప్రయోజనం కోసం కేంద్ర మంత్రి పియూష్ గోయల్ గురువారం పార్లమెంట్‌కు సమర్పించిన బడ్జెట్లో కొత్త పింఛను పథకాన్ని ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ పథకం కింద కార్మికులకు 60 ఏళ్ల నుంచి నెలకు మూడువేల రూపాయల చొప్పున పింఛను లభిస్తుంది. అందుకోసం 29 ఏళ్లు నిండిన కార్మికుడు నెలకు వంద రూపాయల చొప్పున, 18 ఏళ్లు నిండిన కార్మికుడయితే నెలకు 55 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుందని, దీనివల్ల పది కోట్ల మంది కార్మికులు ప్రయోజనం పొందుతారని పియూష్ గోయల్ తెలిపారు. పింఛను కోసం కనీసంగా ఎంతకాలం పాటు కార్మికుడు తనవంతు భాగాన్ని చెల్లిస్తూ పోవాలనే కాల పరిమితి ఈ పథకంలో ఎక్కడా లేకపోవడం ప్రధాన లోపంగా కనిపిస్తోంది. ఇది కొత్త పథకంగా మోదీ ప్రభుత్వం పేర్కొంటున్నప్పటికీ 2015, మార్చిలో ప్రవేశ పెట్టిన ‘అటల్ పెన్షన్ యోజన’ పథకానికి మరో రూపమని తెలుస్తోంది. అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం ప్రవేశపెట్టిన అటల్ పెన్షన్ పథకంలో నెలవారి పింఛన్‌ను కనీసంగా వెయ్యి రూపాయలు, గరిష్టంగా ఐదువేల రూపాయలుగా నిర్ణయించారు. పింఛను సొమ్ము ప్రాతిపదికన పింఛను పథకానికి లబ్దిదారుడు నెలవారిగా ఎంత చెల్లిస్తాడో అందులో యాభై శాతాన్ని కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. అలా కార్మికుడి పేరిట వెయ్యి రూపాయలు జమయ్యే వరకు ప్రభుత్వం తన వాటాను చెల్లించాల్సి ఉంటుంది. 2017, ఫిబ్రవరి నెల నాటికి ఈ అటల్ పెన్షన్ పథకం కింద లబ్దిదారులుగా నమోదయినది 42.8 లక్షల మంది కార్మికులు మాత్రమే. వీరిలో 48 శాతం మంది కనిష్ట పింఛను వెయ్యి రూపాయలను ఎంపిక చేసుకున్నట్లు ‘పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ’ తెలియజేసింది. ఈ పథకానికి మోదీ ప్రభుత్వం కూడా పెద్దగా ప్రచారం కల్పించలేదు. ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త పథకంలో అటల్ పథకాన్ని విలీనం చేస్తారా ? లేదా రెండింటిని కొనసాగిస్తారా? అన్న విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేదు. ఈ పథకం కోసం 500 కోట్ల రూపాయలను కార్మికులు తమ వంతు వాటా చెల్లించే పింఛను పథకాలు యూరప్ దేశాల్లో విజయవంతం అయ్యాయిగానీ భారత్ లాంటి ఏ వర్ధమాన దేశాల్లో విజయవంతం కాలేదు. అందుకు కారణం దేశంలో కార్మికులకు చాలీ చాలని జీతాలు లభించడమే. ఎప్పుడో వచ్చే పింఛను కోసం, అసలు అప్పటికి బతికి ఉంటామో, లేదో అన్న సంశయంతో నెలకు వంద రూపాయలను చెల్లించలేని మనస్థత్వం కలిగిన వాళ్లు, ఆర్థిక స్థోమత లేనివాళ్లు భారత కార్మిక రంగంలో ఎక్కువ మంది. నెలకు 15 వేల రూపాయల లోపు జీతం అందుకునే కార్మికులకు మాత్రమే ఈ పింఛను పథకం వర్తించడం ఇక్కడ గమనార్హం. 60 ఏళ్ల వయస్సులో వచ్చే మూడు వేల రూపాయలు నెలవారి పన్ల పొడికి కూడా సరిపోకపోవచ్చు. అలాంటప్పుడు ఈ పథకం వల్ల పది కోట్ల మంది కార్మికులకు ప్రయోజనం కలుగుతుందని ఎలా లెక్కలు వేశారో కేంద్రానికే తెలియాలి. అయినా ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన పథకానికి ప్రచారం కావాలిగానీ ప్రయోజనం సంగతి ప్రభుత్వానికి ఎందుకు? -
‘రెండు రోటీలతో సరిపెట్టుకుంటున్నాం’
సాక్షి, ముంబయి : అసంఘటిత రంగంలో పెరుగుతున్న నిరుద్యోగం మహానగరాల్లో పెనుసవాళ్లు విసురుతోంది. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో ఆర్థిక రాజధాని ముంబయి చేరుకునే పేద కార్మికులకు ఇప్పుడు చేతినిండా పనికరువైంది. వీధిచివర పనుల కోసం కళ్లుకాయలు కాచేలా ఎదురుచూసినా ఏ కొద్దిమందికో పని లభిస్తుండగా, మిగిలిన వారంతా నిరాశతో వెనుతిరగాల్సిన పరిస్థితి నెలకొందని కార్మికులు, చిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో అత్యంత రద్దీ ప్రదేశం అంధేరిలో పనుల కోసం కార్మికులు నానా పాట్లు పడుతున్నారు. మహారాష్ట్రలోని నాంధేడ్ నుంచి పాతికేళ్ల కిందట నగరానికి వచ్చిన కాంబ్లే అక్కడి పరిస్థితిని కళ్లకు కడుతూ నిరుద్యోగం ఏ స్ధాయిలో ఉందో చెప్పుకొచ్చాడు. ‘యూపీ, బీహార్, బెంగాల్ నుంచి పెద్దసంఖ్యలో జనం నగరానికి వచ్చారు..వాళ్లు తక్కువ మొత్తానికే పనిచేసేందుకు సిద్ధమవుతుండటంతో మా ఉద్యోగాలు పోతున్నా’యని వాపోయాడు. పనుల్లేక పస్తులు ఖర్ రైల్వే స్టేషన్ వెలుపల పనుల కోసం వేచిచూసే మహిళా కార్మికులు తమ కష్టాలను ఏకరువు పెట్టారు. తనకు ఒక బిడ్డే ఉన్నా తనకు కనీసం దుస్తులు కూడా కొనే పరిస్థితి లేదని నిర్మాణ రంగంలో కూలీగా పనిచేసే సత్తార్ షేక్ అనే మహిళ వాపోయారు. పనుల్లేక పస్తులుండే పరిస్థితి నెలకొందని అన్నారు. పెరుగుతున్న ధరలకు తనకొచ్చే డబ్బుతో ఆహారం తీసుకోలేకపోతున్నానని, బరువులు ఎత్తేపనికావడంతో అనారోగ్యానికి గురయ్యాయనన్నారు. వైద్యుల వద్దకు వెళ్లాలన్నా ఒక రోజుమ పని పోతుందేమోననే ఆందోళనతో నెట్టుకొస్తున్నానన్నారు. రెండే చపాతీలు.. ఇక యూపీలోని బలియా నుంచి ముంబయి వలస వచ్చిన మరో కార్మికుడు రాఘవేంద్ర గుప్తా తన కుమారుడిని స్కూల్‌కు పంపేందుకు ఆహారాన్నీ త్యాగం చేయడం విస్తుగొలుపుతుంది. గతంలో తాను ఆహారంలో ప్రతిసారీ నాలుగు చపాతీలు తీసుకునేవాడినని, ఇప్పుడు రెండే చపాతీలతో సర్ధుకుంటున్నానని చెప్పారు. గత ఏడాది నుంచి నెలలో కనీసం పదిరోజులు కూడా పనిదొరక్క పాట్లు పడుతున్నానని గుప్తా చెప్పుకొచ్చారు. తాను చేసే పనికి రోజువారీ వేతనం రూ 500 కాగా, తాను విపరీతమైన ఆకలితో ఉన్నప్పుడు రూ 200కూ పనిచేసేందుకు సిద్ధమేనని చెప్పారు. అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు, చిరుద్యోగుల సంక్షేమాన్ని రాజకీయ నేతలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. -
కార్మికులు బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు శిబిరాలు: కేంద్రం
న్యూఢిల్లీ: వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించినట్లు కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. బ్యాంకు ఖాతాలు లేని వారికోసం నవంబర్ 26న దీన్ని మొదలుపెట్టామని మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. కార్మికులందరికీ బ్యాంకింగ్ సౌకర్యాలు కల్పించడం, వేతనాలు వాటిలో జమయ్యేలా చూసి నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్ల సమన్వయంతో కార్మిక శాఖ తన విభాగాలైన ఈఎస్ఐసీ, ఈపీఎఫ్ఓ, కార్మిక కార్యాలయాల ద్వారా జిల్లా స్థాయిల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తుంది.