అంతరిక్ష రంగం..యు.ఆర్.రావు సేవలు
భారత అంతరిక్ష కార్యక్రమానికి గట్టి పునాదులు వేసిన ముగ్గురిలో ఉడిపి రామచంద్రరావు (యు.ఆర్.రావు) ఒకరు. ఆయన జూలై 24న కన్నుమూశారు. ఇస్రోలో దాదాపు ప్రారంభం నుంచి (ఆర్యభట్ట ఉపగ్రహ ప్రయోగం మొదలు) మంగళ్యాన్ వరకు అనేక విజయవంతమైన అంతరిక్ష కార్యక్రమాలకు దిశానిర్దేశం చేశారు. మూడు దశాబ్దాలకు పైగా అడ్వైజరీ కమిటీ ఆన్ స్పేస్ సైన్సెస్‌కు చైర్మన్‌గా వ్యవహరించి అనేక అంతరిక్ష పరిశోధనలకు మార్గదర్శిగా నిలిచారు.
భారత అంతరిక్ష కార్యక్రమానికి సంబంధించి విక్రమ్ సారాభాయి, ప్రొఫెసర్ సతీష్ ధావన్, యు.ఆర్.రావులను త్రిమూర్తులుగా భావిస్తారు. భారత అంతరిక్ష కార్యక్రమ అభివృద్ధికి యు.ఆర్.రావు విశేష కృషి చేశారు. అంతరిక్ష విజ్ఞాన రంగంలో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. అయితే ఆయనకు ఆ గుర్తింపు అంత సులభంగా రాలేదు. విజయాల వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయి.
ప్రస్తుత ఇస్రో శాస్త్రవేత్తలతో పోలిస్తే ప్రారంభంలో యు.ఆర్.రావు వంటి వారికి అందుబా టులో ఉన్న వనరులు, నిధులు చాలా తక్కువ. ఆ సమయంలో అంతర్జాతీయ సహకారం కూడా అంతంత మాత్రంగానే ఉండేది. అమెరికా తొలినాళ్లలో భారత అంతరిక్ష కార్యక్రమానికి ఎలాంటి సహకారం అందించలేదు. అలాంటి పరిస్థితుల్లో దేశీయ టెక్నాలజీని అభివృద్ధి చేయడమంటే ఆషామాషీ కాదు. ఇప్పటికీ ఉపగ్రహ రాకెట్ నిర్మాణ విజ్ఞానం కొన్ని దేశాలకే పరిమితమవడాన్ని చూస్తే మన శాస్త్రవేత్తల గొప్పదనం అర్థమవుతుంది.
విశేష కృషి
ఇస్రో 1975, ఏప్రిల్ 19న సోవియట్ యూనియన్ సహకారంతో మొదటి ఉపగ్రహం ఆర్యభట్టను విజయ వంతంగా ప్రయోగించింది. దాని నిర్మాణంలో యు.ఆర్.రావు కఠోర శ్రమ, కృషి ఉన్నాయి. సమష్టి కృషితో ఏదైనా సాధించొచ్చనే ‘ఇస్రో సంస్కృతి’కి యు.ఆర్.రావు నాంది పలికారు. ఆయన ఆర్యభట్ట తర్వాత రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల అభివృద్ధికి నడుంబిగించారు. భాస్కర 1, 2, రోహిణి–డీ 2, స్ట్రెచ్డ్ రోహిణి శాటిలైట్ సిరీస్ వంటి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల నిర్మాణంతో రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ అభివృద్ధి, శిక్షణకు గట్టి పునాది పడింది.
ముఖ్యంగా రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల (కార్టోశాట్, రిసోర్స్‌శాట్, ఓషన్‌శాట్) రూపకల్పనలో యు.ఆర్.రావు కృషి ఎంతగానో ఉపయోగపడింది. టెక్నాలజీ ఎక్స్పెరిమెంట్ శాటిలైట్ (ఖీఉ )లో ఒక మీటరు లోపల రిజల్యూషన్ సాధించడం గొప్ప ఘనత. దాన్ని సాధించడంలో యూ.ఆర్.రావు కృషి మరువలేనిది. డా.విక్రమ్ సారాభాయి భారత అంతరిక్ష పితామహుడిగా గుర్తింపు పొందితే.. యు.ఆర్.రావు భారత అంతరిక్ష ఉపగ్రహ పితామహుడిగా ఖ్యాతి గడించారు.
