Urea companies
-
గోద్రెజ్ ప్రాపర్టీస్ బోర్లా- ఎన్ఎఫ్ఎల్ ఖుషీ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో రియల్టీ కంపెనీ గోద్రెజ్ ప్రాపర్టీస్ కౌంటర్లో ఒక్కసారిగా అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం తొలి 7 నెలల్లో(ఏప్రిల్- అక్టోబర్) నాన్యూరియా ఫెర్టిలైజర్స్ అమ్మకాలు జోరందుకోవడంతో నేషనల్ ఫెర్టిలైజర్స్(ఎన్ఎఫ్ఎల్) కౌంటర్‌కు డిమాండ్ కనిపిస్తోంది. వెరసి గోద్రెజ్ ప్రాపర్టీస్ కౌంటర్ భారీ నష్టాలతో కళ తప్పగా.. ఎన్ఎఫ్ఎల్ భారీ లాభాలతో సందడి చేస్తోంది. వివరాలు చూద్దాం.. గోద్రెజ్ ప్రాపర్టీస్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో గోద్రెజ్ ప్రాపర్టీస్ నికర లాభం 78 శాతం క్షీణించి రూ. 7 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 65 శాతం నీరసించి రూ. 90 కోట్లకు చేరింది. పన్నుకు ముందు లాభం 69 శాతం పడిపోయి రూ. 22.6 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో గోద్రెజ్ ప్రాపర్టీస్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 9.3 శాతం కుప్పకూలి రూ. 1,036 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1,030 వరకూ వెనకడుగు వేసింది. ఎన్ఎఫ్ఎల్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి 7 నెలల్లో అన్నిరకాల యూరియాయేతర ఎరువుల అమ్మకాలు జోరందుకున్నట్లు నేషనల్ ఫెర్టిలైజర్స్ తెలియజేసింది. డీఏపీ, ఎంవోపీ, ఎన్పీకే తదితర ఎరువుల వాడకంలో రైతులకు కంపెనీ ఇస్తున్న శిక్షణ ఇందుకు దోహదం చేసినట్లు పేర్కొంది. దీనిలో భాగంగా పానిపట్‌లో తయారైన బెంటోనైట్ సల్ఫర్ అమ్మకాలు 3478 ఎంటీ నుంచి 11,730 ఎంటీకి ఎగశాయి. ఇదేవిధంగా ఎస్ఎస్పీ విక్రయాలు 6323 ఎంటీ నుంచి 14,726 ఎంటీకి పెరిగాయి. ఈ నేపథ్యంలో ఎన్ఎఫ్ఎల్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 9 శాతం దూసుకెళ్లి రూ. 32.5 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 34 వరకూ ఎగసింది. -
అన్నదాతపై ‘అనుబంధ’ దాడి
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో యూరియాకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీన్ని ఆసరా చేసుకొని కొన్ని యూరియా కంపెనీలు రైతును దగా చేస్తున్నాయి. తమ కంపెనీ యూరియా కావాలంటే తప్పనిసరిగా అనుబంధ ఉత్పత్తులను రైతులకు విక్రయించాల్సిందేనని డీలర్లకు హుకుం జారీచేస్తున్నాయి. పెద్దఎత్తున లాభాలు ఉండటంతో డీలర్లు కూడా యూరియా కంపెనీల అనుబంధ ఉత్పత్తులను రైతులకు అంటగడుతున్నారు. వాటిని తీసుకోని రైతులను యూరియా ఇవ్వకుండా వేధిస్తున్నారు. ఇలా వందల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నా వ్యవసాయశాఖ మాత్రం చోద్యం చూస్తోంది. జిల్లాల్లో రైతులకు సూచనలు ఇవ్వాల్సిన వ్యవసాయాధికారులు కంపెనీల నుంచి ముడుపులు పుచ్చుకొని రైతులకు హానిచేస్తున్నారన్న విమర్శలున్నాయి. యూరియాకు మూడింతల లాభం... కేంద్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్ కోసం రాష్ట్రానికి 7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించింది. ఆ ప్రకారం కంపెనీలు అమ్మకాలు చేయాలి. దేశవ్యాప్తంగా పేరున్న అనేక కంపెనీలు యూరియాతోపాటు సూక్ష్మపోషక విలువలు కలిగిన అనుబంధ ఎరువుల ఉత్పత్తులను కూడా తయారు చేస్తున్నాయి. వాటిల్లో అనేక ఎరువులకు అనుమతి కూడా లేదని సమాచారం. రాష్ట్రంలో ఏడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాకు సరిసమాన విలువైన 2 లక్షల టన్నుల అనుబంధ ఉత్పత్తులను డీలర్ల ద్వారా విక్రయిస్తున్నట్లు వ్యవసాయశాఖ అంచనా. కొన్ని కంపెనీలు యూరియా ద్వారా కంటే అనుబంధ ఉత్పత్తుల ద్వారానే పెద్దఎత్తున ఆర్జిస్తున్నాయని, ఇది మూడింతలకుపైగా ఉంటుందని వ్యవసాయ అధికారి ఒకరు చెప్పారు. అదనపు ధరకు యూరియా... రాష్ట్రంలో యూరియా బస్తా ధర రూ. 284 ఉండాలి. కానీ రూ. 350-380 వరకు రైతులకు అంటగడుతున్నారు. డీలర్ల వద్దకు చేర్చకుండానే యూరియా కంపెనీలు రేక్ పాయింట్ వద్దే ఎంఆర్పీకి అమ్ముతున్నారు. దీంతో రవాణా ధర వేసుకొని డీలర్లు రైతులకు అధిక ధరకు అమ్ముతున్నారు. ఇది రైతుపై అదనపు భారంగా పడుతోంది. ఏమాత్రం అవసరం లేకపోయినా... యూరియా కంపెనీలు ప్రధానంగా కాల్షియం, మెగ్నీషియం, సల్ఫేట్, జింక్ తదితర సూక్ష్మ పోషకాలతో కూడిన ఎరువుల ఉత్పత్తులను అదనంగా చేస్తున్నాయి. ఇవన్నీ కూడా అత్యధిక ధర ఉన్నవే. శాస్త్రవేత్తలు మాత్రం వీటి అవసరమే ఉండదంటున్నారు. వీటి ద్వారా పంటలకు కలిగే ప్రయోజనం కేవలం 10 నుంచి 15 శాతమే అని చెబుతున్నారు. కానీ వాటి ధర మాత్రం యూరియాకు అనేక రెట్లు ఉంటోంది. యూరియా ధరలు పెరగడానికి అనుబంధ ఉత్పత్తులు ప్రధాన కారణమని అంటున్నారు. పైగా అనుబంధ ఎరువులను నిబంధనలకు విరుద్ధంగా ప్యాక్ చేస్తున్నారు. ప్యాక్‌పై తెలుగు, ఇంగ్లిషుల్లో సమాచారాన్ని ముద్రించాల్సి ఉన్నా రైతులకు అర్థంకాకుండా కేవలం ఆంగ్లంలోనే ముద్రిస్తున్నారు.