భూ మాఫియాపై ఉక్కుపాదం
అర్బన్ జిల్లా ఎస్పీ రాజేష్‌కుమార్
మంగళగిరి : గుంటూరు, మంగళగిరిలతో పాటు అర్బన్ జిల్లా పరిధిలో భూ మాఫియా ఎక్కువైందని, వీటికి పాల్పడేవారిపై రౌడీషీట్లు తెరిచి, పీడీ యాక్ట్ అమలు చేస్తామని అర్బన్ జిల్లా ఎస్పీ రాజేష్‌కుమార్ పేర్కొన్నారు. పట్టణ పోలీసుస్టేషన్‌ను గురువారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ భూ మాఫియాను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. భూముల ఆక్రమణ, దౌర్జన్యాల్లో ఎంతటి వారున్నా కఠిన చర్యలు తప్పవన్నారు. అర్బన్ జిల్లా పరిధిలో సిబ్బంది కొరత వుందని, రోజు రోజుకి క్రైమ్‌రేటు పెరుగుతోందన్నారు.
సిబ్బంది రిక్రూట్మెంట్ తోపాటు రూరల్ నుంచి కొంతమంది సిబ్బందిని తీసుకుని నేరాల నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ఈ మధ్య కాలంలో ప్రకాశం బ్యారేజి వద్ద చోటుచేసుకుంటున్న పలువురి ఆత్మహత్యల నేపథ్యంలో అక్కడ 24 గంటల నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. బ్యారేజ్‌పైన, దిగువన ప్రత్యేక లైటింగ్ , ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఆత్మహత్యల నివారణతోపాటు అసాంఘిక కార్యకలాపాలు అరికట్టేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.
ప్రకాశం బ్యారేజి నుంచి కనకదుర్గవారధి వరకు ఇరిగేషన్, రెవెన్యూ శాఖల సమన్వయంతో నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్నారు. చైన్‌స్నాచింగ్‌ల నియంత్రణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేస్తున్నామన్నారు. గతంలో చైన్‌స్నాచింగ్‌లు పాతనేరస్తులు చేసేవారని.. ఇప్పుడు జల్సాలకు అలవాటుపడి ఉన్నత చదువులు చదివిన యువకులు ఈ తరహా నేరాలకు పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. చైన్‌స్నాచింగ్‌లు, బ్యాంకుల వద్ద నగదు కాజేసే వారిని పట్టుకునేందుకు ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ఆయన వెంట పట్టణ సీఐ రావూరి సురేష్‌బాబు, ఎస్ఐలు జిలానిబాషా, కృష్ణయ్య, సిబ్బంది ఉన్నారు.