రాకెట్ అభివృద్ధిలో కూడా యు.ఆర్.రావు పాత్ర ఎనలేనిది. 1984–1994 మధ్య (దాదాపు పదేళ్ల పాటు) ఇస్రో చైర్మన్‌గా ఆయన పనిచేశారు. ఆ కాలంలో ఇస్రో కొన్ని కీలక రాకెట్ కార్యక్రమాల్లో వైఫల్యాలు చవిచూసింది. అదే సమయంలో క్రయోజెనిక్ ఇంజన్ సరఫరాను అమెరికా అడ్డుకుంది. రెండో పరిశోధన రాకెట్.. ఏఎస్ఎల్వీ (అగ్మెంటెడ్ శాటిలైట్ వెహికల్), మొదటి రెండు అభివృద్ధి ప్రయోగాలు (ఏఎస్ఎల్వీ– డీ1, ఏఎస్ఎల్వీ–డీ2) విఫలమయ్యాయి. వీటితోపాటు మొదటి పీఎస్ఎల్వీ అభివృద్ధి ప్రయోగం (1993) సైతం విజయవంతం కాలేదు. దీంతో ఇస్రోపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి.
అయినప్పటికీ యు.ఆర్.రావు నేతృత్వంలోని ఇస్రో శాస్త్రవేత్తలు ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా వైఫల్యాలను విశ్లేషించి సరిదిద్దారు. యు.ఆర్.రావు ఆ రకమైన పునాది వేయడంవల్లే నేడు ప్రపంచంలో అత్యంత విజయవంతమైన అతి కొద్ది రాకెట్లలో ఒకటిగా పీఎస్ఎల్వీ నిలిచింది. పీఎస్ఎల్వీ ప్రయోగాల్లో ఇప్పటి వరకు పీఎస్ఎల్వీ–డి1(1993) మాత్రమే విఫలమైంది. ఆ తర్వాత నిర్వహించిన ప్రయోగాలు వరుసగా జయవంతమయ్యాయి. అలాగే దేశీయ క్రయోజెనిక్ పరిశోధన, అభివృద్ధిలో కూడా యు.ఆర్.రావు మార్గదర్శకంగా నిలిచారు. అడ్వైజరీ కమిటీ ఆన్ స్పేస్ సైన్సెస్‌కు మూడు దశాబ్దాలకు పైగా చైర్మన్‌గా ఆయన వ్యవహరించారు.
2020 వరకు ఇస్రో నిర్వహించదలచిన ప్రయోగాల క్యాలెండర్ రూపకల్పనలో కూడా కీలక పాత్ర పోషించారు. ఆయన కృషి ఫలితంగానే ఆస్ట్రోశాట్ వంటి రోదసీ పరిశోధన ఉపగ్రహ రూపకల్పన సాధ్యమైంది. భారత్∙చేపట్టిన చంద్రయాన్–1, మంగళ్యాన్ కార్యక్రమాల్లో శాస్త్రవేత్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తులో ఇస్రో నిర్వహించనున్న చంద్రయాన్–2, అంగారక రోవర్ మిషన్, ఆదిత్య, గ్రహ మిషన్లకు సంబంధించిన కార్యకలాపాల్లో చివరి వరకు ఆయన చర్చల్లో పాల్గొనేవారు. సూర్యుడి కరోనా, క్రోమోస్ఫియర్ అధ్యయనంపై అమితాసక్తి కనబర్చేవారు. ఫలితంగా ఇస్రో త్వరలో ఆదిత్య ఎల్1 ప్రయోగాన్ని నిర్వహించనుంది.
భారత అంతరిక్ష వాణిజ్య సేవలను అంతర్జాతీయంగా విస్తరించే లక్ష్యంతో 1992లో ఆంత్రిక్స్ కార్పొరేషన్ ఏర్పాటులో ఆయన కృషి విశిష్టమైంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతరిక్ష టెక్నాలజీ అనువర్తనాలను విస్తరించాలనే యు.ఆర్.రావు కోరిక ఫలితంగా ఐరాసకు చెందిన సెంటర్ ఫర్ స్పేస్ సైన్స్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఇన్ ది ఏషియా పసిఫిక్... భారత్‌లో ఏర్పాటైంది. దీంతోపాటు అమెరికా, రష్యా, ఐరోపా దేశాలకు చెందినవారి తర్వాత ఐరాసకు చెందిన యూఎన్ కమిటీ ఆన్ పీస్ఫుల్ యూజెస్ ఆఫ్ ఔటర్ స్పేస్‌కు చైర్మన్‌గా వ్యవహరించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.
మార్గదర్శకుడు
కర్ణాటకలోని ఉడిపి దగ్గర ఒక మారుమూల గ్రామంలో జన్మించిన యు.ఆర్.రావు తన కృషి, పట్టుదలతో ఉన్నత శిఖరాలకు ఎదిగారు. అవరోధాలను అధిగమించి దేశ అంతరిక్ష కార్యక్రమానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చారు. ప్రపంచంలోనే తొలిసారిగా ఒకే రాకెట్ (పీఎస్ఎల్వీ–సి37) ద్వారా 104 ఉపగ్రహాలను ఇస్రో నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అదేవిధంగా తొలి ప్రయత్నంలోనే అంగారక కక్ష్యలోకి మంగళయాన్‌ను ప్రవేశపెట్టడానికి యు.ఆర్.రావు దిశానిర్దేశం, మార్గదర్శకత్వం ఎంతగానో ఉపయోగపడింది.