బాజాభజంత్రీలకూ ఆన్లైనే!
♦ ఒకే వేదికగా పెళ్లి సర్వీసులందిస్తున్న అప్లీ ఎవర్
♦ డెకరేషన్, క్యాటరింగ్, మేకప్ వంటి సేవలెన్నో..
♦ పెళ్లి దుస్తులు, నగలు, పాదరక్షల కొనుగోలుకు వీలు
♦ ఇటీవలే రూ.2.75 కోట్ల నిధుల సమీకరణ
♦ ‘సాక్షి స్టార్టప్ డైరీ’తో సంస్థ కో-ఫౌండర్ రాకేష్ గుప్తా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ‘పెళ్లి చేసి చూడు.. ఇళ్లు కట్టి చూడు’ అంటారు పెద్దలు. ఇందులో ఇంటి విషయం కాసేపు పక్కన పెడితే పెళ్లి మాత్రం నిజంగా పెద్ద తతంగమే. ఆహ్వాన పత్రికలు ముద్రించటం నుంచి బంధువుల జాబితా, డెకరేషన్, మేకప్, భోజనాలు, బ్యాండ్‌బాజా.. వంటివెన్నో సమకూర్చుకోవాలి. అందుకే పెళ్లంటే నెల రోజుల ముందు నుంచి పనులు మొదలుపెడితే గానీ పెళ్లి నాటికి పూర్తవ్వవు. అయితే మరి ఇంతగా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో కూడా పెళ్లి కోసం నెలల తరబడి సమయం కేటాయించాలా? అన్ని సదుపాయాలనూ ఒకే వేదికపై పొందలేమా? ఇదే ప్రశ్న ఈ మిత్రత్రయానికి ఎదురైంది. అయితే అందరిలా వీళ్లూ అక్కడిలో ఆగిపోలేదు. సమాధానం వెతికే పనిలో వెడ్డింగ్ సర్వీసెస్ స్టార్టప్ ‘అప్లీఎవర్’ను ప్రారంభించేశారు. ఆ కంపెనీ ఏంటో.. దాని సేవలేంటో అప్లీ కో-ఫౌండర్ రాకేశ్ గుప్తా ‘సాక్షి స్టార్టప్ డైరీ’కి వివరించారు. ఆయన మాటల్లోనే...
12 విభాగాల్లో సేవలు..
‘‘నేను, మదన్ ఎల్పీ, సుమిత్ హండా ముగ్గురం కలిసి గతేడాది అక్టోబర్‌లో రూ.20 లక్షలతో హైదరాబాద్ కేంద్రంగా అప్లీఎవర్ను ప్రారంభించాం. ప్రస్తుతం మేం ఫొటోగ్రఫీ, మేకప్, మెహందీ, డీజే, డెకరేషన్, కొరియోగ్రఫీ, క్యాటరింగ్ వంటి 12 రకాల విభాగాల్లో సేవలందిస్తున్నాం. ఆయా విభాగాల్లో సేవలందించేందుకు 800-1,000 మంది వెండర్లు మావద్ద రిజిస్టరయ్యారు. అవసరమున్న సేవలను ఇక్కడి నుంచే బుక్ చేసుకోవచ్చు. ఒక్కో డీల్ మీద రూ.5-15 వేల వరకు మార్జిన్లుంటాయి. ప్రస్తుతం నెలకు 3 వేల వరకుడీల్స్ జరుగుతున్నాయి. ప్రతి నెలా 50-70 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తున్నాం.
లుక్ బుక్‌లో కొనుగోలు..
లుక్ బుక్ అనే అప్షన్లో ఏ దుస్తులకు, ఏ బూట్లు, నగలు మ్యాచ్ అవుతాయో వివరించేందుకు ప్రత్యేక నిపుణులుంటారు. సంబంధిత ఉత్పత్తుల కింద ఒక లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే పార్ట్నర్ సైట్ల నుంచి కొనుగోలు చేసే వీలుంటుంది. వీటి కోసం అమెజాన్, స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్ వంటి 20-30 ఈ-కామర్స్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ఒక్కో కొనుగోలు మీద 5-15 శాతం క మిషన్ ఉంటుంది. ప్రస్తుతం 3 వేలకు పైగా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయిక్కడ. అప్లీ ఎవర్ యాప్ ద్వారా వివాహ వేడుకలకు బంధువులను ఆహ్వానించవచ్చు. పెళ్లి వేడుకల ఫొటోలను, వీడియోలను షేర్ చేసుకోవచ్చు కూడా.
2.75 కోట్ల నిధుల సమీకరణ..
ప్రస్తుతం మా సంస్థలో 12 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో సీడ్ రౌండ్లో భాగంగా రూ.2.75 కోట్ల నిధులను సమీకరించాం. దేశ, విదేశాలకు చెందిన 8 మంది ఏంజిల్ ఇన్వెస్టర్లు ఈ పెట్టుబడులు పెట్టారు. యూనీ వెరైటీ ఫౌండర్ వరుణ్ అగర్వాల్, ఎజిలిటీ సొల్యూషన్స్ సీటీఓ సురేష్ వెంకట్, పీపుల్ కంబైన్ ఎండీ రాజ్ వై ఇందులో కొందరు. మరో ఆరు నెలల్లో దేశంలోని ద్వితీయ శ్రేణి పట్టణాలతో పాటూ మధ్య ప్రాచ్య, ఉత్తర అమెరికా దేశాలకు మా సేవలను విస్తరిస్తాం. ఇందుకోసం మరో మిలియన్ డాలర్ల నిధులు అవసరమవుతాయి. పలువురు వీసీ ఇన్వెస్టర్లతో మాట్లాడుతున్నాం. ఈ ఏడాది ముగింపులోగా సమీకరిస్తాం.
అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే
startups@sakshi.com కు మెయిల్ చేయండి...