మెస్సీ.. 'ఫోర్త్ టైం లక్కీ'..!
బ్యూనస్ ఎయిర్స్: కోపా అమెరికా ఫుట్‌బాల్ ఫైనల్ మ్యాచ్‌లో చిలీతో ఓటమి అనంతరం 'దేశం తరపున నా చివరి మ్యాచ్ ఆడేశాను' అంటూ మెస్సీ చేసిన ప్రకటనను అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్రేమికులు జీర్ణించుకోలేకపోతున్నారు. బుధవారం బ్యూనస్ ఎయిర్స్ నగర మేయర్ మెస్సీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. మెస్సీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాడని భావిస్తున్నానని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
29 ఏళ్ల మెస్సీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని దేశ వ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తున్నాయి. అర్జెంటీనా ప్రెసిడెంట్ మారిసియో మాక్రితో పాటు ఫుట్‌బాల్ దిగ్గజం మారడోనా సైతం మెస్సీ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ఒలంపిక్స్‌లో అర్జెంటీనాకు గోల్డ్ మెడల్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన మెస్సీ.. మూడు ప్రతిష్టాత్మక ఫైనల్స్( 2015, 2016 కోపా అమెరికా, ప్రపంచకప్ 2014)లో మాత్రం జట్టును గట్టెక్కించలేకపోయాడు. రష్యాలో 2018లో జరగనున్న వరల్డ్ కప్‌లో మెస్సీ ఆడాలని అర్జెంటీనాతో పాటు ప్రపంచ ఫుట్‌బాల్ ప్రేమికులు కోరుకుంటున్నారు. దీంతో 'ఫోర్త్ టైం లక్కీ' నినాదంతో మెస్సీని వెనక్కిరావాలని కోరుతున్నారు.