3 రెట్లు పెరిగిన హెరిటేజ్ నికరలాభం
* క్యూ2లో రూ.5 కోట్ల నుంచి 15 కోట్లకు చేరిన లాభం
* ఒక్క డెయిరీ విభాగంలోనే లాభం 14 కోట్ల నుంచి 34 కోట్లకు
* అనూహ్య ఫలితాలతో ఒక్కరోజే 13 శాతం పెరిగిన షేరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గడిచిన మూడు త్రైమాసికాలూ వరుసగా హెరిటేజ్ ఫుడ్స్ లాభాలు భారీగా పెరుగుతూనే వస్తున్నాయి. 2014వ సంవత్సరం సెప్టెం బర్తో ముగిసిన త్రైమాసికానికి రూ.512 కోట్ల ఆదాయంపై రూ.5 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిన కంపెనీ... ఈ ఏడాది అదే కాలంలో రూ.586 కోట్ల ఆదాయంపై ఏకంగా రూ.15 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
అంటే రెండో త్రైమాసికంలో కంపెనీ నికరలాభం ఏకంగా 200 శాతం పెరిగినట్లు లెక్క. గడిచిన ఆరు నెలల్లో పాల మార్కెట్లో పోటీ విపరీతంగా పెరిగింది. కర్ణాటక కు చెందిన నందిని, గుజరాత్‌కు చెందిన అమూల్ బ్రాండ్లు కూడా ప్రవేశించటంతో పాల ధరలు కూడా తగ్గాయి. పోటీ కారణంగా హెరిటేజ్ ఫుడ్స్ కూడా తన పాల ధరలు తగ్గించినా... లాభాలు మాత్రం గణనీయంగా పెరగటం విశేషమే. 2015 జులై-సెప్టెంబరు త్రైమాసికంలో ఒక్క డెయిరీ విభాగాన్నే తీసుకుంటే... లాభాలు (పన్నులు, వడ్డీలు చెల్లించక ముందు) రూ.14 కోట్ల నుంచి రూ. 34 కోట్లకు పెరగడం మార్కెట్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేసింది.
డెయిరీ ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం రూ. 383 కోట్ల నుంచి రూ. 442 కోట్లకు పెరిగింది. ఈ త్రైమాసికంలో రిటైల్ విభాగం నష్టాలు రూ.6 కోట్లకు పెరిగితే... అగ్రి, బేకరి విభాగాల్లో కోటి రూపాయల వరకు నష్టాలు వచ్చాయి. అనూహ్యమైన ఫలితాలను ప్రకటించడంతో సోమవారం హెరిటేజ్ ఫుడ్స్ షేరు ఏకంగా 13 % పెరిగి రూ.456 వద్ద ముగిసింది.