సాక్షి, ముంబయి : అసంఘటిత రంగంలో పెరుగుతున్న నిరుద్యోగం మహానగరాల్లో పెనుసవాళ్లు విసురుతోంది. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో ఆర్థిక రాజధాని ముంబయి చేరుకునే పేద కార్మికులకు ఇప్పుడు చేతినిండా పనికరువైంది. వీధిచివర పనుల కోసం కళ్లుకాయలు కాచేలా ఎదురుచూసినా ఏ కొద్దిమందికో పని లభిస్తుండగా, మిగిలిన వారంతా నిరాశతో వెనుతిరగాల్సిన పరిస్థితి నెలకొందని కార్మికులు, చిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో అత్యంత రద్దీ ప్రదేశం అంధేరిలో పనుల కోసం కార్మికులు నానా పాట్లు పడుతున్నారు. మహారాష్ట్రలోని నాంధేడ్ నుంచి పాతికేళ్ల కిందట నగరానికి వచ్చిన కాంబ్లే అక్కడి పరిస్థితిని కళ్లకు కడుతూ నిరుద్యోగం ఏ స్ధాయిలో ఉందో చెప్పుకొచ్చాడు. ‘యూపీ, బీహార్, బెంగాల్ నుంచి పెద్దసంఖ్యలో జనం నగరానికి వచ్చారు..వాళ్లు తక్కువ మొత్తానికే పనిచేసేందుకు సిద్ధమవుతుండటంతో మా ఉద్యోగాలు పోతున్నా’యని వాపోయాడు.
పనుల్లేక పస్తులు
ఖర్ రైల్వే స్టేషన్ వెలుపల పనుల కోసం వేచిచూసే మహిళా కార్మికులు తమ కష్టాలను ఏకరువు పెట్టారు. తనకు ఒక బిడ్డే ఉన్నా తనకు కనీసం దుస్తులు కూడా కొనే పరిస్థితి లేదని నిర్మాణ రంగంలో కూలీగా పనిచేసే సత్తార్ షేక్ అనే మహిళ వాపోయారు. పనుల్లేక పస్తులుండే పరిస్థితి నెలకొందని అన్నారు. పెరుగుతున్న ధరలకు తనకొచ్చే డబ్బుతో ఆహారం తీసుకోలేకపోతున్నానని, బరువులు ఎత్తేపనికావడంతో అనారోగ్యానికి గురయ్యాయనన్నారు. వైద్యుల వద్దకు వెళ్లాలన్నా ఒక రోజుమ పని పోతుందేమోననే ఆందోళనతో నెట్టుకొస్తున్నానన్నారు.
రెండే చపాతీలు..
ఇక యూపీలోని బలియా నుంచి ముంబయి వలస వచ్చిన మరో కార్మికుడు రాఘవేంద్ర గుప్తా తన కుమారుడిని స్కూల్‌కు పంపేందుకు ఆహారాన్నీ త్యాగం చేయడం విస్తుగొలుపుతుంది. గతంలో తాను ఆహారంలో ప్రతిసారీ నాలుగు చపాతీలు తీసుకునేవాడినని, ఇప్పుడు రెండే చపాతీలతో సర్ధుకుంటున్నానని చెప్పారు. గత ఏడాది నుంచి నెలలో కనీసం పదిరోజులు కూడా పనిదొరక్క పాట్లు పడుతున్నానని గుప్తా చెప్పుకొచ్చారు. తాను చేసే పనికి రోజువారీ వేతనం రూ 500 కాగా, తాను విపరీతమైన ఆకలితో ఉన్నప్పుడు రూ 200కూ పనిచేసేందుకు సిద్ధమేనని చెప్పారు. అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు, చిరుద్యోగుల సంక్షేమాన్ని రాజకీయ నేతలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment