శ్వేతాశ్వతర ఉపనిషత్
జ్యోతిర్మయం
శ్వేతాశ్వతర మహర్షి తన శిష్యులకు బోధించిన ఆధ్యాత్మ విద్య, ఆయన పేరు మీదనే ఉపనిషత్తుగా ప్రచారంలోకి వచ్చింది. కృష్ణ యజుర్వేదానికి చెందిన దీనిలో ఆరు అధ్యాయాలు, 113 మంత్రాలు ఉన్నవి. పరబ్రహ్మతత్వానికి సంబంధించిన ముఖ్యమైన ఎన్నో విషయాలను ఇందులో ప్రస్తావించారు. ఏ విషయం చెప్పినా సాధికారికంగానూ, విస్పష్టంగానూ, ఉపమా నాలతో సహా కవితాత్మకంగానూ చెప్పటం ఈ ఉపనిషత్తు ప్రత్యేకత.
ఒకటో అధ్యాయంలో మహర్షి చెబుతాడు, ప్రతి మనిషిలోనూ పరమాత్మ అంతర్భూతమై ఉన్నాడు అని. ఎలాగు అంటే, నువ్వులలో నూనెలాగా, పెరుగులో వెన్నలాగా, భూమి లోపలి నదుల్లో నీళ్లులాగా, కట్టెలో నిప్పులాగా ఉన్నాడట.
రెండో అధ్యాయంలో యోగాన్ని గురించిన ప్రస్తా వన ఉంటుంది. జ్ఞానకర్మ భక్తి రాజయోగాల గురిం చి, ప్రాణాయామం దాని సాధన గురించి వివరంగా చెప్పటం జరిగిం ది. 19.9.1893న వివేకానందుడు చికాగో నగరంలో ప్రసంగిస్తూ బ్రహ్మ సాక్షాత్కారం ప్రతి ఒక్కరి జన్మ హక్కు అని చెబుతాడు. ఆ సందర్భంలోనే శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాః’ అని ఎలుగెత్తి చాటుతాడు. ఆ మంత్రం ఈ అధ్యాయంలోదే.
మూడవ అధ్యాయంలో సగుణ బ్రహ్మ ఉపాసన, నిర్గుణ బ్రహ్మ ఉపాసన, రెండింటిని వివరించారు.. సగుణోపాసన ద్వారా నిర్గుణ బ్రహ్మమును జేరుకోవ చ్చునని ఉపనిషత్తు బోధిస్తుంది. ఈ అధ్యాయంలోనే రుద్రుడు, శివుడు మొదలైన దేవతల పేర్లు కనిపి స్తాయి.
నాల్గవ అధ్యాయంలో పరబ్రహ్మతత్వాన్ని తెలియ జేశారు. పరమ పురుషుణ్ణి సాక్షాత్కరించుకొన్న విధం బహు రమ్యంగా వర్ణిస్తాడు. ఋషి, త్వంస్త్రీ, త్వం పుమా న్, నీవు స్త్రీవి, నీవు పురుషుడవు. నీవు యువకుడవు, యువతివి కూడా. కర్రపుచ్చుకొని తడబడుతూ పోయే ముదుసలివి కూడా నీవే అంటాడు. నీలం పతంగో, నీలవర్ణపు సీతాకోక చిలుక, ఎర్రని కన్నులతో ఉన్న పచ్చని చిలుక మెరుపును దాచుకొన్న మేఘం. ఇవన్నీ ఆ పరమ పురుషుడేనట. ‘ఏష దేవో విశ్వకర్మా’ అనే మంత్రం ఈ అధ్యాయంలోనే వస్తుంది.
ఐదవ అధ్యాయంలో జీవాత్మ లక్షణం వివరించ టం జరిగింది. జీవాత్మ ములుగర్ర మొనలాగా, వెంట్రు క యొక్క నూరవ భాగంలో నూరవ భాగమంత సూ క్ష్మమట. అయినా అది అనంతత్వాన్ని పొందగలదట.
చివరిది ఆరవది అయిన అధ్యాయంలో భగవం తుని మహిమను వివరించారు. విశ్వాన్ని చక్రంతో పోల్చటం ఇందులో కనిపిస్తుంది. భగవంతుని ధ్యానం చేత సాక్షాత్కరించుకోవాలి అనీ, ఒక్కడే అయిన భగ వంతుడు అన్ని జీవుల్లోనూ ఉన్నాడు అనీ ఉపదేశిస్తాడు ఉపనిషత్ కర్త అయిన శ్వేతాశ్వతర మహర్షి. ఇట్లా శ్వే తాశ్వతర ఉపనిషత్తు సర్వ ఉపనిషత్ సారంగా, వివిధ దృక్కోణాల సమన్వయ రూపంగా విలసిల్లుతోంది.
దీవి సుబ్బారావు