తహసీల్దార్ కనుసన్నల్లో భూపందేరం
వినుకొండ: ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బొల్లాపల్లి తహసీల్దార్ మండలంలోని పలు గ్రామాల్లో 500 ఎకరాల ప్రభుత్వ భూములను అనర్హులకు ధారాదత్తం చేశారని ఎంపీపీ పట్రా కోటేశ్వరరావు ఆరోపించారు. పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బొల్లా బ్రహ్మనాయుడు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మండలంలోని అయ్యన్నపాలెం, బొల్లాపల్లి, పెరూరుపాడు, మేళ్లవాగు, గుమ్మనంపాడు, రేమిడిచర్లతో పాటు పలు గ్రామాల్లో అసైన్డ్ భూములను అక్రమంగా అన్యులకు కట్టబెట్టడం తహశీల్దారు అక్రమాలకు నిదర్శనమన్నారు.
అయ్యన్నపాలెంలో 374ఏ, 374బీ సర్వేనంబర్లలోని అటవీ భూమికి ఇద్దరికి పాసు పుస్తకాలు సైతం మంజూరు చేశారన్నారు. దొమ్మర్లగొంది ప్రాజెక్ట్‌కు కేటాయించిన భూమి, బొల్లాపల్లి, పేరూరుపాడు సొసైటీ భూములను కూడా వదలలేదన్నారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీలకు చెందిన భూములకు వారికి తెలియకుండానే ఇతరులకు పాస్ పుస్తకాలు మంజూరు చేశారన్నారు. గుమ్మనంపాడు అగ్రహారం భూపందేరంలో తహసీల్దారుదే కీలకపాత్ర అన్నారు.
పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. తహశీల్దార్ అక్రమాలను ఆర్డీవో, కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చేస్తామన్నారు. సొసైటీ అధ్యక్షుడు గోవింద్ నాయక్, పార్టీ మండల కన్వీనర్ బత్తి గురవయ్య, జెడ్పీటీసీ కిన్నెర సంతోషమ్మ దేవయ్య, తిప్పిశెట్టి కోటేశ్వరరావు, వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.