మేఘాలకంటే పైన తేలుతూ ప్రయోగాలు
న్యూఢిల్లీ: ప్రపంచమంతా ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా నిరంతర అభివృద్ధితో దూసుకెళుతున్న భారత్ తన మైలేజ్ కు మరింత ఉపకరించే మరో చర్యను తీసుకుంటోంది. వాతావరణం ఎలా ఉందో ముందుగానే పరీక్ష చేసి దానికి తగిన చర్యలు తీసుకునేందుకు అవసరమైన సలహాలు సూచనలు ఇచ్చేందుకు ఒక ప్రత్యేక విమానం కొనుగోలు చేయనుంది.
ఇది ప్రస్తుతం భూమికి సమీపంలో ఉన్న వాయు పొరపైకి వెళ్లి పరీక్షలు చేయనుంది. దీనిని పుణెకి చెందిన ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ(ఐఐటీఎం-పుణె) మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ ద్వారా దాదాపు రూ.150కోట్లు వెచ్చించి కొనుగోలు చేయనుంది.
వ్యవసాయానికి ఆధారమైనది మేఘం. దాని లక్షణాలు, అందులోని వాయువులు, అవి మారుతున్న తీరును ముందే పసిగడితే దానికి తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. పైగా వర్షం ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పడదో పడితే ఎక్కడ పడుతుందో అనే సమాచారం పక్కాగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అలాంటి పరీక్షలు చేసేందుకు అనువైన ఓ ప్రత్యేక విమానం కొనుగోలు చేస్తున్నారు.
ఈ విమానంలో వాతావరణ శాస్త్రజ్ఞులు ప్రస్తుతం మన కళ్లకు కనిపిస్తున్న మేఘాలకన్నా పైకి వెళ్లి పరీక్షిస్తారు. ఈ విమానం కొనుగోలుకు, ప్రాజెక్టుకు వచ్చే నెలలో టెండర్లు పిలిచి మొత్తం రెండేళ్లలో పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించనున్నారు. ఇదే జరిగితే అగ్ర దేశాల సరసన భారత్ చేరుకోవడంతోపాటు ఈ తరహా విమానం కలిగి పరీక్షలు చేసే దక్షిణాసియా దేశాల్లోని ప్రధాన దేశం అవుతుంది.